'బాజీరావ్ మస్తానీ'కి పన్ను మినహాయింపు

19 Jan, 2016 12:35 IST|Sakshi
'బాజీరావ్ మస్తానీ'కి పన్ను మినహాయింపు

రణవీర్ సింగ్, దీపికా పదుకొనే, ప్రియాంక చోప్రా లీడ్ రోల్స్లో తెరకెక్కిన పీరియాడిక్ విజువల్ వండర్ 'బాజీరావ్ మస్తానీ'. సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ ప్రేమకథ బాలీవుడ్లో కాసుల పంట పండిస్తోంది. షారూఖ్ ఖాన్ 'దిల్ వాలే' సినిమాకు పోటీగా రిలీజ్ అయి కూడా మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. డిసెంబర్ 18న రిలీజ్ అయిన బాజీరావ్ మస్తానీ హవా ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

తాజాగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ కుటుంబ సమేతంగా 'బాజీరావ్ మస్తానీ' సినిమాను చూశారు. 16 శతాబ్దానికి చెందిన విశేషాలను కళ్లకు కట్టినట్టుగా చూపించిన దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ ప్రతిభకు ముగ్దుడైన అఖిలేష్, ఈ సినిమాకు ఉత్తర ప్రదేశ్లో వినోద పన్ను మినహాయింపు ఇస్తున్నట్టుగా ప్రకటించారు. ఫిలిం ఫేర్ అవార్డ్స్లోనూ సత్తా చాటిన బాజీరావ్ మస్తానీ 350 కోట్లకు పైగా వసూళ్లను సాధించి ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది.