పీఆర్‌ టీం అత్యుత్సాహం.. సారీ చెప్పిన హీరో

12 May, 2019 11:10 IST|Sakshi

చాలా సందర్భాల్లో తమ వ్యక్తిగత సిబ్బంది, పీఆర్‌ సిబ్బంది చేసే తప్పుల కారణంగా సెలబ్రిటీలకు ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా సినీరంగంలో ఉన్నవారికి ఇలాంటి అనుభవాలు ఎక్కువగా ఉంటాయి. తాజాగా ఓ హీరోకు సంబంధించిన పీఆర్‌ టీం అత్యుత్సాహం కారణంగా ఏకంగా హీరోనే క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.

కోలీవుడ్ యంగ్ హీరో అధర్వ హీరోగా తెరకెక్కిన మూవీ ‘100’. ఈ  సినిమా రిలీజ్ సందర్భంగా  మీడియా కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక షోలో అధర్వ పీఆర్‌ టీం చేసిన పనికి అధర్వ స్వయంగా క్షమాపణ కోరాల్సి వచ్చింది. ప్రెస్‌కు వచ్చిన శుభకీర్తన అనే మహిళా రిపోర్టర్‌కు పీఆర్‌ టీం టికెట్‌ ఇవ్వలేదు.

ప్రత్యేకంగా ప్రెస్‌ కోసం ఏర్పాటు చేసిన షోలో రిపోర్టర్‌కు టికెట్‌ ఇవ్వకపోగా మీ టికెట్‌ మీరే తీసుకోవాలి మేము సహాయం చేయలేం అంటూ సమాధానమిచ్చారు. తనకు ఎదురైన అనుభవాన్ని శుభకీర్తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ‘ఇలాంటి వారి నుంచి ప్రొఫెషనలిజం ఆశించవద్దనే.. కొత్త పాఠం నేర్పించారు’ అంటూ పీఆర్‌ టీంకు చురకలంటించారు.

ఈ ట్వీట్‌పై స్పందించిన హీరో అధర్వ, దర్శకుడు సామ్‌ ఆంటోన్‌లు శుభకీర్తనను తన టీం తరపున క్షమాపణలు కోరారు. అధర్వ తనను కాంటాక్ట్ చేసిన విషయాన్ని ఆమె తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

మరిన్ని వార్తలు