నాలుగో అవతారం

15 Apr, 2016 23:37 IST|Sakshi
నాలుగో అవతారం

ఇలాంటి సినిమాలు కూడా వస్తాయా? ఇలా కూడా తీస్తారా? అని ప్రపంచవ్యాప్తంగా అందరూ చర్చించుకునేలా చేసిన చిత్రం ‘అవతార్’. ‘టెర్మినేటర్, ఏలియన్స్, టైటానిక్’లను అద్భుతంగా తెరపై సృష్టించిన దర్శకుడు జేమ్స్ కామెరూన్ తీసిన ఈ ‘అవతార్’ అందర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ప్రసుతం కామెరూన్ ఈ చిత్రం సీక్వెల్స్‌ని వర్కవుట్ చేస్తున్నారు. ముందుగా మూడు భాగాలు తీస్తామని చెప్పిన కామెరూన్ ఇప్పుడు నాలుగో భాగాన్ని కూడా ప్రకటించారు.

ఈ నాలుగు భాగాల్లో మొదటిదాన్ని 2018లో, రెండో చిత్రాన్ని 2020లో, మూడో సీక్వెల్‌ని 2022లో, నాలుగో భాగాన్ని 2023లో విడుదల చేయాలనుకుంటున్నారు. ‘అవతార్’ 2009లో విడుదలైన విషయం తెలిసిందే. గత ఏడేళ్లుగా సీక్వెల్స్ పని మీదే ఉన్నారు జేమ్స్ కామెరూన్. హాలీవుడ్‌కి చెందిన నలుగురు ప్రముఖ రచయితలతో ‘అవతార్’ ప్రపంచం ఎలా ఉండాలనే విషయంపై చర్చలు జరుపుతున్నానని ఆయన వెల్లడించారు. ఈ సీక్వెల్స్ అసలు సిసలైన వెండితెర అద్భుతాలుగా నిలుస్తాయని కూడా ఆయన అన్నారు.

ముందు మూడు భాగాలే అనుకున్నప్పటికీ ఈ కథ పరిధి ఎక్కువ కావడం వల్ల నాలుగో భాగం కూడా చేయాలనుకున్నామని కామెరూన్ చెప్పారు. అసలు ‘అవతార్’ లాంటి సాంకేతిక అద్భుతాలను ఒకసారి తీయడమే పెద్ద విషయం. అలాంటిది నాలుగు భాగాలు తీస్తున్నారంటే సినిమా పట్ల ఎంతో ప్యాషన్, టెక్నాలజీ మీద బాగా అవగాహన... అన్నింటికీ మించి ఓర్పు కావాలి. ఇవన్నీ ఉన్నవాళ్లని ‘కామెరూన్’ అంటారేమో.