బాలయ్య బర్త్‌డే గిఫ్ట్‌: సాంగ్‌ విన్నారా?

9 Jun, 2020 20:05 IST|Sakshi

నటసింహం నందమూరి బాలకృష్ణ బుధవారం 60వ జన్మదిన వేడుకలు జరుపుకోబోతున్న విషయం తెలిసిందే. తన పుట్టిన రోజు సందర్భంగా నందమూరి అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. దివంగత ఎన్టీఆర్‌ నటించిన ‘జగదేకవీరును కథ’ సినిమాలోని ‘శివ శంకరీ శివానంద లహరీ’ పాటను ఆలపించారు. ఈ పాటకు సంబంధించి ఆ చిత్రంలోని సన్నివేశాలను చూపిస్తూనే బ్యాక్‌గ్రౌండ్‌లో బాలయ్య పాటను యాడ్‌ చేశారు. ఈ పాటను ఎన్‌బీకే ఫిలింస్‌ యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేసింది. ప్రస్తుతం ఈ పాట యూట్యూబ్‌లో తెగ ట్రెండ్ అవుతోంది. విడుదలైన కొద్ది నిమిషాల్లోనే వేల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇక బర్త్‌డే గిఫ్ట్‌గా తమ హీరో పాడిన పాటకు నందమూరీ అభిమానులతో పాటు సంగీత ప్రియులు సైతం ఫిదా అవుతున్నారు. 


మీ క్షేమమే నాకు కొండంత ఆశీర్వాదం: బాలయ్య
ఇక తన 60వ పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ తన అభిమానులకు ఫేస్‌బుక్‌ ద్వారా విజ్ఞప్తి చేస్తూ.. ఓ పోస్ట్‌ పెట్టారు. ‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా అభిమాన సోదరులందరికీ నా ఆత్మీయ విజ్ఞప్తి. నా 60వ పుట్టినరోజుని మీ ఇంటి పండగలా కనీ, వినీ ఎరుగని రీతిలో సంబరాలు చేస్తున్న మీ అందరికీ నా హృదయ పూర్వక ధన్యవాదాలు. నా హితులు, శ్రేయోభిలాషులు కుటుంబ సభ్యులైన మీ అందరితో కలిసి వేడుక చేసుకొనే ఆదృష్టానికి అంతరాయం ఏర్పడినందుకు బాధగా ఉంది. 

ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో మీ అందరి ఆరోగ్యం గురించి ఆలోచించడం నా భాధ్యత. మీ క్షేమమే నాకు కొండంత ఆశీర్వాదం. ప్రభుత్వ నిబంధనలు, ఆంక్షలు, భౌతికదూరం పాటించడం మనందరి కర్తవ్యం. అందుకే అందర్నీ కలవాలన్న నా ఆకాంక్షకి అడ్డుకట్ట వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. దయచేసి మీ ఆరోగ్యాల్ని నిర్లక్ష్యం చేసి ఎవరూ నన్ను కలవడానికి రావద్దని కోరుతున్నాను. ఈ రోజు ద్వారక క్రియేషన్స్‌, బోయపాటి శ్రీను దర్శకత్వంలో నేను నటిస్తున్న చిత్రం టీజర్‌ మరియు నేను పాడిన పాట విడుదలౌవుతున్నాయి. ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ప్రభుత్వ నిబంధనలు పాటించండి. నిండు మనసుతో నా విన్నపాన్ని మన్నించండి. మీ బ్రతుకు ముఖ్యం... మీ భవిత ముఖ్యం. మీ అందరి క్షేమమే మీరు నాకు ఇచ్చే అద్భుతమైన ఆశీర్వాదం. నా విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తూ... మీ బాలకృష్ణ’ అంటూ హీరో బాలకృష్ణ తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. 


Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు