ఈ కథ రాస్తూ జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను

27 Jan, 2020 03:18 IST|Sakshi
బుజ్జి, శ్రీచరణ్, గ్యారీ, మెహరీన్, నాగశౌర్య, ఉషా మూల్పూరి, శంకర్‌ప్రసాద్, గౌతమ్, నిరంజన్‌

– నాగశౌర్య

‘‘మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ల మీద చెయ్యేస్తే మనం ఎలా రియాక్ట్‌ అవుతామో ‘అశ్వథ్థామ’ సినిమాలో హీరో అదే చేస్తాడు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం నా కుటుంబమే’’ అన్నారు నాగశౌర్య. ఆయన కథ అందించి,  హీరోగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. మెహరీన్‌ కథానాయిక. రమణ తేజ దర్శకత్వంలో ఈ సినిమాను ఉషా మూల్పూరి నిర్మించారు. జనవరి 31న ఈ సినిమా విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఖమ్మంలో ప్రీ–రిలీజ్‌ ఈవెంట్‌ ఏర్పాటు చేశారు. నాగశౌర్య మాట్లాడుతూ – ‘‘ఇదో నిజాయితీ గల కథ. నా స్నేహితుడి చెల్లికి జరిగిన సంఘటన ఆధారంగా ఈ కథ రాసుకున్నాను. కథ రాస్తున్నాను అన్నప్పుడు అమ్మానాన్న ఎంతో సపోర్ట్‌ చేశారు. ఈ కథ రాస్తూ జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను. నేను ఈ కథ రాయడానికి సమాజంలో చాలా సంఘటనలు ప్రేరేపించాయి’’ అన్నారు. ‘‘ఈ కథ అందర్నీ ఆలోచింపజేస్తుంది’’ అన్నారు మెహరీన్‌.

‘‘సహజంగా నటించే నటుల్లో నాగశౌర్య ఒకరు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలి’’ అన్నారు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌. ‘‘ఈ సినిమాలో కొత్త నాగశౌర్యని చూస్తారు. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన నాగశౌర్యకి థ్యాంక్స్‌’’ అన్నారు దర్శకుడు రమణ తేజ.‘‘ మంచి కథా బలంతో వస్తున్న చిత్రం అశ్వథ్థామ. అందరికీ ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు లైన్‌ ప్రొడ్యూసర్‌ బుజ్జి. ‘‘సినిమాలో నాలుగు పాటలున్నాయి. అన్ని పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు సంగీత దర్శకుడు శ్రీచరణ్‌ పాకాల.

మరిన్ని వార్తలు