‘అవెంజర్స్‌ : ఎండ్‌ గేమ్‌’ ఎలా ఉందంటే!

26 Apr, 2019 14:28 IST|Sakshi

ప్రస్తుతం ప్రపంచమంతా అవెంజర్స్‌ ఫీవర్స్‌ కనిపిస్తుంది. ఎన్నికలు, ఐపీఎల్‌ సీజన్‌ నడుస్తున్నా.. భారత్‌లోనూ ఈ ఫీవర్‌ గట్టిగానే కనిపిస్తుంది. అడ్వాన్స్‌ బుకింగ్స్‌, థియేటర్ల ముందు టికెట్ల కోసం క్యూ లైన్లు చూస్తుంటే ఆ విషయం స్పష్టమవుతుంది. ఇతంటి భారీ అంచనాల మధ్య శుక్రవారం ‘అవెంజర్స్‌ : ఎండ్‌ గేమ్‌’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

మార్వెల్‌ సంస్థ తెరకెక్కించిన సూపర్‌ హిట్ సూపర్‌ హీరో సీరిస్‌లో ఈ  సినిమా చివరిది కూడా కావటంతో ముగింపు ఎలా ఇవ్వబోతున్నారు అని తెలుసుకునేందుకు అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు. ఇంతటి భారీ సిరీస్‌కు ముగింపు ఎలా ఇచ్చారు.? చివరకు సూపర్‌ హీరోస్‌ అంతా ఏమయ్యారో తెలుసుకునేందుకు ప్రపంచమంతా ఎదురుచూసింది.

గత చిత్రం ఇన్ఫినిటీ వార్‌ను ఎక్కడ ముగించారో అక్కడి నుంచే ఎండ్‌ గేమ్‌ కథను ప్రారంభించారు. ఇన్ఫినిటీ వార్‌లో ఓటమి పాలైన అవెంజర్స్‌ ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతారు. తన దగ్గర ఉన్న మణుల శక్తితో విశ్వంలోని సగం ప్రాణికోటిని అంతం చేసిన థానోస్‌ను అంతమొందిస్తారు. ఇది జరిగిన 5 సంవత్సరాల తరువాత అవెంజర్స్‌కు మరో విషయం తెలుస్తుంది. టైం మేషీన్‌ ద్వారా గతంలోకి వెళ్లి, థానోస్‌ ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఉపయోగించిన మణులను సాధించగలిగితే.. చనిపోయిన వారందరినీ తిరిగి బతికించగలమని తెలుస్తోంది. ఆ మణులను సాదించేందుకు అవెంజర్స్‌ ఎలాంటి సాహసాలు చేశారు.? ఈ ప్రయత్నంలో వాళ్లకు ఎదురైన సమస్యలేంటి.? వాళ్లు అనుకున్నట్టుగా ప్రాణికోటిని తిరిగి బతికించగలిగారా..?  అన్నదే ఎండ్‌ గేమ్‌ కథ. (చదవండి : గూగుల్‌లో 'థానోస్‌' అని సెర్చ్‌ చేస్తే ఏమౌతుందో తెలుసా?)

గత చిత్రాలతో పోలిస్తే ఎండ్‌గేమ్‌ను మరింత ఎమోషనల్‌గా రూపొందించారు. ఒక్క హల్క్‌ మినహా ప్రతీ పాత్రను తమకు ఇష్టమైన వాటిని కోల్పోయిన నేపథ్యం తోనే నడిపించారు. ఈ సిరీస్‌లోని గత చిత్రాలు ఎక్కువగా హీరోయిజం, కామెడీ, యాక్షన్‌ ప్రధానంగా తెరకెక్కగా.. ఎండ్‌ గేమ్‌ మాత్రం అనుబంధాలు, భావోద్వేగాలు ప్రధానంగా తెరకెక్కించారు. అయితే అవెంజర్స్‌ సినిమాలను ఇష్టపడే అభిమానులను మాత్రం నిరాశపరచలేదు. కామెడీతో పాటు భారీ యాక్షన్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ అలరిస్తాయి.

ముఖ్యంగా అవెంజర్స్‌ సిరీస్‌లో కనిపించిన ప్రతీ సూపర్ హీరోను క్లైమాక్స్‌లో భాగం చేసి అభిమానులకు మరింత కనువిందు చేశారు చిత్రయూనిట్. తమకు అలవాటైన పాత్రల్లో హాలీవుడ్ స్టార్స్‌ ఒదిగిపోయారు. గ్రాఫిక్స్‌, సెట్స్‌ సినిమాను విజువల్‌ వండర్‌గా మార్చేశాయి. తొలి భాగం అంతా పాత్రలను తిరిగి కలిపేందుకు తీసుకున్న దర్శకులు కథను కాస్త నెమ్మదిగా నడిపించారు. ద్వితీయార్థం అంతా ఎమోషనల్‌ సీన్స్‌తో నడిపించి క్లైమాక్స్‌ కు వచ్చే సరికి కళ్లు చెదిరే భారీ యాక్షన్‌తో ముగించారు. గత చిత్రాలు చూడని వారికి కాస్త గందరగోళంగా అనిపించినా.. ఓవరాల్‌గా ‘అవెంజర్స్‌ : ఎండ్‌ గేమ్‌’ ఆడియన్స్‌కు కొత్త అనుభూతినిస్తుందనటంలో సందేహం లేదు.

మరిన్ని వార్తలు