ప్రేక్షకులకు ఆయన హాస్యం ఎంతో తుత్తి!

8 Nov, 2013 23:14 IST|Sakshi
ప్రేక్షకులకు ఆయన హాస్యం ఎంతో తుత్తి!

 ‘నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి’ అన్నట్లుగా... ‘తుత్తి తీరా’ అదే... తృప్తి తీరా నవ్వించి, నవ్వించి కన్నీళ్లు తెప్పించిన ఏవీఎస్... ఇప్పుడు ఒక్కసారిగా ఏడిపించేశారు. కానరాని లోకాలకు తరలివెళ్లి... హాస్యప్రియులందరినీ దుఖఃసాగరంలో ముంచేశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన... శుక్రవారం హైదరాబాద్‌లోని తన స్వగృహంలో కన్నుమూశారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమనే కాక, తెలుగువారందరినీ దిగ్భ్రాంతికి లోను చేశారు.  
 
 అది 1993వ సంవత్సరం. బాపు, రాజేంద్రప్రసాద్‌ల ‘మిస్టర్ పెళ్లాం’ సినిమా విడుదలైంది. ‘పెళ్లి పుస్తకం’ కాంబినేషన్ కదా... ఆటోమేటిగ్గా క్రేజ్ ఉంటుంది. పైగా బాపుగారి సినిమా. అందుకే... ఏదో ఉంటుందని జనాల ఆశ. ఆ నమ్మకంతోనే థియేటర్లు నిండాయి. సినిమా సాఫీగా సాగిపోతోంది. మొగుడూపెళ్లాల గిల్లి కజ్జాలు, పిల్లకాయల అల్లరి చేష్టలు, ముళ్లపూడి మార్క్ పం(మం)చి డైలాగ్స్... ఓవరాల్‌గా సరదాగానే సాగిపోతోంది సినిమా. కానీ ఎక్కడో ఏదో వెలితి. అప్పుడొచ్చింది ఓ కేరక్టర్. ‘ఎవరీ కొత్తతనూ... బాపు గీచిన జెంటిల్‌మెన్ బొమ్మలా ఉన్నాడే’ అనుకున్నారంతా. వారి అభిప్రాయం తారుమారవ్వడానికి క్షణం పట్టలేదు. చిత్రమైన నత్తితో... ‘నాకు అదో తుత్తి’ అన్నాడంతే. థియేటర్ నవ్వుల్తో ఘొల్లుమంది. సినిమా ‘హిట్’ అన్నారంతా.
 
 ‘తుత్తి సుబ్రమణ్యం’... అప్పట్లో ప్రతి తెలుగు లోగిలిలో వినిపించిన పేరు. ‘నిజంగా తనకు నత్తేమో’ అనుకున్నవారు కోకొల్లలు. కాలక్రమంలో ఆ తుత్తి సుబ్రమణ్యమే... ఏవీఎస్‌గా తెలుగు తెరపై ఓ కొత్త కామెడీ శకానికి నాంది పలుకుతాడని అప్పుడు ఎవరూ ఊహించి ఉండరు.  ఆ మాటకొస్తే... ‘మిస్టర్ పెళ్లాం’లో తాను పోషించిన ‘గోపాల్’ పాత్ర... రెండు దశాబ్దాల తన సినీ ప్రస్థానానికి నాందిగా నిలుస్తుందని బహుశా ఏవీఎస్ కూడా అనుకొని ఉండరు. నిజానికి ‘మిస్టర్ పెళ్లాం’ కంటే ముందే తెలుగు సినిమాకు ఏవీఎస్ పరిచయం. జంధ్యాల ‘ముద్దమందారం’ సినిమాలో ఓ బడ్డీ కొట్టు యజమానిగా కనిపిస్తారాయన.
 
 ఏవీఎస్ స్వస్థలం గుంటూరు జిల్లా తెనాలి. అసలు పేరు ఆమంచి వెంకట సుబ్రమణ్యం. సద్భ్రాహ్మణ కుటుంబంలో పుట్టారు. ఆయనకు భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. చిన్నప్పట్నుంచీ ఏవీఎస్‌కి కళలపై మమకారం. తెనాలిలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే ‘లలిత కళాసమైఖ్య’లో సభ్యునిగా కొనసాగారు ఏవీఎస్. ఆ తర్వాత ఆయనే సొంతంగా ‘రసమయి’ అనే సంస్థను స్థాపించి పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. సాంఘిక నాటకాలు కూడా వేసేవారు. సినిమా హాళ్లలో వ్యాపార ప్రకటనలు, స్లయిడ్స్ కూడా చేయించేవారు. తర్వాత కొన్నాళ్లు ఒంగోలులో ‘ఆంధ్రజ్యోతి’ పత్రికా విలేకరిగా పనిచేశారు.  
 
 దూరదర్శన్‌లో ప్రసారమైన ‘నవ్వితే నవ్వండి’ అనే కార్యక్రమం ఏవీఎస్ కెరీర్‌ని మలుపు తిప్పిందని చెప్పాలి. ఈ కార్యక్రమంలో ఏవీఎస్ నటన నచ్చి... ‘శ్రీనాథ కవిసార్వభౌమ’ సినిమాలో అవకాశం ఇచ్చారు బాపు. కెరీర్ ప్రారంభంలోనే మహానటుడు ఎన్టీఆర్‌తో తెరను పంచుకునే అవకాశం రావడంతో పులకించి పోయారు ఏవీఎస్. అయితే... ఆ సినిమా ప్రారంభం కాస్త లేట్ అవ్వడంతో... ‘మిస్టర్ పెళ్లాం’లో ‘గోపాల్’ పాత్ర ఇచ్చారు బాపు. ఆ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయారు ఏవీఎస్.
 
 90ల్లో స్టార్ డెరైక్టర్లుగా వెలిగిన ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డిల ప్రతి సినిమాలో ఏవీఎస్ ఉండాల్సిందే. ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘శుభలగ్నం’(1994) ఏవీఎస్‌కి సెకండ్ బ్రేక్. ‘బాగున్నారా? మీ ఇంట్లో గోడ ఉందా? దానిమీద బల్లి ఉందా? మంచానికి నల్లి ఉందా?’ అంటూ ఆయన పోషించిన పశ్నాపత్రం పాత్ర ప్రేక్షకుల పొట్టల్ని చెక్కలు చేసింది. ఆయన దర్శకత్వంలోనే వచ్చిన ‘ఘటోత్కచుడు’ చిత్రంలో ‘రంగు పడుద్ది’ అని ఏవీఎస్ చెప్పిన డైలాగు తెలుగునాట యమ పాపులార్. అలాగే ఈవీవీ దర్శకత్వంలో వచ్చిన ఆమె, ఆయనకిద్దరు, ఇంట్లో ఇల్లాలు-వంటిట్లో ప్రియురాలు... ఇలా పలు చిత్రాల్లో చక్కని కామెడీని పండించారు ఏవీఎస్. దాదాపు 500 చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారు.
 
 ఏవీఎస్ పౌరాణిక పాత్రలు కూడా పోషించారు. ‘అన్నమయ్య’ చిత్రంలో నారదుడిగా తక్కువ నిడివి ఉన్న పాత్ర చేశారాయన. ఆ పాత్రే ‘భాగవతం’లాంటి గొప్ప ధారావాహికలో నారదునిగా నటించే అవకాశాన్ని ఆయనకు తెచ్చిపెట్టింది. తన గాడ్‌ఫాదర్ బాపునే ఈ ధారావాహికకు దర్శకుడు కావడం విశేషం. ఈ సీరియల్‌లో నారదునిగా ఏవీఎస్ నటన ప్రశంసలందుకుంది. ‘శ్రీకృష్ణార్జున విజయం’లో శకునిగా నటించిన ఏవీఎస్ చిత్రగుప్తునిగా కూడా కొన్ని సినిమాల్లో మెప్పించారు ఏవీఎస్‌కు ‘డెరైక్షన్’ అంటే ఇష్టం. ఆయన దర్శకత్వంలో సూపర్‌హీరోస్, ఓరి నీ ప్రేమ బంగారం కాను, రూమ్‌మేట్స్, కోతిమూక చిత్రాలు విడుదలయ్యాయి. అంకుల్, ఓరి నీ ప్రేమ బంగారం గాను చిత్రాలకు నిర్మాత కూడా ఏవీఎస్సే. కమెడియన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న క్రమంలో నిర్మాణం, దర్శకత్వం వైపు దృష్టి సారించి... అవి సరిగ్గా ఆడకపోవడంతో ఇబ్బందుల్ని కూడా ఎదుర్కొన్నారాయన. మణిశర్మను ‘సూపర్‌హీరోస్’ చిత్రం ద్వారా సంగీత దర్శకునిగా పరిచయం చేశారు. తెలుగు చలనచిత్ర నటీనటుల సంఘం(మా)కి మూడు పర్యాయాలు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఏవీఎస్ రచయిత కూడా. ‘ఉత్తినే’ పేరుమీద ఆయన రాసిన వ్యాస సంకలనం పలువురి ప్రశంసలందుకుంది.  
 ‘నేను నవ్వను...’ అని భీష్మించుకొచి1 కూర్చున్న వాడ్ని సైతం... పగలబడి నవ్వించేంత ప్రతిభాశాలి, బహుముఖ ప్రజ్ఞాశాలీ ఏవీఎస్. ఆయన పేరు వినగానే.. ప్రేక్షకుల పెదవులు ఆటోమేటిగ్గా విచ్చుకుంటాయి. అసలు పేరు ‘ఆమంచి’ వెంకట సుబ్రమణ్యం అయినా.. అందరితో ‘మామంచి’ వెంకట సుబ్రమణ్యం అనిపించుకున్న ఏవీఎస్‌కి నవ్వించడం ఓ ‘తుత్తి’. అందుకే తృప్తి తీరా ప్రేక్షకుల్ని నవ్వించారు. ఇప్పుడు దూరమై అందరినీ ఏడిపిస్తున్నారు.