ఒక్క సినిమా సీఎం.. ఎన్టీఆర్‌కు నచ్చిన బ్యాంకు ఉద్యోగి

27 Sep, 2019 10:00 IST|Sakshi

ఎన్టీఆర్‌కు నచ్చిన బ్యాంకు ఉద్యోగి   

సీఎం నీలా ఉండాలంటూ అవకాశం   

‘మేజర్‌ చంద్రకాంత్‌’ చిత్రంతో అరంగేట్రం

కొద్దిసేపే కనిపించినా ఆకట్టుకున్న నటన

అనుభవాలను గుర్తు చేసుకున్న హరి విఠల్‌రావు

‘ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి.. నీ రూపం ఆ పాత్రకు సరిగ్గా సరిపోతుంది.. నీ నటనతోనే ఈ సినిమాకు ప్రాణం వస్తుంది’ అంటూ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్‌ ఓ సాధారణ బ్యాంకు ఉద్యోగిని ఒప్పించి ఆ చిత్రంలో నటించేలా చేశారు. అదే ‘మేజర్‌ చంద్రకాంత్‌’ చలనచిత్రం. ఇప్పటికీ ఆయన నటించింది ఆ ఒక్క సినిమాలోనే. ఆ పాత్రలో జీవించి.. జీవితాంతం ఎన్టీఆర్‌తో నటించానన్న సంతృప్తి, సంతోషంతో కాలం గడుపుతున్నారు చింతలపాటి హరివిఠల్‌రావు. ఆ సినిమాలో అవకాశం గురించి తన అనుభవాలు ఇలా చెప్పుకొచ్చారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. – బంజారాహిల్స్‌

మాది విజయవాడ. అప్పట్లో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో డీజీఎంగా పనిచేసేవాడిని. నగరంలోని అబిడ్స్‌లో పని చేస్తున్నప్పుడు ఎన్టీఆర్‌ తరచూ మా బ్యాంక్‌కు వచ్చేవారు. కొన్ని బ్యాంక్‌ పనుల నిమిత్తం ఆయన  ఇంటికి వచ్చివెళుతుండేవారు. నన్ను కలిసిన ప్రతి సందర్బంలోనూ ‘నువ్వు సీఎంలా ఉంటావు’ అంటూ నవ్వేవారు. ఎప్పటికైనా నేను నటించే సినిమాలో సీఎం పాత్ర ఉంటే తప్పకుండా నువ్వే నటించాలంటూ చెబుతుండేవారు. ఇదంతా అయ్యేది కాదు.. పొయ్యేది కాదూ అంటుండేవాణ్ని. లోలోపల నవ్వుకునేవాణ్ని. ఈ నేపథ్యంలోనే 1992– 93లో మేజర్‌ చంద్రకాంత్‌ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయానికి ఎన్టీఆర్‌ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సినిమాలో సీఎం పాత్ర ఉందనగానే ఎన్టీఆర్‌కు నేను గుర్తుకొచ్చాను. ఇంకేముంది సూరత్‌లో పనిచేస్తున్న నన్ను చాలా కష్టపడి ఈ సినిమాలో నటించేందుకు ఒప్పించి నన్ను అక్కడినుంచి రప్పించారు. మేజర్‌ చంద్రకాంత్‌ సినిమాలో నేను సీఎంపాత్రలో నటించేందుకు ఇక్కడికి వచ్చాను. పది రోజుల్లోనే షూటింగ్‌ ప్రారంభమైంది. ఎన్టీఆర్‌తో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. 

భయం.. భయంగా..
సినిమా నటించేందుకు భయంగా ఉందని, నటన రాదని ఎంత చెప్పినా ఎన్టీఆర్‌ వినిపించుకోలేదు. నేను నేర్పిస్తాను నువ్వేం అధైర్యపడవద్దంటూ దగ్గరుండి మరీ భరోసా కల్పించారు. ఆ సినిమాలో నాలుగు సీన్లు ఉన్నాయి. అవన్నీ ఎన్టీఆర్‌తోనే కావడం నా అదృష్టం. నటించింది ఒక్క సినిమాలో అయినా ఎన్టీఆర్‌ పక్కన కనిపించడం ఒక అరుదైన అవకాశమేనని భావిస్తా.

అవకాశాలు వస్తున్నా ఒప్పుకోవడంలేదు..
ప్రస్తుతం శ్రీనగర్‌కాలనీలో నా నివాసం. ఎన్టీఆర్‌తో అప్పట్లో నాకు బాగా సాన్నిహిత్యం ఉండేది. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆ సినిమా షూటింగ్‌ సమయంలో బయట కూర్చుంటే నేను మాత్రం నేరుగా లోనికి వెళ్లేంత చొరవ ఉండేది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించాలని అవకాశాలు వచ్చినా గుర్తుండిపోయేంత స్థాయిలో లేకపోవడంతో వేరేవి ఒప్పుకోలేదు.  ఇప్పటికీ సినిమాల్లో అవకాశాల కోసం తనను కొందరు సంప్రదిస్తున్నా అంగీకరించడంలేదు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు