జూలై 14న ‘అత్తారింటికి దారేది’ ఆడియో!

30 Jun, 2013 04:01 IST|Sakshi
Pawan Kalyan

చిరంజీవి మినహా... మెగా హీరోలకు సంబంధించిన ఏ వేడుక జరిగినా... కార్యక్రమం ఆద్యంతం అభిమానులందరి నోటా నిరంతరాయంగా ప్రతిధ్వనించే మాట ఒక్కటే. ‘పవన్‌కల్యాణ్’. ఆ వేడుకలో ఆయన లేకపోయినా... ఆయన్నే కలవరిస్తుంటారు ఫ్యాన్స్. అభిమానుల హృదయాలపై పవర్‌స్టార్ వేసిన ముద్ర అలాంటిది. మెగా హీరోల వేడుకల సంగతే ఇలా ఉంటే... జరిగేది సాక్షాత్తూ పవర్‌స్టార్ సినిమా వేడుకే అయితే? ఇక అభిమానుల ఆనందానికి అవధులుంటాయా! ఆ పండుగకు రంగం సిద్ధమవుతోంది.

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్‌కల్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ‘అత్తారింటికి దారేది’ అనే టైటిల్ ప్రస్తుతం ఈ సినిమాకి ప్రచారంలో ఉంది. ఈ చిత్రం ఆడియో వేడుకను జూలై 14న నిర్వహించడానికి చిత్ర నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ సన్నాహాలు చేస్తున్నారు. అభిమానుల సమక్షంలో ఘనంగా వేడుకలను జరుపనున్నట్లు సమాచారం.

బహుశా అభిమానులకు ఇంతకు మించిన గుడ్‌న్యూస్ వేరే ఉండదేమో! పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్, దేవిశ్రీ కాంబినేషన్‌లో వచ్చిన ‘జల్సా’ ఆడియో... అప్పట్లో సంగీతసునామీని సృష్టించింది. మళ్లీ అదే కాంబినేషన్‌లో వస్తున్న ఆడియో కావడంతో ఈ పాటలపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన స్వరాలందించారని సమాచారం. ఇటీవలే యూరప్‌లో రెండు పాటలను, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించుకొని ఈ చిత్రం యూనిట్ తిరిగివచ్చింది.

కచ్చితంగా హిట్ కొట్టాలనే కసితో త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. సమంత, ప్రణీత కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో బొమ్మన్ ఇరానీ, నదియా, ముఖేష్‌రుషి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అలీ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్ మూరెళ్ల, సమర్పణ: రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి