భాగమతి నటి ఫేక్‌ వీడియో.. కేసు నమోదు

6 Jul, 2019 10:24 IST|Sakshi

సినిమాను రూపొందించటమే కాదు ఆ సినిమాను ప్రేక్షకులకు చేరువ చేయటంలోనూ సినీ వర్గాలు సరికొత్త దారులు వెతుకుతున్నారు. అయితే కొన్ని సందర్భాల్లో ఈ ప్రయత్నం బెడిసి కొడుతుంది. తాజాగా ఓ మలయాళ నటికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. భాగమతి సినిమాలో పోలీస్‌ పాత్రలో నటించిన ఆశా శరత్‌ ఇటీవల తన సోషల్‌ మీడియా పేజ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.

ఆశా మేకప్‌ లేకుండా కనిపించిన ఆ వీడియోలో ‘తన భర్త కనిపించటం లేదని, ఆచూకి తెలిసిన వారు కేరళలోని కట్టప్పన్‌ పోలీస్‌ స్టేషన్‌లో తెలియజేయాల’ని కోరారు. పోస్ట్ చేసిన కొద్ది నిమిషాల్లోనే ఆ వీడియో వైరల్‌గా మారింది. దీంతో అభిమానులు నిజమే అనుకున్నారు. విషయం సీరియస్ అవుతుందని గ్రహించిన ఆశా శరత్‌ నెమ్మదిగా అసలు విషయాన్ని బయటపెట్టారు.

తాను ఆ వీడియోను కేవలం ‘ఎవిడే’ సినిమా ప్రమోషన్‌లో భాగంగానే రిలీజ్ చేశానని, నిజంగా తన భర్త కనిపించకుండా పోలేదని వెల్లడించారు. దీంతో ఆశా చేసిన పనిపై నెటిజన్లు మండి పడుతున్నారు. ఇలాంటి పోస్ట్‌లతో నిజమైన వీడియోలను కూడా ప్రజలు నమ్మడం మానేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేరళకు చెందిన లాయర్‌ శ్రీజిత్‌, ఫేక్‌ వీడియో సర్క్యూలేట్‌ చేసినందుకు ఆశా శరత్‌ పై చర్యలు తీసుకోవాలంటూ ఇడుక్కి పోలీస్‌ స్టేషన్‌లో కేసు వేశారు. 

మరిన్ని వార్తలు