మువ్వన్నెల జెండాతో దుశ్చర్య

30 May, 2014 23:12 IST|Sakshi
మువ్వన్నెల జెండాతో దుశ్చర్య

సినిమా తీసేవాళ్లకే కాదు, చేసేవాళ్లకు కూడా నైతికత అవసరం. అది లేకపోతే... వాళ్లకే కాదు... సమాజానికీ ఎంతో నష్టం. కొన్ని కోట్ల మందిని ప్రభావితం చేసే వెండితెరపై... దేశ ప్రతిష్ఠకే మచ్చ తెచ్చే కథాకథనాల్ని, పాత్ర చిత్రణల్ని, ఆహార్యాల్ని ప్రోత్సహించడం ఒక రకంగా క్షమించరాని నేరం. బాలీవుడ్‌లో మల్లికా శరావత్ చేసిన ఓ దుశ్చర్య... ప్రస్తుతం ఈ స్థాయి విమర్శలకు కారణం అయ్యింది. ఆమె నటిస్తున్న ‘డర్టీ పాలిటిక్స్’ సినిమాకు సంబంధించిన దృశ్యాలను ఇటీవల రాజస్థాన్ అసెంబ్లీ ముందు చిత్రీకరించారు. జాతీయ జెండాను ఒంటికి చుట్టుకొని ప్రభుత్వ వాహనంపై కూర్చొని రెచ్చగొట్టే భంగిమలు మల్లిక ఇస్తుండగా ఈ సన్నివేశాలను చిత్రీకరించారు. పైగా మల్లికా తన నగ్న దేహానికి మువ్వన్నెల జెండాను చుట్టుకున్న స్టిల్‌ని ఈ సినిమా ఫస్ట్ లుక్‌గా విడుదల చేయడం మరో దారుణం. మొత్తంగా ఈ చిత్రం బృదం చేసిన దుశ్చర్య తీవ్రమైన వివాదానికి తెర లేపింది. జాతీయ జెండాను ఇలా అవమానించడం బాధాకరమే కాక, క్షమించరాని నేరం. మరి ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాలి.