5 May, 2018 11:58 IST|Sakshi

విభిన్న దర్శకుడు అవసరాల శ్రీనివాస్‌ స్టైలే వేరు. ఆ విషయం అతని గత సినిమాలను చూస్తే అర్థమవుతుంది. సినిమా కథను నడిపించే విధానం, కథనం అన్నింట్లోనూ తన మార్క్‌ కనిపిస్తుంది. డైరెక్టర్‌గా కొనసాగుతూనే నటుడిగానూ బిజీగా ఉన్నారు అవసరాల శ్రీనివాస్‌. ప్రస్తుతం అవసరాల మెగా కాంపౌండ్ హీరోతో సినిమాకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మెగా ఫ్యామిలీ నుంచి మరో హీరోను ఇండస్ట్రీకి పరిచయం చేసే బాధ్యతను అవసరాల శ్రీనివాస్‌ తీసుకున్నట్లు తెలుస్తోంది. 

వైష్ణవ్‌ తేజ్‌ (సాయి ధరమ్‌తేజ్‌ సోదరుడు), అవసరాల శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా పట్టాలెక్కబోతోందని సమాచారం. అవసరాల టాలెంట్‌పై ఉన్న నమ్మకంతోనే మెగాస్టార్‌ చిరంజీవి అతనికి అవకాశం ఇచ్చినట్లు మెగా కాంపౌండ్‌ చెబుతోంది. ఈయన సినిమాలు సగటు ప్రేక్షకుడికి నచ్చుతాయి. రొమాంటిక్‌ కామెడీలను తెరకెక్కించటంలో తనదైన ముద్ర వేసిన అవసరాల వైష్ణవ్‌ కోసం ఎలాంటి కథ రెడీ చేస్తున్నాడన్న ఆసక్తి నెలకొంది. అంతేకాదు చిరు చిన్న అల్లుడు కల్యాణ్‌ దేవ్‌( చిరు చిన్న కూతురు ​శ్రీజ భర్త)తో కూడా అవసరాల శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో సినిమా ఉండబోతోందన్న ప్రచారం జరుగుతోంది.

మరిన్ని వార్తలు