మేమిద్దరం హీరోలమే!

13 Jan, 2016 00:59 IST|Sakshi
మేమిద్దరం హీరోలమే!

♦  మీరు ఉన్నది ఉన్నట్లు మాట్లాడే మనిషి. భోళా శంకరులు. మీకు... ఈ ‘డిక్టేటర్’ అనే టైటిల్‌కూ...
(నవ్వుతూ... అందుకుంటూ...) భోళా శంకరులే డిక్టేటర్‌లు. అది మా నాన్నగారి నుంచొచ్చింది. పదిమందితో సంప్రతిస్తారు. చివరకు తీసుకొనే నిర్ణయం తీసుకుంటారు. ఆవేశంతో చేయకపోతే, కొన్నిపనుల్చేయలేం. నేనూ అంతే!
♦  ‘సింహ’, ‘లెజెండ్’, ‘లయన్’, ‘డిక్టేటర్’ - ఇలా పవర్‌ఫుల్ టైటిల్స్‌తో అంచనాలెక్కువవుతాయే!
‘డిక్టేటర్’ టైటిల్ కథ అనుకున్నాక పెట్టినదే. నాకీ టైటిల్‌పై అనుమానమేమీ లేదు కానీ, ‘ఇంత బరువైన టైటిల్ పెడుతున్నాం. కాబట్టి, సబ్జెక్ట్, క్యారెక్టరైజేషన్‌లో అప్రమత్తంగా ఉందాం’ అని దర్శకుడితో అన్నా. అలాగే అన్నీ కుదిరాయి.
     
♦  ‘డిక్టేటర్’ నేపథ్యం కూడా కొత్తగా ఉంటుందేమో!
ప్రభుత్వం ఎవరిదైనా, సారథులు ఎవరైనా - దేశ ఆర్థిక వ్యవస్థను శాసించేదంతా కొందరు వ్యాపారవేత్తలే! అలాంటి కుటుంబవ్యక్తిగా కనిపిస్తా. ఢిల్లీ నేపథ్యంలో కథ ఉంటుంది.  
     
♦  రసవత్తరమైన సమకాలీన రాజకీయం ఉందట!
ఉంది. కానీ అంతా జనరల్‌గానే తప్ప ఎవర్నీ ఉద్దేశించినది కాదు. ఆనాటి ప్రముఖ నటి రతి అగ్నిహోత్రీ నాతో ఢీ అంటేఢీ అనే పొలిటీషియన్.
     
♦  ముందుగా హేమమాలినిని అనుకున్నట్లున్నారు!
హేమమాలిని, షబనా అజ్మీ- ఇలా చాలా మందిని అనుకున్నాం. కుదరలేదు. ఇంతలో మా డెరైక్టర్ శ్రీవాస్ గారికి రతి పేరు గుర్తొచ్చింది. ఫ్రెష్‌నెస్ ఉంటుందని వెంటనే ఓకె అనేశా. గతంలో మేమిద్దరం ‘వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ సినిమాలో హీరో, హీరోయిన్లుగా చేశాం.  
     
♦  ఈ చిత్రంలో మీతో తొలిసారిగా నటిస్తున్న అంజలిని మహానటి సావిత్రితో పోల్చినట్లున్నారు!
అవును. నేనెప్పుడూ నా పాత్రే కాకుండా, నా పక్కన ఉండే పాత్రలు బాగుండాలని చూస్తా. పాత్రధారులు మంచి నటులై ఉండాలని చూస్తా. అప్పుడే కదా... మంచి కెమిస్ట్రీ, టైమింగ్ కుదిరి, సీన్ పండుతుంది. హీరోయిన్లందరినీ అరువు తెచ్చుకుంటున్న రోజుల్లో ఆమె తెలుగమ్మాయి. అటు అందంతో పాటు అభినయం ఉన్న మంచి ఆర్టిస్ట్. ఇలా నటీనటులు, సాంకేతిక నిపుణులం అంతా ఒక ఫ్యామిలీ లాగా పనిచేస్తాం.
     
♦  మీతో అందరూ భయంగా, గౌరవంగా ఉంటారు కదా! ఒక ఫ్యామిలీ అనే ఫీలింగ్ ఎలా తెస్తారు?
సినిమా మొదలుపెట్టినప్పుడు మొదట సెలైంట్‌గా ఉంటా. నాలుగైదు రోజులు అబ్జర్వ్ చేస్తా. లైట్‌బాయ్ నుంచి దర్శకత్వ శాఖ దాకా ఎవరు పనిచేస్తారో, ఎవరు పనిదొంగో గమనిస్తా. పనిమంతుల్ని గుర్తించి, ఒక్కొక్కరికీ ఒక్కో బాధ్యత అప్పచెబుతాను. షూటింగ్‌లో టెంపో పెరిగే కొద్దీ, అందరూ లీనమవుతారు. ప్రాజెక్ట్‌లో భాగస్థులమనే ఫీలింగ్ క్రియేటవుతుంది.
     
♦  కానీ, అందరూ మీరు కోపధారి అంటారెందుకు?
నిజజీవితంలో నటించడం నాకు చేతకాదు. పెద్ద విషయాల కన్నా చిన్న చిన్నవాటికే నాకు కోపమొస్తుంది. ‘క్రీమ్ ఆఫ్ ఎయిటీస్’ అని నేను, చిరంజీవి, వెంకటేశ్, అలాగే దక్షిణాది తారలు రజనీకాంత్, మోహన్‌లాల్, సుహాసిని, కుష్బు - ఇలా చాలామందిమి సరదాగా కలుస్తుంటాం. వ్యక్తిగత హోదాలన్నీ మర్చిపోయి, సరదాగా గడపాలని అలా ఒక్కోచోట కలుస్తాం. అందరితో కలసి, గ్రూప్ ఫోటోలు దిగుతుంటే, ‘బాలా! వచ్చేయ్... కిందకు!’ అని సుహాసిని అంది. ఏమి టంటే, ‘రజనీకాంత్ వచ్చారు’ అంది. అందరం ఒకటనుకొని కలిస్తే, తేడాలు చూపించేసరికి నాకు సర్రున కోపం వచ్చింది. ‘రజనీ సారేంటి? ఎవడు సూపర్‌స్టార్?’ అని అరిచా. ‘ఫోటో తియ్యండి’ అన్నా. అయ్యాకే కిందకు వచ్చా. నేను పర్‌ఫెక్ష నిస్ట్‌ని. నా చుట్టూ అందరూ అలానే ఉండాలను కుంటా. లేకపోతే కోపమొస్తుంది.
     
♦  ‘డిక్టేటర్’ 99వ సినిమా. వందో సినిమా ఏంటి?
(నవ్వేస్తూ...) నాకు ఏ ప్లాన్లూ ముందుగా ఉండవు. అందరూ ‘వంద సినిమాలు చేసేశారు’ అంటున్నారు. నేను మాత్రం ‘వంద సినిమాలేనా చేశాను’ అంటాను. అయితే, వంద సినిమాలనే సంఖ్య ఒక మైలురాయి. ముఖ్యంగా ఫ్యాన్స్‌కి! 41 ఏళ్ళ క్రితం బాల నటుడిగా ప్రవేశించా. బాగా చదువుకోవాలని మధ్యలో మా నాన్న గారు ఆపకపోతే, ఈపాటికి 150 నుంచి 200 సినిమాలు చేసి ఉండేవాణ్ణి. కానీ, నిజామ్ కాలేజ్‌లో చదువుకోవడం వల్ల ప్రపంచజ్ఞానం పెరిగింది. ఎంతోమందితో పరిచయాలొచ్చాయి. నా కాలేజ్‌మేట్స్ - కిరణ్‌కుమార్‌రెడ్డి సి.ఎం అయ్యాడు. సురేష్ రెడ్డి స్పీకర్ అయ్యాడు. అంతా ఎంతో ఎదిగారు. కాలేజ్ చదువు లేకపోతే, వీళ్ళందరితో సాంగత్యం పోగొట్టుకొనేవాణ్ణి. అందుకే, మా పిల్లల విషయంలో కూడా చదువుకే ప్రాధాన్యమిచ్చా. వాళ్ళూ బాగా చదువుకున్నారు.
     
♦  మీ అబ్బాయి మోక్షజ్ఞ మీ వందోసిన్మాలో ఎంట్రీట!
(నవ్వేస్తూ...) ఏమో అవ్వచ్చు. ఆలోచనలు న్నాయి. ఎలా టర్న్ తీసుకుంటాయో చెప్పలేం! ఏదైనా అప్పటికప్పుడు వేడివేడిగా నిర్ణయం తీసు కోవాలి. ఆచరించాలి. నాన్చడం ఇష్టం ఉండదు.
     
♦  నూరో సినిమా బోయపాటి  దర్శకత్వంలోనేనా?
(నవ్వేస్తూ) చర్చలు జరుగుతున్నాయి. ఇంకా ఏమీ అనుకోలేదు. ఏమైనా, రెండు నెలలు అంతా సిద్ధం చేసుకొని, మార్చి కల్లా వందో సినిమా పట్టాల మీదకు ఎక్కిస్తాం. అప్పటికి బోయపాటి రెడీగా ఉంటే సరే, ‘లేదు. నాలుగైదు నెలలు టైమ్ పడుతుం’దంటే, అంతకాలం ఆగలేను. వెంటనే మరొకరితో, ఇంకో సినిమా, పాత్ర చేయాల్సిందే.
     
♦  సింగీతంతో ‘ఆదిత్య 369’ సీక్వెల్ చేస్తారనీ...
స్టోరీ బోర్డ్‌తో సహా అది సిద్ధంగా ఉంది. చూడాలి. ఏమైనా, ఒక వారంలో ఈ సంక్రాంతి పండుగ తర్వాత నిర్ణయం తీసుకుంటా!
     
♦  వందో సినిమా తర్వాత పూర్తిగా ప్రజాసేవకేనా?
లక్షలాదిప్రజల్ని తృప్తిపరిచే నటన వదిలి పెట్టను. నేనింకా అనేకపాత్రల్లో చేయాలనీ, చూడాలనీ ఫ్యాన్‌‌స ఆశిస్తున్నారు. వాళ్ళని నిరాశ పరచను. సినిమాలు చేస్తూనే, ప్రజాసేవ చేస్తా.
     
♦  ‘కాబోయే సి.ఎం. బాలయ్య’ లాంటి స్లోగన్లు...?
ఆ మాటలు వినిపిస్తుంటాయి. పట్టించు కోను. నేను దేన్నీ ఆశించను. ఏం జరగాలనుంటే అది జరుగుతుంది. ఏది నాకు రావాలనుంటే అది వస్తుంది. అది కాలం నిర్ణయిస్తుంది.
     
♦  తాతయ్య అయ్యాక మీలో వచ్చిన మార్పు?
ఏమీ లేదు. నేనిప్పటికీ ‘బాలు’ణ్ణే! (నవ్వు). నాలోని ఆ పసితనం పోలేదు. పోదు.
     
♦  అమరావతి శంకుస్థాపన, సత్య నాదెళ్ళ సమా వేశం - ఏదైనా మీ మనుమడే స్టార్ ఎట్రాక్షన్.
(మనుమణ్ణి ఎత్తుకొని...) వీడికి ఎనిమిది నెలలు. వీడికి నేనే సందడి. వీడితో నాకు మంచి కాలక్షేపం. హావభావాలతో డైలాగ్స్ చెబుతుంటే, అలా చూస్తూ ఉంటాడు. మెడలో పులిగోరు చూడ గానే ‘గడ్డం తాత (చంద్రబాబు) కాదు.. నేను’ అని గుర్తుపడతాడు. వీడి కోసం నేను లైవ్ పెర్ఫా ర్మెన్స్... డ్యాన్స్‌లు చేస్తుంటా. వాడూ ఎగురు తాడు. కెమేరా కనిపించగానే, అలా చూస్తుం టాడు. వీడు కచ్చితంగా హీరో అవుతాడు. ఇద్దరం హీరోలమే! ఈ సంక్రాంతికి వీణ్ణి తీసుకొని, నారావారి పల్లె వెళుతున్నాం. వచ్చే సంక్రాంతి మా ఊరు నిమ్మకూరులో.
     
♦  సంక్రాంతి మీకు సెంటిమెంటా?

నాన్న గారి ‘చంద్రహారం’ నుంచి ఎన్నో సినిమాలు సంక్రాంతికే వచ్చాయి. దర్శకుడిగా ఆయన తొలి చిత్రం ‘సీతారామ కల్యాణం’ నుంచి ‘దాన వీరశూర కర్ణ’ దాకా అన్నీ ఆ రోజే రిలీజ్. ఆ వాసనలు నాకూ అబ్బాయి. ఒకటి, రెండు సంక్రాంతులు మినహా దాదాపు ప్రతిసారీ నా సినిమాలు వస్తున్నాయి. ఇప్పటి నుంచి మాత్రం ఇక ప్రతి సంక్రాంతికీ నా సినిమా ఒకటి ఉంటుంది.
     
♦  మీది, తారక్, నాగ్, శర్వానంద్‌లవి - నాలుగు సిన్మాలొస్తున్నాయి. ఈ సంక్రాంతెలా ఉంటుంది?
(గంభీరంగా...) నేను వేరేవాళ్ళ గురించి, వేరే సిన్మాలగురించి ఆలోచించను, పట్టించుకోను.
     
♦  థియేటర్ల విషయంలో మీ సినిమాకూ, ఇతరులకూ మధ్య గొడవని వార్తలు వచ్చాయి.
అలాగా! నాకు తెలీదు. నా వరకు ఏదీ రాలేదు. సినిమా ప్రమోషన్ హడావిడిలో ఉన్నా.
     
♦  అంటే థియేటర్ల విషయం మీరు పట్టించుకోరా?
ఫలానా ఊళ్ళో మన సినిమాకి హాలుదొరక్క, ప్రాబ్లమ్ ఉందని వాళ్ళు నాకు ఫోన్ చేసి, నా దృష్టికి తెస్తేనే పట్టించుకుంటాను. లేకపోతే లేదు.
     
♦  ఇంట్లో వాళ్ళు ఎవరైనా తప్పుచేస్తే..  ఏదైనా విషయంలో తేడా వస్తే, కూర్చోపెట్టి మాట్లాడ తారా?  క్షమిస్తారా?
లేదండి. నాలో క్షమించే గుణం తక్కువే. ఏ విషయంలోనైనా ఎవరైనా తప్పు చేస్తే క్షమించను. బుజ్జగించడం అలాంటివి మనకస్సలు లేవు. ఏదైనా ఒక్కసారే. అంతే. ఏదైనా సరే నా స్టయిల్‌ల్లో డీల్ చేస్తాను. వాళ్లకు రెండో అవకాశం ఇవ్వను. అక్కడితో కటాఫ్ అంతే. అది ఇంట్లో వాళ్లయినా, బయటి వాళ్లయినా అంతే.   
     
♦  మీ పిల్లల్లో ఎవరికి మీ వద్ద చనువు ఎక్కువ?
మా పెద్దమ్మాయి బ్రహ్మిణికి. నన్ను క్రిటిసైజ్ చేసి, సలహాలు ఇవ్వాలన్నా బ్రహ్మిణే. చిన్న మ్మాయి తేజస్విని అడిగితే కానీ చెప్పదు. బ్రహ్మిణి మాత్రం అడగపోయినా చెబుతుంది.
     
♦  మీ పిల్లల కెరీర్ విషయంలో మీ జోక్యం?
నిజానికి, మా అమ్మాయిలతో సహా అందరికీ చదువుకొన్నాక, సినిమాల్లో ఆసక్తి ఉంటే రమ్మని చెప్పాను. కానీ, అమ్మాయిలు వద్దన్నారు. మా అబ్బాయి వస్తున్నాడు. వట్టి బాలకృష్ణగా కాక ‘బ్రహ్మిణి తండ్రి బాలకృష్ణ’ అని అనిపించుకో గలిగితే, అది నాకు పెద్ద కిరీటం లాంటిది కదా.
     
♦  మోక్షజ్ఞ తొలి సినిమాలు ఎలా ఉండాలి?
తొలి అయిదారు సినిమాలు నార్మల్ హీరోగా చేయాలి. ప్రపంచాన్ని కాపాడేశాడు లాంటి సూపర్ హీరో పాత్రలొద్దని. ప్రేక్షకులందరూ మన అబ్బాయి అనుకొనే పాత్రలు చేస్తే, ఆ తరువాత మాస్ ఫాలోయింగ్ ఎలాగూ వస్తుంది.
     
♦  మీ విజయంలో మీ శ్రీమతి వసుంధర పాత్ర?
(నవ్వేస్తూ...) 1982లో మా పెళ్ళయింది. నన్ను ఇంతకాలం భరించిన భార్య ఆవిడ. పిల్లల చదువుల విషయమంతా దగ్గరుండి చూసింది.
     
♦  ఈ మధ్య ఇంటిల్లపాదీ కలసి చూసిన సినిమా?
నిన్నే నేను, నా భార్య వసుంధర, బ్రహ్మిణి, మోక్షజ్ఞ, శ్రీవాస్ కలిసి ‘డిక్టేటర్’ చూశాం. ఇంట్లో అందరూ బాగుందన్నారు.  
     
♦  రాజకీయనాయకుడిగా మీ ప్రోగ్రెస్ రిపోర్ట్?
నేను ప్రచారానికి వెళ్లినప్పుడు మహిళలు బిందెలతో వచ్చేసేవారు. పాపం తాగడానికి నీళ్లు ఉండేవి కాదు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ట్యాంకుల ద్వారా తాగునీటి సమస్య తీర్చే ప్రయత్నం చేశా. ఆ ఆత్మసంతృప్తి ఉంది. నేనేదో చుట్టంచూపుగా నా నియోజకవర్గానికి వెళ్తానని అనుకున్నారు. కానీ నిజాయతీగా పనిచేస్తున్నాని ప్రజలు గుర్తించారు. ఇంకా చేయాల్సినవి ఎన్నో.
     
♦  కానీ, తలదూర్చేవారు, తలనొప్పులెక్కువేగా?
నా నియోజకవర్గంలో ఎవడైనా తలదూరిస్తే ఎవరికైనా వార్నింగే. నా స్వభావం అలాంటిది.
     
♦  జీవితంలో పశ్చాత్తాపపడిన సందర్భాలున్నాయా?
లేదండీ. ఎప్పుడూ లేదు.
     
♦  ప్రపంచానికి తెలియని బాలకృష్ణ గురించి?
నా జీవితమే ఓపెన్ బుక్. ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతాను. చాలామంది టీవీ షోలకు రమ్మన్నా రానని చెప్పా... నా గురించి అందరికీ కొత్తగా తెలిసేది ఏంటని. నాకు కపటం చేత కాదు. నిజజీవితంలో నా ప్రవర్తన నుంచే నా సినిమాల్లో డైలాగులు పుడుతుంటాయి. ఏమున్నా ఆవేశంతో వెళుతుంటా అంతే . చాలామంది నాకు భయపడి దాక్కుని దాక్కుని వెళుతూ ఉంటారు.
     
♦  మీరు భయపడే సంఘటనలు?
అస్సలు దేనికీ భయపడని స్వభావం నాది.
     
♦  భవిష్యత్తు కొన్నిసార్లు మీకు తెలుస్తుందట...
అప్పుడప్పుడూ ముందు జరిగేవి తెలుస్తూనే  ఉంటాయి. భగవంతుడు ఆ పవర్ ఇస్తాడు. రామకృష్ణకు యాక్సిడెంట్ జరుగుతుందనగా ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. సాయికృష్ణ చనిపోతున్నా రనగా అలాంటి సంఘటనే జరిగింది. ‘పెద్దన్నయ్య’ రిలీజ్ టైమ్ లో మా తమ్ముడు రామ కృష్ణకి యాక్సిడెంటైంది. ఆ ముందు రోజు రాత్రి కల్లోనే వచ్చింది. పొద్దున  లేచేసరికి బెడ్ అంతా చెమటతో తడిచిపోయింది.

శాస్త్రి గారిని అడిగి పూజలు చేశా. పెద్ద యాక్సిడెంట్ అయినా, దేవుడి దయ వల్ల ఇప్పటికీ బాగానే ఉన్నాడు. కానీ నాన్నగారి మరణం చూశాక ఒకలాంటి వైరాగ్యం నాలో ఆవహించింది.  ఎవరూ దేన్నీ ఊహించ లేరు. మా అన్నయ్య సాయికృష్ణ సంగతీ కలలో తెలిసింది. కానీ, ప్రాప్తం లేదు. కాపాడుకోలేక పోయాం. అందుకే ఎవరికి ఎంత రాసిపెట్టి ఉంటే అంత. కాపాడటానికి యోగం ఉండాలి.
     
♦  ప్రపంచానికెలా గుర్తుండిపోవాలని ఆలోచన?
 సినిమాల వల్లే కాక, ‘బాలకృష్ణంటే... ఇలా ఉంటా’డనే వ్యక్తిత్వం ద్వారా గుండెల్లో ఉంటాను.
 
♦  మీ దృష్టిలో దైవం అంటే?
కష్టాల్లో ఉన్నప్పుడే కాకుండా నిత్యం చేయాల్సిన పనుల్లో దైవ చింతన ఒకటి. రోజూ గంట 45 నిమిషాలు పూజ చేస్తా. నా గదిలో పూజ చేస్తాను. దైవాన్ని ప్రార్థిస్తున్నామంటే సరెండర్ అవుతున్నట్టే. యాక్టింగ్‌లో రకరకాల పాత్రలు చేసి, ఆ అహాన్ని పెంచుకోకుండా బయటకు వచ్చి దేవుడికి ఆత్మసమర్పణ చేసుకోవాలి. మన పుష్పక విమానం లాంటివేగా ‘స్టార్ వార్స్’లో చూపించేది. నేను బీజాక్షరాలను నమ్ముతాను. మన వేదాల్లో బుుగ్వేదం, అధర్వణ వేదాలు నమ్ముతాను. అధర్వణ వేదంలో పండితుడైన దండిభట్ల విశ్వనాథశాస్త్రిని చాలా ఏళ్ళక్రితం జర్మనీయులు తీసుకెళ్ళి, తర్జుమా చేయించుకున్నారు.  హిందూమతంలో పుట్టినందుకు నా ధర్మాన్ని నిర్వర్తిస్తాను. కానీ కెమెరా ముందుకెళితే  పనే నాకు దైవం.
 
♦  పంచాంగం మీద మీకు చాలా పట్టుందట?
(నవ్వేస్తూ) రోజువారీ ముహూర్తాలు చూస్తా.
     
♦  పునర్జన్మలను మీరు నమ్ముతారా?
నమ్ముతాను. నాన్న గారు అన్నట్లు మళ్లీ తెలుగు జాతిలోనే  పుడతాను. తెలుగు జాతి రుణం తీర్చుకుంటాను.
- డాక్టర్ రెంటాల జయదేవ