వాళ్లెవరూ నటించనన్నారు!

28 Jun, 2018 07:46 IST|Sakshi
అసురవధం చిత్ర దర్శక నిర్వాత శశికుమార్‌ , నందితా శ్వేత

తమిళసినిమా: పలువురు హీరోయిన్లు అసురవధం చిత్రంలో నటించడానికి అంగీకరించలేదని నటుడు, దర్శక నిర్వాత శశికుమార్‌ పేర్కొన్నారు. ఈయన కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం అసురవధం. 7 స్క్రీన్‌ స్టూడియో పతాకంపై లలిత్‌ నిర్మించిన ఈ చిత్రం ద్వారా మరుదు పాండియన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నందితా శ్వేత హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి గోవింద్‌ వసంత్‌ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం చిత్ర యూనిట్‌ చెన్నైలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించింది. చిత్ర కథానాయకుడు శశికుమార్‌ మాట్లాడుతూ ఇంతకు ముందు తన చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పని చేసిన మిత్రుడు ప్రేమ్‌ ఈ చిత్ర దర్శకుడు మరుదు పాండియన్‌ను కథ చెప్పడానికి తన వద్దకు పంపారన్నారు. కథ వినగానే తానే చిత్రాన్ని నిర్మించాలని భావించానని చెప్పారు. అలాంటి సమయంలో నిర్మాత లలిత్‌ సార్‌ మీతో నేను చిత్రం చేయాలని కోరుకుంటున్నానన్నారన్నారు.

నిజానికి తానూ అప్పుడు కాస్త కష్టాల్లో ఉండడంతో ఈ చిత్ర నిర్మాణ బాధ్యతలను లలిత్‌కు అప్పగించానని తెలిపారు. ఆయన, కదిర్‌ కష్ట సమయంలో తనకు అండగా నిలిచారని చెప్పారు. ఈ చిత్ర షూటింగ్‌ను అధిక భాగం కొడైక్కెనాల్‌లో చేశామని, అతి శీతోష్ణంలోనూ చిత్ర యూనిట్‌ అంతా శ్రమ అని భావించకుండా కష్టపడి పని చేశారని చెప్పారు. నిర్మాత లలిత్‌ మీపై నమ్మకం ఉంది, మీరు ఏం అనుకంటే అది చేయండి అని అనడంతో తనకు మరింత భయం అనిపించిందన్నారు. రెండు రోజుల క్రితమే చిత్రం చూపిన నిర్మాత లలిత్‌ సార్‌ తనకు మొదటి చిత్రాన్నే ఉత్తమ చిత్రంగా అందించారని చెప్పడంతో సంతోషం కలిగిందన్నారు. చిత్రంలో నటన తెలిసిన నటిని ఎంపిక చేయండని దర్శకుడికి చెప్పానన్నారు.

అయితే చాలా మంది హీరోయిన్లు ఇందులో నటించడానికి నిరాకరించారని, అలాంటి సమయంలో కథను అర్థం చేసుకుని నటి నందితాశ్వేత నటించడానికి ఒప్పుకున్నారని చెప్పారు. ఇక ఈ చిత్రంలో విలన్‌ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని, ఇలాంటి పాత్రలో నటించడానికి ఎవరూ ఒప్పుకోరని అన్నారు. అలాంటి పాత్రలో రచయిత వసుమిత్రను నటించడానికి ఒప్పించామని తెలిపారు. ఇది మంచివాడు, దుర్మార్గుడిల కథా చిత్రం అని శశకుమార్‌ వెల్లడించారు. అసురవధం చిత్రంలో చాలా ఎమోషనల్, ఘనమైన సన్నివేశాలు కలిగిన పాత్రను తాను నటించగలనని నమ్మి అవకాశం ఇచ్చిన దర్శకుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని నటి నందితా శ్వేత పేర్కొంది. దర్శకుడు మరుదు పాండియన్, నటుడు విసుమిత్ర, నిర్మాత లలిత్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు