బాల్ థాక్రే పై సినిమా

18 Aug, 2015 00:31 IST|Sakshi
బాల్ థాక్రే పై సినిమా

పరిచయ వాక్యాలు అవసరంలేని వ్యక్తి బాల్ థాక్రే. కంటిచూపుతో ముంబై నగరాన్ని శాసించిన మరాఠా వీరుడు. కార్టూనిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించి, ఆ తర్వాత శివసేన పార్టీ అధ్యక్షునిగా మహారాష్ట్ర రాజకీయాల్లో చెరగని ముద్ర వేశారు. థాక్రే మరణించి మూడేళ్లయినా ఇప్పటికీ ఆయన్ను దైవంగా కొలిచే వాళ్లు చాలా మంది ఉన్నారు.
 
 ప్రస్తుతం బాలీవుడ్‌లో జీవితకథలు రాజ్యమేలుతున్న తరుణంలో బాల్ థాక్రే జీవితాన్ని తెరపై ఆవిష్కరించాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ప్రయత్నం చేస్తున్నది ఎవరో కాదు.. స్వయానా థాక్రే మనవడు రాహుల్ థాక్రే. తాత జీవిత చరిత్రను వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాలనే పట్టుదలతో ఉన్నారీ మనవడు. ఈ చిత్రానికి బాల్ థాక్రే కోడలు స్మితా థాక్రే  నిర్మాతగా వ్యవహరించనున్నారు.
 
 ముంబైలో బాల్ థాక్రే అభిమానులు ఆయన్ను ‘బాల్ సాహెబ్’ అని పిలిచేవారు. అందుకని ‘సాహెబ్’ అనే  పేరుతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్లు స్మితా థాక్రే తెలిపారు. కెనడాలో ఫిలిం కోర్సు పూర్తి చేసి వచ్చిన రాహుల్ గతంలో రాజ్‌కుమార్ హిరానీ దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేశారు. ఆ అనుభవంతో తాత జీవిత చరిత్రతో తీసే సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం బాల్ థాక్రే పాత్రకు నటుణ్ణి ఎంపిక చేసే పని మీద ఉన్నారు.