బట్టతల ఉంటే ఇన్ని బాధలా..?

10 Oct, 2019 16:48 IST|Sakshi

అయుష్మాన్‌ ఖురానా.. ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ బాలీవుడ్‌లో గొప్ప పేరు తెచ్చుకున్న క్రేజీ హీరో.  విభిన్న పాత్రలు ఎంచుకుంటూ వరస విజయాలతో దూసుకుపోతున్నాడు. ‘డ్రీమ్ గర్ల్’ సినిమాలో అమ్మాయి గెటప్‌తో అలరించిన ఆయుష్మాన్‌.. ఇప్పుడు బట్టతల వల్ల కలిగే ఇబ్బందులు ఎలా ఉంటాయో సరదాగా చెప్పడానికి ‘బాలా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అమర్ కౌశిక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదలైంది. 

ఇందులో హీరో చూడడానికి  బాగానే ఉంటాడు కానీ బట్టతల ఉంటుంది. దీంతో అతన్ని చూసి అంతా నవ్వుతుంటారు. టోపీ పెట్టుకొని తన బట్టతలను కవర్‌ చేస్తుంటాడు. అయినప్పటికీ అందరి ముందు నవ్వులపాలవుతుంటాడు. జుట్టు పెరగడానికి మార్కెట్‌లో దొరికే ప్రతి ఆయుర్వేద నూనెలను వాడుతుంటాడు. అయినా జుట్టు పెరగడు. ఇంకా ఊడిపోతూనే ఉంటుంది. చివరకు ఆవు పేడను కూడా తలకు రాసుకుంటాడు. అయినా ఎలాంటి పెరుగుదల ఉండదు. 

 దాంతో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాలని అనుకుంటాడు. డాక్టర్ వద్దకు వెళ్లి తన సమస్య చెప్పుకుంటాడు. అయితే తలలో జుట్టు ఇంజెక్ట్ చేయడానికి అతని శరీరంలో ఎక్కడా అంత జుట్టు లేదని, దాంతో పర్సనల్ పార్ట్స్‌లో వచ్చే వెంట్రుకలతో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని డాక్టర్స్ అంటారు. దాంతో ఆయుష్మాన్ భయంతో పారిపోతాడు.

ఇందులో యామి గౌతమ్‌, భూమి పెడ్నేకర్‌ కథానాయికలుగా నటించారు.  హీరో యామిని ఇష్టపడతాడు. ఆమె ముందు విగ్గు పెట్టుకొని ప్రేమలో పడేస్తాడు. అయితే అతనికి బట్టతల ఉందన్న విషయాన్ని యామికి తెలిస్తే పరిస్థితేంటి? బట్టతల పోవడానికి అతను ఏన్ని పాట్లు పడ్డాడు? అన్నదే ఈ సినిమా కథ అని ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. నవంబర్ 7న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు