రాజుగారి గది 10 కూడా ఉండొచ్చు

13 Oct, 2019 00:24 IST|Sakshi
అశ్విన్‌బాబు

‘‘మంచి మంచి సినిమాలు చేయాలి. అవి ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్‌ చేయాలి. ‘వీడు బాగా చేశాడ్రా’ అని ప్రేక్షకులు అనుకుంటే చాలు ’’ అంటున్నారు అశ్విన్‌బాబు. ‘రాజుగారి గది’ సిరీస్‌లో వస్తున్న మరో చిత్రం ‘రాజుగారి గది 3’. ఓంకార్‌ దర్శకత్వంలో అశ్విన్‌బాబు, అవికా గోర్‌ జంటగా నటించారు. అక్టోబర్‌ 18న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా అశ్విన్‌ మాట్లాడుతూ – ‘‘రాజుగారి గది’ సినిమా చేస్తున్నప్పుడు ఆ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందనే ఆలోచనే లేదు.

ప్రేక్షకులు కోరుకోవడంతో సీక్వెల్‌ రూపొందించాం. మూడో పార్ట్‌ వరకూ వచ్చింది. వాళ్లకు నచ్చితే ‘రాజుగారి గది 10’ కూడా ఉండొచ్చు. సెకండ్‌ పార్ట్‌లో కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్‌ మిస్‌ అయిందన్నారు. అందుకే థర్డ్‌ పార్ట్‌లో ఫుల్‌ ఎంటర్‌టైన్‌మైంట్‌ గ్యారెంటీ. ఓ మలయాళ సినిమా నుంచి తీసుకున్న పాయింట్‌ ఆధారంగా ఈ సినిమా చేశాం. ముందు హీరోయిన్‌గా తమన్నాను అనుకున్నాం. డేట్స్‌ విషయంలో క్లాష్‌ ఏర్పడి ఆమె సినిమా నుంచి తప్పుకున్నారు.

మొదటి రెండు భాగాల్లో నేను కీలక పాత్రలు చేసినా ఈ సినిమా మాత్రం నా భుజాల మీద నడుస్తుంది. సినిమా మీద కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. ప్రస్తుతం నాకు మార్కెట్‌ లేదు. మార్కెట్‌ ఏర్పరచుకుంటున్నాను. నాతో సినిమా చేసే నిర్మాతకు డబ్బు మిగలాలన్నదే నా లక్ష్యం. అన్నయ్య (ఓంకార్‌) టీవీ ప్రోగ్రామ్స్‌ చేస్తున్నప్పటి నుంచి ప్రొడక్షన్‌లో ఉన్నాం. అందుకే నిర్మాతల గురించి ఆలోచిస్తాను. విభిన్న కథల్లో నటించాలనుంది. కుస్తీ బ్యాక్‌డ్రాప్‌కి సంబంధించిన కథ చర్చల్లో ఉంది. ఆ సినిమా వివరాలు త్వరలోనే ప్రకటిస్తాను’’ అన్నారు.

మరిన్ని వార్తలు