'పద్మావతి' సినిమాను నిషేధించండి!

13 Nov, 2017 12:46 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ తెరకెక్కించిన ‘పద్మావతి’  సినిమాను వివాదాలు విడిచిపెట్టడం లేదు. రాణి పద్మావతి కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో చరిత్రను వక్రీకరించారని, ఈ సినిమాను నిషేధించాలంటూ జోరుగా రాజ్‌పుత్‌లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా విడుదల కాకుండా నిషేధించాలంటూ ఏకంగా బీజేపీ ఎంపీ ఒకరు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. చరిత్రను వక్రీకరించి.. రాజ్‌పుత్‌లో మనోభావాలు దెబ్బతీసేవిధంగా తెరకెక్కిన 'పద్మావతి' సినిమాను నిషేధించాలంటూ హర్యానా మంత్రి విపుల్‌ గోయెల్‌ కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు.

డిసెంబర్‌ 1న  విడుదల కానున్న ఈ చిత్రాన్ని నిలిపి వేయాలని డిమాండ్‌ చేస్తూ మరోవైపు జోరుగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆదివారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో కర్ణిసేన ఆధ్వర్యంలో ఈ సినిమాకు వ్యతిరేకంగా ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళన సభలో దాదాపు లక్ష మంది రాజ్‌పుత్‌ వర్గీయులు హాజరయ్యారు. పద్మావతిని నిలిపివేయాలంటూ వేలాది మంది సూరత్‌ లోనూ ఆందోళనలు నిర్వహించారు. ఈ చిత్రం లో రాణీ పద్మినిగా దీపికా పదుకొనే, ఆమె భర్త రతన్‌సింగ్‌గా షాహీద్‌ కపూర్, అల్లా వుద్దీన్‌ ఖిల్జీగా రణ్‌వీర్‌సింగ్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రాణీ పద్మిని, అల్లావుద్దీన్‌ ఖిల్జీల మధ్య ఓ ప్రేమగీతాన్ని చిత్రీకరించారని ఆరోపిస్తూ కర్ణిసేన నేతృత్వంలో రాజ్‌పుత్‌లు ఆరోపిస్తున్నారు.

‘చారిత్రక అంశాల్లోని వాస్తవాల ఆధారంగానే భన్సాలీ చిత్రం తీస్తే..తొలుత ఇచ్చిన మాట ప్రకారం మాకు సినిమాను చూపించడానికి ఎందుకు జంకుతున్నారు? ఈ సినిమాలో రాణి పద్మిని, అల్లావుద్దీన్‌ ఖిల్జీల మధ్య ప్రేమ గీతం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ చిత్రం విడుదలపై నిషేధం విధించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. పద్మావతి విడుదలైతే.. రాజపుత్రులు ఏం చేయగలరో చూపిస్తాం’ అని కర్ణిసేనకు చెందిన వీరేంద్రసిన్హ్‌ భాటి హెచ్చరించారు. ఈ చిత్రంపై నిషేధం విధించకుంటే గుజరాత్‌ ఎన్నికల్లో బీజేపీ తీవ్ర పర్యావసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు.

ఎవరి మనోభావాలు దెబ్బతీయలేదు: భన్సాలీ
ఎవరి మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఈ సినిమాను తెరకెక్కించలేదని, ఈ సినిమాతో రాజ్‌పుత్‌ల పట్ల గౌరవం పెంపొందుతుందే కానీ, భంగం వాటిల్లబోదని దర్శకుడు సంజయ్‌ లీలా భన్సాలీ ఇప్పటికే ఓ వీడియో ద్వారా వివరణ ఇచ్చారు. 'ఎంతో నిజాయితీతో, బాధ్యతతో, అకుంఠిత దీక్షతో ఈ సినిమాను తెరకెక్కించాను. రాణి పద్మావతి కథ నాలో ఎల్లప్పుడూ స్ఫూర్తి నింపుతూ ఉంటుంది. ఆమె వీరోచిత పోరాటం, త్యాగానికి ఘననివాళిగా ఈ చిత్రాన్ని రూపొందించాను. కొన్ని వందతుల వల్ల ఈ సినిమాపై వివాదం తలెత్తింది’ అని భన్సాలీ పేర్కొన్నారు.

’రాణి పద్మావతి, అల్లావుద్దీన్‌ ఖిల్జీ మధ్య డ్రీమ్‌సీక్వెన్స్‌ సినిమాలో ఉన్నట్టు వచ్చిన వదంతులను నేను ఇప్పటికే ఖండించాను. వారిద్దరి మధ్య అలాంటి సన్నివేశాలు ఉండవని రాతపూర్వకంగా హామీ ఇచ్చాను. ఈ వీడియో ద్వారా నేను మరోసారి స్పష్టం చేస్తున్నా..  ఎవరి మనోభావాలు దెబ్బతీసేవిధంగా రాణి పద్మావతి, ఖిల్జీ మధ్య సన్నివేశాలు ఉండబోవు’ అని భన్సాలీ తెలిపారు.

మరిన్ని వార్తలు