‘ఇంత దూరం వచ్చారు కానీ ఏం లాభం’

15 Jan, 2019 12:17 IST|Sakshi

ప్రస్తుత కాలంలో స్మార్ట్‌ ఫోన్‌ లేని ప్రపంచాన్ని అస్సలు ఊహించలేము. మనుషుల మధ్య దూరాలను తగ్గించడానికి అలగ్జాండర్‌ గ్రాహంబెల్‌ కనిపెట్టిన టెలిఫోన్‌ మనిషిని మరింత ఒంటరిని చేసింది. సమూహంలో ఉన్నా ఎవరికి వారు ఫోన్‌లో మునిగిపోయి ఒంటరిగా ఉంటున్నారు. స్మార్ట్‌ఫోన్‌ వాడకం మనుషులను ఎంతలా ప్రభావితం చేసిందో ఉదాహరిస్తూ లెజండరీ గాయకురాలు ఆశాభోస్లే ఓ ఫోటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరలవుతోంది. సోమవారం ఆశాభోస్లేను కలవడానికి బాలీవుడ్‌ హీరో అర్జున్‌ కపూర్‌తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కోల్‌కతా వచ్చారు.

అయితే ఆశాను కలవడానికి వచ్చిన వీరు ఆమె ముందు కూర్చొని ఎవరికి వారు ఫోన్లలో బిజీ అయ్యారు. ఆ సమయంలో తీసిన ఫొటోను ఆశా ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘నన్ను చూడటానికి బగ్‌డోగ్రా నుంచి కోల్‌కతా వచ్చారు కానీ ఏం లాభం.. మాట్లాడేవారు ఒక్కరూ లేరు. టెలిఫోన్‌ను కనిపెట్టిన అలెగ్జాండెర్‌ గ్రహంబెల్‌కు ధన్యవాదాలు చెప్పాలి’ అంటూ వ్యంగ్యంగా ట్వీట్‌ చేశారు ఆశా. ఇలా ట్వీట్ చేసిన కొద్దిసేపటికే దాదాపు 22 వేల మంది దీన్ని లైక్‌ చేశారు. ‘ఆశా  చేసిన ట్వీట్‌ నేటితరానికి కనువిప్పులాంటిదం’టూ కొందరు.. ‘అంత గొప్ప గాయని ముందు ఫోన్‌ పట్టుకుని కూర్చోవాలన్న ఆలోచన వారికెలా వచ్చింది?’ అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు