నిర్మాత పైశాచికత్వం; ఆ ఫొటోలో ఉన్నది నేనే!

9 Oct, 2018 15:35 IST|Sakshi
ఫేస్‌బుక్‌లో ఆశా షైనీ షేర్‌ చేసిన ఫొటో

పదేళ్ల క్రితం తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి బాలీవుడ్‌ నటి తనుశ్రీ గళం విప్పిన నాటి నుంచి భారత్‌లో మీటూ ఉద్యమం తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు తమ చేదు అనుభవాలను బయటపెడుతుండగా.. తాజాగా నటి ఆశా(ఫ్లోరా) షైనీ కూడా ముందుకొచ్చారు. నరసింహా నాయుడు, నువ్వు నాకు నచ్చావ్‌, ఆ ఇంట్లో, సర్దుకుపోదాం రండి తదితర తెలుగు చిత్రాలతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు సుపరిచితమైన ఆశా షైనీ కెరీర్‌ తొలి నాళ్లలో తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటపెట్టారు. ప్రేమ పేరిట నమ్మించి, తన జీవితాన్ని, కెరీర్‌ను నాశనం చేసిన వ్యక్తి గురించి #మీటూ స్టోరీ హ్యాష్‌ ట్యాగ్‌తో సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు.

తన మాజీ ప్రేమికుడు, బాలీవుడ్‌ ప్రొడ్యూసర్‌ గౌరంగ్‌ దోషి తనను హింసించినందుకు సాక్ష్యంగా గాయాలతో ఉన్న ఫొటోను పోస్ట్‌ చేసిన ఆశా షైనీ..‘ అది నేనే. ఆరోజు 2007 వాలంటైన్స్‌ డే. అదే రోజు అందరికీ సుపరిచితుడైన, నేనెంతగానో ప్రేమించిన ప్రొడ్యూసర్‌ గౌరంగ్‌ దోషి(దీవార్‌, ఆంఖే వంటి హిట్‌ చిత్రాల నిర్మాత) నన్ను చావబాదాడు. నా దవడలు వాచిపోయేలా కొట్టాడు. ఆరోజే చచ్చిపోతానేమో అన్పించింది. కొన్ని రోజుల తర్వాత అతడి గురించి బయటి ప్రపంచానికి నిజాలు చెప్పాలని ప్రయత్నించాను. కానీ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన ఈ అమ్మాయి(తనను ఉద్దేశించి) మాటలు ఎవరూ నమ్మరని, ముఖ్యంగా తన గురించి ఈ విషయాలు బయటపెడితే నాకే నష్టమని, అవకాశాలు కూడా రావని గౌరంగ్‌ చెప్పాడు. అన్నట్టుగానే అడిషన్‌కు వెళ్లిన ప్రతిసారీ నన్ను తిరస్కరించేవారు. అలాగే అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయేవి.

ఒకానొక సమయంలో అసలు ఈ విషయం ఎందుకు బయటపెట్టానా అని ఎన్నో సార్లు బాధపడ్డాను. కానీ నాలాగే ఎంతో మంది అమ్మాయిల జీవితాలను అతడు నాశనం చేశాడని తెలుసుకున్న తర్వాత నేను చేసింది కరెక్టే కదా అని నన్ను నేను సముదాయించుకున్నాను. కాకపోతే నాలాగా గౌరంగ్‌ బాధితులందరు నేటికీ నోరు విప్పకపోవడం కాస్త బాధించే అంశం. అయితే గౌరంగ్‌ రాక్షసత్వానికి భయపడినందు వల్లే వాళ్లు ముందుకు రావడం లేదు. కానీ నేడు పరిస్థితులు మారాయి. మంచిని ఆదరించే వాళ్లూ ఉన్నారు. ఎవరూ ఎవరికీ తలొగ్గాల్సిన అవసరం లేదు. మీరు ఒంటరి వాళ్లు కాదంటూ’  ఆశా షైనీ ఫేస్‌బుక్‌ పేజీలో రాసుకొచ్చారు.

కాగా కొన్నాళ్లు వెండి తెరకు దూరమైన ఆశా షైనీ..  ఫ్లోరా షైనీగా పేరు మార్చుకున్నారు. తాజాగా ఆమె నటించిన బాలీవుడ్‌ మూవీ ‘స్త్రీ’  సూపర్‌ హిట్‌ టాక్‌తో దూసుకుపోతోంది. శ్రద్ధా కపూర్‌, రాజ్‌కుమార్‌ రావు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాలో ఫ్లోరా షైనీ దెయ్యం పాత్రలో నటించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా