అందుకే ఆ ట్యాటూ వేయించుకున్నా

29 Jan, 2020 00:14 IST|Sakshi
నాగశౌర్య

‘‘నటుడిగా అన్ని రకాల సినిమాలు చేయాలనుకుంటాను. ‘లవర్‌ బాయ్‌’ ట్యాగ్‌ మాత్రమే ఇష్టపడను. అన్నీ లవ్‌స్టోరీలే చేసుకుంటూపోతే రోజూ ఒకలాంటి పనే చేస్తున్న భావన కలగడం సహజం. ప్రతిరోజూ సెటికి వెళ్లడం హీరోయిన్‌కి రోజా పువ్వు ఇవ్వడం, పాటలు పాడటమే చేస్తున్నట్టుంది. హీరోయిన్లు మారుతున్నారు కానీ అదే పువ్వు ఇస్తున్నట్టుంది.

శౌర్య ఇది కూడా చేస్తాడు అని ‘అశ్వథ్థామ’ సినిమా నిరూపిస్తుంది’’ అన్నారు నాగశౌర్య. ఆయన కథ సమకూర్చి హీరోగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. మెహరీన్‌ కథానాయిక. రమణతేజ దర్శకత్వంలో ఉషా మూల్పూరి నిర్మించారు. ఈ నెల 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగశౌర్య పంచుకున్న విశేషాలు.

►ప్రస్తుతం అమ్మాయిల మీద జరుగుతున్న అఘాయిత్యల ఆధారంగా ఈ సినిమా కథ రాశాను. విజయవాడ, సంగారెడ్డి, పంజాబ్, ఢిల్లీ వంటి ప్రదేశాలు తిరిగి బాధిత కుటుంబాలతో కలసి చాలా విషయాలు మాట్లాడాను. కథ రాయడం పూర్తయ్యేసరికల్లా నాకు జీవితంలో చాలా విషయాలపై అవగాహన వచ్చిందనే ఫీలింగ్‌ కలిగింది. అందుకే ‘ఈ కథ రాస్తూ జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను’ అని ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌లో చెప్పాను
►ఇందులో విలన్‌ పాత్ర మాత్రమే కల్పితం. మిగతా సంఘటనలన్నీ మా పరిశోధనలో తెలిసినవి, విన్నవే ఉంటాయి. విలన్‌ పాత్ర చాలా క్రూరంగా ఉంటుంది. అతన్ని  ఎదుర్కోవడానికి హీరో పవర్‌ఫుల్‌గా ఉండాలి. ద్రౌపది వస్త్రాపహరణం జరిగేటప్పుడు తప్పు అని చెప్పింది అశ్వథ్థామ ఒక్కడే. ఈ సినిమాకు ఆ టైటిల్‌ అయితేనే బావుంటుంది అని పెట్టాం.  సినిమా చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. పవన్‌కల్యాణ్‌గారి ‘గోపాల గోపాల’ సినిమాలో డైలాగ్‌తో ఈ సినిమా మొదలవుతుంది
►తమిళ సినిమాలు ‘రాక్షసన్, ఖైదీ, ఖాకీ’ తరహాలో ఈ సినిమా ఉంటుంది. చాలా నిజాయితీగా ఈ కథ చెప్పాం. సినిమా నచ్చి జిబ్రాన్‌ నేపథ్య సంగీతం అందిస్తా అన్నారు. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే ఒకలాంటి నిశ్శబ్దం ఇంటిని చుట్టేస్తుంది. ‘నర్తనశాల’ ఫ్లాప్‌ తర్వాత ఆరునెలలు అలాంటి నిశ్శబ్దంలోనే ఉన్నాను. మా అమ్మానాన్నలు కష్టపడి నిర్మిస్తే వాళ్లు తలెత్తుకోకుండా చేశానే అనే ఫీలింగ్‌ ఉంది. వాడికి హిట్‌ ఇవ్వలేదు అని వాళ్లు ఫీల్‌ అవుతూ ఉన్నారు. ఆ దర్శకుడికి ఇచ్చిన మాట కోసం ఆ సినిమా చేశాను. మాట ఇస్తే దానికి కట్టుబడి ఉండాలని నమ్ముతాను
►‘నర్తనశాల’ సినిమా తర్వాత మళ్లీ కొత్తవాళ్లతో సినిమా ఎందుకు అన్నారు. ‘ఊహలు గుసగుసలాడే’ సమయంలో నేనూ కొత్తవాణ్నే. కానీ నన్ను నమ్మి సినిమా అవకాశం ఇచ్చారు కదా. అవకాశం ఇచ్చే వీలు ఉన్నప్పుడు కొత్త టాలెంట్‌ ప్రోత్సహించాలని నమ్ముతాను
►ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్‌ దర్శకత్వంలో ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ చేస్తున్నాను. అందులో 7 గెటప్స్‌లో కనిపిస్తాను. ఆ తర్వాత నందినీ రెడ్డి, సౌజన్య దర్శకత్వంలో సినిమాలు చేస్తాను.

ప్రస్తుతం సినిమాలతోనే ప్రేమలో ఉన్నాను. ఓ లవ్‌స్టోరీ రాస్తున్నాను. మా బ్యానర్‌లోనే నిర్మిస్తాం. ఈ సినిమాలో నేను నటించను. బయట హీరో చేస్తారు.
‘అశ్వథ్థామ’ కథ చాలా ఎమోషనల్‌గా ఉండటంతో మానసికంగా శ్రమ అనిపించేది. కానీ అవుట్‌పుట్‌ సంతృప్తికరంగా అనిపించింది. అందుకే రిలీజ్‌ కాకముందే ‘అశ్వథ్థామ’ అని గుండెల మీద ట్యాటూ వేయించుకున్నాను.

మరిన్ని వార్తలు