‘బ్రహ్మ ముహూర్తంలో ప్రపోజ్‌ చేశా’

27 Jul, 2019 17:37 IST|Sakshi

బ్రహ్మ ముహూర్తంలో తన గర్ల్‌ఫ్రెండ్‌కు ప్రేమ విషయం చెప్పాను కాబట్టి తమ బంధం చాలా దృఢంగా ఉందంటున్నాడు చిన్నారి పెళ్లి కూతురు ఫేం అవినాశ్‌ ముఖర్జీ. జగదీశ్‌గా బుల్లితెర అభిమానులను అలరించిన అవినాశ్‌ ప్రస్తుతం వరుస సీరియళ్లతో బిజీగా ఉన్నాడు. అయితే అతడు ప్రేమలో పడ్డాడంటూ గత కొంతకాలంగా ఇండస్ట్రీలో రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ వార్తలపై తొలిసారిగా పెదవి విప్పిన అవినాశ్‌.. తన క్లాస్‌మేట్‌ సలోని లూత్రాతో ప్రేమలో ఉన్నట్లు వెల్లడించాడు.

తన ప్రేమ ప్రయాణం గురించి అవినాశ్‌ ఓ వెబ్‌సైట్‌తో మాట్లాడుతూ...‘ తను నా  కాలేజ్‌మేట్‌. మా కంపెనీకి కంటెంట్‌ రైటర్‌ కావాలంటూ ఓరోజు ఇన్‌స్టాగ్రామ్‌లో తనకు మెసేజ్‌ చేశాను. నిజానికి తను చాలా బాగా రాస్తుందని నాకు తెలుసు. అందుకే తననే రిక్రూట్‌ చేసుకోవాలనుకున్నా. కానీ తను మాత్రం భిన్నంగా స్పందించింది. వేరే వాళ్లను రికమెండ్‌ చేసింది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా తనను మళ్లీ మళ్లీ అడగటం మొదలుపెట్టాను. ఆఖరికి తను అంగీకరించింది. అలా మొదలైన మా ప్రయాణం ప్రేమకు దారితీసింది. తనను మా అమ్మకు కూడా పరిచయం చేశాను. వారిద్దరు మంచి స్నేహితులయ్యారు. ఈ క్రమంలో ఓ రోజు ఉదయం 4 గంటలకు తనకు ప్రపోజ్‌ చేశాను. అది బ్రహ్మ ముహూర్తం. అందరి తలరాతలు రాసే బ్రహ్మ ఆ సమయంలోనే నిద్ర లేస్తాడు. ఆయన మా బంధాన్ని దృఢంగా ఉంచుతాడు’ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. 

మరిన్ని వార్తలు