సాయేషా భార్య కావడం సంతోషం

16 Mar, 2019 12:44 IST|Sakshi
నవ దంపతులు ఆర్య, సాయేషాసైగల్‌

పెరంబూరు: నటి సాయేషా సైగల్‌ తనకు భార్య కావడం సంతోషంగా ఉందని నటుడు ఆర్య పేర్కొన్నారు. కోలీవుడ్‌లో సంచలన నటుడిగా పేరొందిన ఈయన బాలీవుడ్‌ బ్యూటీ సాయేషా సైగల్‌తో కలిసి గజనీకాంత్‌ చిత్రంలో నటించారు. అప్పుడే వీరి మధ్య ప్రేమ తొలకరించడంతో పెళ్లికి దారి తీసింది. ఇరుకుటుంబాల అనుమతితో గత 9వ తేదీన సంగీత్, 10వ తేదీన పెళ్లి హైదరాబాద్‌ వేదికగా వేడుకగా జరుపుకున్నారు. కాగా గురువారం సాయంత్రం చెన్నైలోని ఒక నక్షత్ర హోటల్‌లో వివాహ రిసెప్షన్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో దర్శకుడు విజయ్, నటుడు భరత్, శాంతను పలువురు సినీ ప్రముఖులు పాల్గొని నవ వధూవరులకు శుభాకాంక్షలు అందించారు.

ఈ సందర్భంగా నటి సాయేషాను వివాహమాడడం గురించి ఆర్య తన భావాన్ని వ్యక్తం చేస్తూ సాయేషాను భార్యగా పొందడం సంతోషంగా ఉందన్నారు. గజనీకాంత్‌ చిత్రంలో నటిస్తున్నప్పుడే చిన్న ఆకర్షణ కలిగిందని, ఆ తరువాత స్నేహితులుగా మారామని చెప్పారు. అయితే కాప్పాన్‌ చిత్రంలో నటిస్తున్న సమయంలో తమ మధ్య స్నేహాన్ని గ్రహించిన ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లి నిశ్చింయించారని చెప్పారు. చాలా కాలంగా తల్లిదండ్రులు పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తున్నారని, వారి కోరికను నెరవేర్చేవిధంగానూ, వారికి నచ్చిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. వివాహానంతరం నటించాలా వద్దా అన్న నిర్ణయాన్ని సాయేషాకే వదిలేసినట్లు ఆర్య తెలిపారు. కాగా వివాహానంతరం ఈ జంట టెడ్‌ అనే చిత్రంలో నటించబోతున్నారన్నది తాజా సమాచారం.

మరిన్ని వార్తలు