అద్దంలో చూసుకొని భయపడ్డాను

15 Oct, 2019 00:22 IST|Sakshi
అవికా గోర్‌

‘‘సినిమా రిలీజ్‌ అయిపోతే మార్చడానికి ఏమీ ఉండదు. కానీ సీరియల్స్‌ విషయానికి వస్తే గత ఎపిసోడ్‌లో జరిగిన తప్పులను ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవచ్చు. టీవీ ద్వారానే పాపులారిటీ సంపాదించాను. అందుకే టాలీవుడా? బాలీవుడా? టీవీ ఇండస్ట్రీయా? అని అడిగితే ఎప్పుడూ టీవీకే నా ఓటు’’ అన్నారు అవికా గోర్‌. ‘చిన్నారి పెళ్లి కూతురు’ సీరియల్‌ ద్వారా గుర్తింపు పొంది హీరోయిన్‌గా మారారామె. ఓంకార్‌ దర్శకత్వంలో అశ్విన్‌ హీరోగా నటించిన ‘రాజుగారి గది 3’లో హీరోయిన్‌గా నటించారు అవికా. ఈ నెల 18న ఈ సినిమా రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా అవికా మాట్లాడుతూ – ‘‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమా తర్వాత వరుసగా టీవీ షోలు, ఒక హిందీ సినిమా చేశాను. అందుకే తెలుగులో సినిమాలు చేయలేకపోయాను. పేరుకి చేశాం అనేట్టు సినిమా అంగీకరించడం నాకు ఇష్టం ఉండదు. ప్రస్తుతం ‘ఖత్రా’ అనే టీ షో చేస్తున్నాను. ఆ సమయంలో ఓంకార్‌గారు కలసి ‘రాజుగారి గది 3’ కథ చెప్పారు. ఈ సినిమాలో ముందు తమన్నాను అనుకున్నాం, డేట్స్‌ క్లాష్‌తో ఆమె తప్పుకున్నారు అని ముందే చెప్పారు. ఆయన కథ చెప్పడం పూర్తయ్యే సమయానికి భయపడిపోయాను. హారర్‌ సినిమాలు ఒక్కదాన్నే చూడటానికి భయపడుతుంటాను.

ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ ఉంటేనే చూస్తాను. ఈ సినిమా షూటింగ్‌ స్టార్ట్‌ అయ్యాక పూర్తి మేకప్‌ వేసుకున్నాక నన్ను నేను అద్దంలో చూసుకుని,  భయపడ్డాను. మా నాన్నగారైతే ‘ఇదే నువ్వు’ అని ఆటపట్టించారు. ప్రేక్షకులు భయపడుతూనే విపరీతంగా నవ్వుతారు. అదే మా సినిమా హైలెట్‌. ప్రస్తుతం తెలుగు అర్థం అవుతోంది. నేర్చుకుంటున్నాను. సెట్లో పెద్ద పెద్ద టెక్నీషియన్స్‌తో వర్క్‌ చేయడం మంచి ఎక్స్‌పీరియన్స్‌. అలీగారి లాంటి లెజెండ్‌తో నటించడం మర్చిపోలేను. కుదిరితే బిగ్‌ బాస్‌ షో హోస్ట్‌ చేయాలనుంది కానీ బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లలేను. ఒక తెలుగు ప్రాజెక్ట్‌ కమిట్‌ అయ్యాను. త్వరలోనే ప్రకటిస్తాను’’ అన్నారు.


అన్ని ఇండస్ట్రీల్లో తెలుగు ఇండస్ట్రీ బెస్ట్‌ అని నా అభిప్రాయం. ఇక్కడ ఉన్నంత ప్లానింగ్, పద్ధతి ఎక్కడా ఉండదు. జూలైలో సినిమా ప్రారంభించి అక్టోబర్‌లో వచ్చేస్తున్నాం. యాక్టర్‌గా నాకు మంచి ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చింది తెలుగు ఇండస్ట్రీయే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా