అపురూపం... బాల రామాయణం

19 Nov, 2013 00:47 IST|Sakshi
అపురూపం... బాల రామాయణం

శ్రీకృష్ణవిజయం, కోడెనాగు, ముత్యాల పల్లకి, ఏకలవ్య, పల్నాటి సింహం... ఈ సినిమాలను బట్టి నిర్మాతగా ఎమ్మెస్ రెడ్డి అభిరుచి ఏంటో అర్థం చేసుకోవచ్చు. నిర్మాతగా, కవిగా పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఎమ్మెస్ రెడ్డి. ఆయన మస్తిష్కం నుంచి పుట్టిన ఓ అపురూప దృశ్యకావ్యంగా ‘రామాయణం’(1997) చిత్రాన్ని చెప్పుకోవాలి. పిల్లలతో రామకథను తీసి వెండితెరను పులకింపజేశారాయన.
 
 రామజననం నుంచి రావణ సంహారం వరకూ సాగే ఈ కథను దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన తీరు అభినందనీయం. పిల్లలకు తగ్గట్టు ఆభరణాలను తయారు చేయించడమేకాదు, వారి హైట్‌ని బట్టి అంతఃపురం సెట్లను కూడా వేయించి, చూపరులను అబ్బురపరిచారు ఎమ్మెస్‌రెడ్డి. దాదాపు 30 పాఠశాలల నుంచి మూడు వేల మంది పిల్లల్ని తెచ్చి ఈ సినిమాలో నటింపజేయడం విశేషం. రాముడి పాత్రకు తారకరాముడి మనవడే సరైన వాడిగా భావించి జూనియర్ ఎన్టీఆర్‌ని రామునిగా తీసుకున్నారు దర్శక, నిర్మాతలు గుణశేఖర్, ఎమ్మెస్‌రెడ్డి.
 
 ఈ సినిమా చేసేటప్పుడు తారక్ వయసు 13 ఏళ్లు. ‘రామాయణం’ కంటే ముందు... ఎన్టీఆర్ ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ హిందీ వెర్షన్‌లో శకుంతల తనయుడు భరతునిగా తారక్ నటించినా... ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు. ఆ విధంగా చూసుకుంటే... తారక్ వెండితెరపై కనిపించిన తొలి సినిమా రామాయణమే. తొలి సినిమాతోనే తాతకు తగ్గ మనవడు అనిపించుకున్నాడు తారక్.  ఇందులో సీతగా స్మితామాధవ్ నటించారు. ఇప్పుడామె ప్రముఖ నర్తకి.
 
 ఇక రావణుని పాత్రను కొడాలి స్వాతి అనే అమ్మాయితో చేయించడం విశేషం. దశరథుని నుంచి అంగదుని వరకు ఇందులో ప్రతి పాత్రనూ చిన్న పిల్లలే పోషించారు. దర్శకుడు గుణశేఖర్ యాక్షన్, ఫ్యాక్షన్, ప్రేమకథలే కాదు... పురాణాలను, చరిత్రాత్మకాలను కూడా చక్కగా హ్యాండిల్ చేయగలరని ‘రామాయణం’ సినిమా ఆ రోజుల్లోనే నిరూపించింది. జాతీయస్థాయిలో ఉత్తమ బాలల చిత్రంగా ఎంపికయ్యిందీ సినిమా. వాణిజ్యపరంగా కూడా బాగానే ఆడింది. గత రెండు దశాబ్దాల్లో తెలుగులో వచ్చిన బాలల చిత్రాల్లో ‘రామాయణం’ చిత్రానిది ఓ ప్రత్యేక స్థానం.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా