ఆ మాట అంటే చాలు

28 Jun, 2018 00:16 IST|Sakshi
ఉదయ్‌ శంకర్‌

‘‘లవర్‌బోయ్‌గా చాలా మంది హీరోలు పరిచయం అవుతుంటారు. వారిలో ఎక్కువ మంది అలా వచ్చి ఇలా వెళ్లిపోతుంటారు. అలా కాకుండా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోవాలి. ‘ఎవడ్రా వీడు.. వైవిధ్యంగా చేశాడు’ అని వారు అంటే చాలు. రొటీన్‌గా కాకుండా డిఫరెంట్‌గా చేసినప్పుడే చూస్తారు. లేకుంటే చూడరు’’ అని హీరో ఉదయ్‌ శంకర్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘ఆటగదరా శివ’. ‘ఆ నలుగురు’ ఫేమ్‌ చంద్ర సిద్ధార్థ్‌ దర్శకత్వంలో రాక్‌లైన్‌ వెంకటేశ్‌ నిర్మించిన ఈ సినిమా జూలై 14న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఉదయ్‌శంకర్‌ పంచుకున్న విశేషాలు...

► నాన్న ఫిలాసఫర్‌. సినిమాల్లోకి వెళతానంటే ఎలా ఒప్పుకున్నారు?
 నాన్న శ్రీరామ్‌గారు ఫిలాసఫీ బోధనలు చేస్తూ, పుస్తకాలు రాస్తుంటారు. అయినప్పటికీ ఆయనకు సినిమాలంటే బాగా ఇష్టం. అన్ని సినిమాలు చూస్తారు. నేను వెళతాననగానే అడ్డు చెప్పలేదు. ‘మన కుటుంబంలో ఎవరూ చిత్ర పరిశ్రమలో లేరు. అంత త్వరగా అవకాశాలు రావు. ఓపికగా, నెమ్మదిగా, పాజిటివ్‌గా ఉండాలి’ అని ప్రోత్సహించారు. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్‌లో శిక్షణ ఇప్పించారు. మా పేరెంట్స్‌తో పాటు వైఫ్‌ సపోర్ట్‌ కూడా నాకు బాగుండేది.

► హీరోగా చాన్స్‌ ఎలా వచ్చింది?
హైదరాబాద్‌లోని మధు, అక్కినేని ఫిల్మ్‌ ఇన్‌స్టిట్యూట్స్‌లో యాక్టింగ్‌లో ట్రైనింగ్‌ తీసుకున్నా. 2007లో శిక్షణ పూర్తి చేసుకుని బయటికొచ్చాక సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నా. దాసరి నారాయణరావుగారి ‘యంగ్‌ ఇండియా’ చిత్రంలో ఓ చిన్న రోల్‌ చేశా. తెలిసిన వారి ద్వారా నిర్మాత రాక్‌లైన్‌ వెంకటేశ్‌గారు పరిచయం. హీరో అవ్వాలనుంది అంటే అవకాశం ఇస్తానని మాట ఇచ్చారు. రవితేజగారి ‘పవర్‌’, రజనీకాంత్‌గారి ‘లింగా’ సినిమాల్లో వెంకటేశ్‌గారు చిన్న పాత్రలు ఇప్పించారు. అన్నట్టే ‘ఆటగదరా శివ’ తో హీరోగా అవకాశం ఇచ్చారు.

► చంద్రసిద్ధార్థ్‌గారితో వర్క్‌ చేయడం...
కన్నడ హిట్‌ మూవీ ‘రామ రామ రే’ సినిమాకి ‘ఆటగదరా శివ’ రీమేక్‌. ఆ చిత్రంలో ఎమోషనల్‌ డ్రామా బాగుంటుంది. దాన్ని కరెక్ట్‌గా స్క్రీన్‌పై చూపించగల దర్శకుడు చంద్రసిద్ధార్థ్‌గారే అని నిర్మాత నమ్మకం. అందుకే డైరెక్టర్‌ చాయిస్‌ వెంకటేశ్‌గారిదే. చంద్రసిద్ధార్థ్‌గారు సినిమా చూసి తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశారు. క్లయిమాక్స్‌ మొత్తం సిద్ధార్థ్‌గారు బాగా రాసుకున్నారు.

► కథ మూలాలేంటి?
నా పాత్ర పేరు గాజులమర్రి బాబ్జీ. నేను ఓ ఖైదీ. ఉరిశిక్ష విధించాక జైలు నుంచి పరారవుతా. అనుకోకుండా నన్ను ఉరి తీయాల్సిన తలారీనే(దొడ్డన్న) కలుస్తా. మేం ఎవరనే విషయం పరస్పరం తెలియకపోవడంతో కలిసి ప్రయాణం చేస్తాం. ఆ ప్రయాణంలోని అనుభవాలు ఏంటన్నది ఆసక్తికరం. ప్రస్తుతం కొన్ని కథలు వింటున్నా. ఫైనల్‌ అవ్వలేదు. ‘ఆటగదరా శివ’ సినిమా విడుదల తర్వాత చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు