విశాల్‌ సమస్య విశ్వరూపం దాల్చుతోందా?

9 Jul, 2020 08:05 IST|Sakshi

తమిళ సినిమా(చెన్నై): నటుడు విశాల్‌ కార్యాలయంలో జరిగిన మోసం వ్యవహారం విశ్వరూపం దాల్చుతోందా? ప్రస్తుతం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిన విషయం ఇదే. విశాల్‌ దక్షిణాది చిత్ర పరిశ్రమలో ప్రముఖ కథానాయకుడు రాణిస్తూ  నిర్మాతగా తన వీఎఫ్‌ఎఫ్‌ సంస్థ ద్వారా చిత్రాలను నిర్మిస్తున్నారు. స్థానిక వదలాలని, కుమరన్‌ కాలనీలో కార్యాలయాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో పలువురు సిబ్బంది పని చేస్తున్నారు. అలా రమ్య అనే యువతి విశాల్‌ కార్యాలయంలో అకౌంటెంట్‌గా పనిచేసింది. ఆమె నిధులను దుర్వినియోగం చేసి రూ.45 లక్షల మోసానికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఈ వ్యవహారంపై విశాల్‌ కార్యనిర్వాహకుడు హరి కుమార్‌ స్థానిక విరుగాంబాక్కం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అకౌంట్‌గా పనిచేస్తున్న రమ్య మోసానికి పాల్పడినట్టు వెలుగులోకి వచ్చిందనీ దీని గురించి విచారించి ఆమెపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. (విశాల్ రహస్యాలను బయట పెడతా: రమ్య)

పోలీసులు రమ్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ వ్యవహారం పై స్పందించిన రమ్య మీడియాతో మాట్లాడుతూ తనపై విశాల్‌ వర్గం నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, విశాల్‌ కార్యనిర్వాహకుడు హరి కుమార్‌ తన అనుచరులను పంపించి తనను బెదిరించినట్లు ఆమె పేర్కొంది. అదేవిధంగా కట్ట పంచాయితీలు చేస్తున్నారంటూ విశాల్‌పై పలు ఆరోపణలు గుప్పించింది.

ఈ వ్యవహారం పోలీసుల విచారణలో ఉండగా సోమవారం మరో సంఘటన జరిగింది. స్థానిక కోడంబాక్కంలో నివసిస్తున్న విశాల్‌ కార్యనిర్వాహకుడు హరికుమార్‌ కారును కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో హరికుమార్‌ కోడంబాకం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తన కారును ధ్వంసం చేసిన వ్యవహారంలో అకౌంటెంట్‌ రమ్యకు సంబంధం ఉందనే అనుమానాన్ని ఆయన వ్యక్తం చేశారు. దీనిపై కూడా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు