‘ఒట్రై పన్నై మరం’కు అవార్డుల పంట

24 Jan, 2019 07:39 IST|Sakshi

తమిళసినిమా: ఇప్పుడు తమిళ సినిమా ప్రపంచ దేశాలు తిరిగి చేసే స్థాయికి చేరుకుందని చెప్పడం అతిశయోక్తి కాదు. వాస్తవ సంఘటనలతో యథార్ధానికి అద్దం పట్టేలా యువ దర్శకులు వినూత్న ప్రయత్నాలతో తమ ప్రతిభను చాటుకుంటున్నారు. అలా పుదియవన్‌ రాసయ్య తెరకెక్కించిన చిత్రం ఒట్రై పన్నై మరం (సింగిల్‌ ఫామ్‌ ట్రీ). నిర్మాత ఎస్‌.తణికైవేల్‌ తన ఆర్‌ఎస్‌ఎస్‌ఎస్‌ పిక్చర్స్‌ పతాకంపై నిర్మించిన చిత్రం ఇది. ఈయన ఇంతకు ముందు నేట్రుఇండ్రు, ఇరవుమ్‌ పగలుమ్, పోకిరి మన్నన్‌ చిత్రాలను విడుదల చేశారన్నది గమనార్హం. తాజాగా తనే నిర్మాతగా మారి తీసిన చిత్రం ఈ ఒట్రై పన్నై మరం. ఈ చిత్ర వివరాలను నిర్మాత ఎస్‌.తణికైవేల్‌ తెలుపుతూ మంచి కథా చిత్రాలను నిర్మించాలన్న ఆశయంతో ఈ రంగంలోకి వచ్చానన్నారు. ఈ చిత్రం గురించి చెప్పాలంటే యుద్ధం ముగిసే తరుణంలో ప్రారంభమయ్యే ఈ చిత్ర కథ సమకాలీన పరిస్థితుల్లో యుద్ధ వీరులకు, సాధారణ ప్రజలకు మధ్య జరిగే సంఘటనలను ఇంతవరకూ ఎవరూ చెప్పని పలు ఆసక్తికరమైన విషయాలను ఆవిష్కరించే చిత్రంగా ఉంటుందన్నారు.

సహజత్వంలో కూడిన నటన, సన్నివేశాల చిత్రీకరణ, హృదయాలను హత్తుకునే ఊహించని మలుపులతో కూడిన కథా, కథనాలు ప్రేక్షకులను అందులో లీనం చేస్తాయని అన్నారు. శ్రీలంకలోని కిళినోచ్చియిల్‌ గ్రామంలో జీవితాన్నిచ్చి చంపేలాంటి ఇతి వృత్తంతో తెరకెక్కించిన చిత్రం ఒట్రై పన్నై మరం అని చెప్పారు. ఈ చిత్రం 37వ అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శింపబడి, ఉత్తమ నటుడు, ఉత్తమ ఛాయాగ్రహకుడు, ఉత్తమ సంగీతం తదితర 12 అంతర్జాతీయ అవార్డులను గెలుచుకుందని చెప్పారు. ఉత్తమ దర్శకుడు అవార్డు గ్రహీత దర్శకుడు పుదియవన్‌ రాసైయ్య తెరకెక్కించిన ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత సురేష్‌ కళాదర్శకత్వం వహించారని తెలిపారు. అదే విధంగా అంతర్జాతీయ అవార్డులను గెలుచుకున్న మహింద్‌ అభిషేక్‌ దీనికి ఛాయాగ్రహణను అందించారని చెప్పారు. ఇందులో పుదివయన్‌ రాసైయ్య, నవయుగ, అజాతిక పుదియవన్, పెరుమాళ్‌ కాశీ, మాణిక్కం జగన్, తనువన్‌ ప్రధాన పాత్రలు పోషించినట్లు నిర్మాత తెలిపారు. త్వరలోనే చిత్రాన్ని విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.

మరిన్ని వార్తలు