కేబీసీ: రూ. కోటి గెలిచిన మిడ్‌ డే మీల్‌ వర్కర్‌

16 Sep, 2019 16:10 IST|Sakshi

టీవీల్లో వచ్చే కార్యక్రమాల్లో కొన్ని నిజంగానే సామాన్యులకు మేలు చేసే కార్యక్రమాలు కూడా ఉంటాయి. అలాంటి వాటిల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ‘కౌన్‌ బనేగా కరోడ్‌పతి’(కేబీసీ). సామాన్యులను కోటీశ్వరులుగా, లక్షాధికారులుగా మారుస్తోన్న ఈ కార్యక్రమానికి జనాల్లో భారీ క్రేజ్‌ ఉంది. హిందీలో ప్రసారమవుతున్న ఈ కార్యక్రమం ఇప్పటికే 10 సీజన్లు విజయవతంగా పూర్తి చేసుకుని 11వ సీజన్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్‌ మెగస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యతగా వ్యవహరించడం షో విజయవంతం కావడానికి గల ప్రధాన కారణాల్లో ఒకటి.

ప్రస్తుతం ప్రసారమవుతోన్న 11వ సీజన్‌లో బిహార్‌కు చెందిన సనోజ్‌ రాజ్‌ తొలి కోటీశ్వరుడిగా గుర్తింపు తెచ్చుకోగా.. తాజాగా ఓ మహిళ రూ. కోటి గెలుచుకుని రికార్డు సృష్టించింది. ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజనం వండే బబితా టేడ్‌ అనే మహిళ కేబీసీలో ఇప్పటికే రూ.కోటి గెల్చుకుని.. ఏడు కోట్ల రూపాయల ప్రశ్నను ఎదుర్కొబోతున్నారు. ఈ క్రమంలో బబితా మాట్లాడుతూ.. ‘పాఠశాలలో మధ్యాహ్న భోజనం వండటం ద్వారా నేను నెలకు రూ.1500 మాత్రమే సంపాదించేదాన్ని. పాఠశాలలో పిల్లల కోసం కిచిడి వండేదాన్ని. ఇంత భారీ మొత్తాన్ని సంపాదిస్తానని కలలో కూడా ఊహించలేదు’ అని తెలిపారు.

బిగ్‌ బీ మీరు ఇక్కడ గెలిచిన డబ్బుతో ఏం చేయాలనుకుంటున్నారు అని బబితను ప్రశ్నించగా.. ‘ఓ ఫోన్‌ కొనుక్కుంటాను. ప్రస్తుతం మా ఇంట్లో అందరికి కలిపి ఒక్కటే ఫోన్‌ ఉంది’ అని తెలిపారు. దాంతో ఆశ్చర్యపోవడం బిగ్‌ బీ వంతయ్యింది. ఎందుకంటే ఈ కార్యక్రమానికి వచ్చే వారంతా షోలో ఎక్కువ మొత్తం గెలిచి.. ఇంటిని కొనుగోలు చేస్తామని.. అప్పులు తీరుస్తామని చెప్పేవారు. కానీ బబిత మాత్రం ఇందుకు విరుద్ధంగా ఫోన్‌ కొంటాననడంతో బిగ్‌ బీ షాక్‌కు గురయ్యారు.

మరిన్ని వార్తలు