రాముడు లంకకు వెళ్లొస్తే...

15 Jul, 2019 00:32 IST|Sakshi
మహేష్‌ సూర్య సిద్దగోని

పురాణాల్లో రావణుడు సీతని అపహరిస్తే ఆంజనేయుడు తొలుత లంకకి వెళ్లొచ్చాడు. రాముడే మొదటగా వెళ్లుంటే? అనే కథాంశంతో రూపొందనున్న చిత్రం ‘బడిదొంగ’. మహేష్‌ సూర్య సిద్దగోని హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్నారు. బేబి శ్రీనిత్య సమర్పణలో సన్‌ మీడియా కార్పొరేషన్‌ బ్యానర్‌పై రూపొందనున్న ఈ చిత్రంలో ఇషిక వర్మ, రవికిరణ్‌ ఇతర కీలకపాత్రల్లో నటించనున్నారు. ఈ సినిమా లోగోని వ్యాపార వేత్తలు  రవీందర్‌ రెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి ఆవిష్కరించారు.

మహేష్‌ సూర్య మాట్లాడుతూ– ‘‘22 ఏళ్లుగా మీడియా, సినీ రంగాల్లో కొనసాగుతున్నాను. పలు యాడ్‌ ఫిల్మ్స్‌ రూపొందించిన అనుభవంతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాను. రొమాంటిక్‌ లవ్‌ అండ్‌ యాక్షన్‌ మూవీగా రూపొందనున్న చిత్రమిది. మూడేళ్ల పాటు ఈ కథపై పని చేశాను. హైదరాబాద్, యాదగిరిగుట్ట పరిసరప్రాంతాల్లో చిత్రీకరణ జరపనున్నాం’’ అన్నారు. ‘‘గోవిందుడు అందరివాడేలే, రారండోయ్‌ వేడుక చూద్దాం’  చిత్రాల్లో నటించాను. హీరోయిన్‌గా ఇదే తొలిచిత్రం’’ అన్నారు ఇషిక వర్మ. నటుడు రవి కిరణ్, సంగీత దర్శకుడు రాజా మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: రాజా, కెమెరా: వంశీ, సహనిర్మాతలు: రామ్‌ వశిష్ట, శ్రీనిత్య, హర్ష వర్ధన్, టి.మల్లికార్జున్‌ రావ్, జగదీశ్‌.

మరిన్ని వార్తలు