ఠాక్రే నాకు ప్రాణం పోశారు : అమితాబ్‌

22 Dec, 2017 13:50 IST|Sakshi

సాక్షి, ముంబయి : తనకు ప్రమాదం జరిగినప్పుడు శివసేన అధినేత దివంగత నేత బాల్‌ ఠాక్రే తన ప్రాణాలు రక్షించారని బాలీవుడ్‌ దిగ్గజం, మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ అన్నారు. కూలీ చిత్ర షూటింగ్‌ సమయంలో తనకు ప్రమాదం జరిగిందని, అప్పుడు శివసేన అంబులెన్స్‌ సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాణాలు కాపాడిందని అన్నారు. 'అప్పుడు బాగా వర్షం పడుతోంది. అంబులెన్స్‌లు లభించే పరిస్థితి లేదు. చివరకు సేన అంబులెన్స్‌ నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లింది' అని అమితాబ్‌ అన్నారు.

బాల్‌ ఠాక్రే జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న చిత్రం 'ఠాక్రే' షూటింగ్‌ ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడారు. ఠాక్రే నాకు నా కుటుంబంలాగే. బోఫోర్స్‌ కుంభకోణం సమయంలో నాపై ఆరోపణలు వచ్చినప్పుడు కూడా తనకు అండగా ఉన్నారు. ఠాక్రే చనిపోవడానికి ముందు కూడా ఆయనను చూసేందుకు నన్ను ఉద్దవ్‌ అనుమతించారు. ఆ సమయంలో నేను ఉద్దవ్‌ కుమారుడు ఆదిత్యతో ఠాక్రేకు చికిత్స జరుగుతున్న గదిలో ఉన్నాను. ఆయనను అలాంటి పరిస్థితుల్లో చూడలేకపోయాను' అంటూ అమితాబ్‌ బావోద్వేగానికి లోనయ్యారు. శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రావత్‌ 'ఠాక్రే' చిత్రానికి సంగీతం అందిస్తుండగా మహారాష్ట్ర నవ నిర్మాణ్‌ సేన పార్టీ జనరల్‌ సెక్రటరీ అభిజిత్‌ పన్సే దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో ఠాక్రేగా నవాజుద్దీన్‌ సిద్ధిఖీ నటించనున్నారు.

మరిన్ని వార్తలు