చంపేస్తామని నటి భర్తకు ఫోన్‌ కాల్స్‌

29 Jul, 2017 12:26 IST|Sakshi
చంపేస్తామని నటి భర్తకు ఫోన్‌ కాల్స్‌
ముంబయి: ప్రముఖ నటి ఆయేషా టకియా భర్తకు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి ఆయనను చంపేస్తామని బెదిరించారు. అయేషా టకియా ఓ హిందువు అని, లవ్‌ జిహాద్‌లో భాగంగాన ఆమెను వివాహం చేసుకున్నావని, త్వరలోనే ఆయన కుటుంబం మొత్తాన్ని హత్య చేస్తామని బెదిరించారు. ఈ మేరకు ఆయేషా భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల (జులై) 21న ఆయనకు బెదిరింపు ఫోన్‌ కాల్‌ రాగా ఆయన 26న పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తాజాగా మీడియాకు తెలిసింది.

అయేషా టకియాను సమాజ్‌ వాది పార్టీ నేత అబూ అజ్మీ కుమారుడు ఫర్హాన్‌ అజ్మీని 2009లో వివాహం చేసుకున్నారు. వారికి మిఖెయిల్‌ అనే బాలుడు కూడా ఉన్నాడు. అయితే, తాజాగా పోలీసులకు చేసిన ఫిర్యాదులో హిందూ సేనకు సంబంధించిన వాళ్లే ఈ పనిచేశారని పర్హాన్‌ తండ్రి అబూ అజ్మీ పేర్కొన్నారు. 'మీరంతా జంతువులు. లవ్‌ జిహాద్‌ పేరిట మీరు ఓ హిందువు మహిళను వివాహం చేసుకున్న విషయాన్ని మర్చిపోయారా? త్వరలోనే మీ కుటుంబాన్ని చంపేస్తాం. బాంబులు పెట్టి మరీ ఈ పనిచేస్తాం' అంటూ బెదిరింపు ఫోన్‌ కాల్‌ వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.