తెలుగమ్మాయిగా వెలగాలనుంది

17 Apr, 2017 02:29 IST|Sakshi
తెలుగమ్మాయిగా వెలగాలనుంది

బాహుబలి ఫేమ్‌ భానుశ్రీతో ఇంటర్వ్యూ
అసలు పేరు స్వప్న. దానికంటే బాహుబలి భానుశ్రీ అంటేనే సుపరిచితం. బాహుబలి సినిమాలో తమన్నా స్నేహితురాలిగా నటించి మెప్పించారు. అంతేకాదు తమన్నాకు డూప్‌గా కీలకమైన సన్నివేశాల్లోనూ నటించారు.  పుట్టింది వరంగల్‌లో, పెరిగింది హైదరాబాద్‌లో. ఇంటర్మీడియెట్‌ వరకు చదివారు. అనంతరం తనకు నచ్చిన వెండితెర వైపు  అడుగులు వేశారు. విజయవాడలో ఇటీవల జరిగిన ‘వెడ్డింగ్‌ నీడ్స్‌’ వెబ్‌సైట్‌ లోగో లాంచ్‌కు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో ముచ్చటించారు.  ఆ వివరాలు ఆమె మాటల్లోనే..       


బాహుబలిలో భాగమైనందుకు ఆనందంగా ఉంది
ఇంటర్మీడియెట్‌ వరకూ చదువుకున్నాను. ఫిల్మ్‌ ఇండస్ట్రీపై ప్యాషన్‌ ఎక్కువ. అందుకే చదువు ఆపేశాను. మా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహించారు. నేను మొదట ‘జాబిలమ్మ’ టీవీ సీరియల్‌లో నటించాను. ఆ తరువాత నాకు ‘బాహుబలి’ చిత్రంలో తమన్నా పక్కన సపోర్టింగ్‌ క్యారెక్టర్‌గా నటించే అవకాశం వచ్చింది. కత్తి ఫైట్స్‌ చేసే షాట్స్, పాటలో లాంగ్‌షాట్స్‌లో తమన్నాకు డూప్‌గా చేశాను. ఈ చిత్రంలో భాగం కావడం ఆనందంగా ఉంది. ఈ చిత్రంలో నటించినప్పుడు వరంగల్‌లో నాకు పెద్ద సన్మానం చేశారు. రాజమౌళి గారంటే అందరూ భయపడతారు. కానీ, ఆయన చాలా కూల్‌. ప్రతి సన్నివేశాన్ని నటించి చూపిస్తారు. చాలాచాలా హ్యాపీగా పనిచేశాను ఆయనతో. ఆ మూవీ తరువాత మంచి హైప్‌ వచ్చింది నాకు. ఆ చిత్రం నాకు పునర్జన్మ వంటిది. బాహుబలి–2లో అవకాశం రాలేదు. వచ్చి ఉంటే బావుండేదనిపించింది. ఈ చిత్రంలో చేసినప్పటి నుంచి నన్ను అందరూ బాహుబలి భానుశ్రీ అని పిలవడం మొదలుపెట్టారు.

వరుసగా సినిమా అవకాశాలు
‘కుమారి 21ఎఫ్‌’లో సెకండ్‌ లీడ్‌ రోల్‌ చేశాను. ‘ఆవు, పులి మధ్యలో ప్రభాస్‌ పెళ్లి’ చిత్రంలో లీడ్‌ రోల్‌ చేశాను. ప్రస్తుతం ‘ఇద్దరి మధ్య 18’ సినిమాలో  హీరోయిన్‌గా నటిస్తున్నాను. ఈ సినిమా ఈనెల 21న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో నాకు ‘శ్రావణ భార్గవి’ డబ్బింగ్‌ చెప్పారు. ‘లచ్చిందేవికో లెక్కుంది’  నెగిటివ్‌ రోల్‌ చేశాను. నా డబ్బింగ్‌ నేనే చెప్పుకున్నాను. ఫొటోషూట్స్, మూవీస్‌... అన్నింటికీ నా కాస్ట్యూమ్స్‌ ‘స్వప్న పైడి’ అనే ఫ్యాషన్‌ డిజైనర్‌ డిజైన్‌ చేస్తారు. సాధారణంగా నేను జీన్స్, టీ షర్ట్‌ ఇష్టపడతాను. ఫంక్షన్లకు పట్టుచీర కట్టుకుంటాను. నాకు తెలుపు రంగంటే ఇష్టం.

స్వప్న నుంచి భానుశ్రీ వరకూ..
నా అసలు పేరు స్వప్న. చాలా సినిమాల్లో ‘భాను’ అనే పేరు వినిపించింది. నా చుట్టుపక్కల కూడా చాలామంది భాను పేరుతో కనిపించారు. అందువల్ల నేను భాను పేరు తీసుకుని దానికి శ్రీ అని తగిలించుకున్నాను. శ్రీ అంటే సంపద అని అర్థం. అందుకే చేర్చుకున్నాను. స్కిన్‌ జాగ్రత్తగా మెయిన్‌టైన్‌ చేస్తాను. ఫుడ్‌ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉంటాను. జిమ్‌కి వెళ్తుంటాను. డ్యాన్స్‌ ప్రాక్టీస్‌ చేస్తాను. బాడీ ఫిట్‌నెస్‌కు జాగ్రత్త పడతాను. బేసికల్‌గా నేను చాలా రిజర్వ్‌డ్‌. నాకు ఇంపార్టెన్స్‌ ఇస్తేనే కలుస్తాను. బాగా క్లోజ్‌ అయితే ఎవరినీ వదిలిపెట్టను. మంచి తెలుగమ్మాయిగా ఫిల్మ్‌ ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఏదైనా చేయగలననే సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ నాకుంది. నాకు డ్యాన్స్‌ అంటే చాలా ఇష్టం. బయట సినిమా ఈవెంట్లు జరిగినప్పుడు, అవార్డ్‌ ఫంక్షన్లలో చేస్తుంటాను. సెమీ క్లాసికల్‌ ఎక్కువగా ఇష్టపడతాను.
– భానుశ్రీ