ఈవీవీ సంస్థ పేరు నిలబెట్టే సినిమా ఇది!

19 Feb, 2015 22:18 IST|Sakshi
ఈవీవీ సంస్థ పేరు నిలబెట్టే సినిమా ఇది!

ఒక్కో తరంలో ఒక్కో కథానాయకుడు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే బాధ్యతను భుజాన వేసుకుంటారు. రాజేంద్రప్రసాద్ తర్వాత ఈ తరంలో ఆ బాధ్యత మోస్తున్న ఓ కథానాయకుడు... ‘అల్లరి’ నరేశ్. ఆయన సినిమాకు వెళ్తే వందశాతం వినోదం గ్యారెంటీ అన్న మాట. నరేశ్ తాజాగా ‘బందిపోటు’ అవతారమెత్తారు. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఈవీవీ సినిమా పతాకంపై ఆర్యన్ రాజేశ్ నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా అన్నదమ్ములిద్దరూ ‘సాక్షి’ తో చెప్పిన ముచ్చట్లివీ...
 
 అల్లరి నరేశ్: ‘అష్టాచమ్మా’ చూసినప్పట్నుంచీ ఇంద్రగంటి మోహనకృష్ణతో సినిమా చేయాలనే ఆలోచన ఉండేది. ఆయన సినిమాల్లో కథనం, వ్యంగ్యం నాకు బాగా నచ్చుతాయి. అయితే ఆయన క్లాస్ డెరైక్టర్, నేనేమో మాస్. మరి మేమిద్దరం కలిసి సినిమా చేస్తే క్లాసూ, మాసూ రెండూ కలిసినంత కథ కావాలి. ‘బందిపోటు’లో ఆ రెండూ ఉన్నాయి. ఇందులో నేను క్లాస్‌గానే కనిపిస్తాను కానీ, చేసే పనులు మాత్రం యమా మాస్‌గా ఉంటాయి. దొంగలపైనే కన్నేసి వాళ్లను మాత్రమే దోచుకొనే కుర్రాడి పాత్ర అన్నమాట. ప్రేక్షకులు ప్రతి సన్నివేశాన్నీ ఆస్వాదిస్తూ హాయిగా నవ్వుకుంటారు.
 
 ఇదివరకటిలా స్కూఫ్‌లతో కూడిన కామెడీ కాకుండా, ఇందులో సన్నివేశాల నుంచే వినోదం పుడుతుంటుంది. యాభై సినిమాలకు చేరువవుతున్న నా ప్రయాణంలో నేను చేసిన ఒక భిన్నమైన చిత్రమిది. క్లాస్ డెరైక్టర్ అయిన ఇంద్రగంటిగారు నా కోసం కొంచెం మాస్‌గా మారారు. నేను ఆయన కోసం కొంచెం క్లాస్‌గా మారాను. అందుకే అటు క్లాస్, ఇటు మాస్ అందరినీ అలరించేలా ఉంటుందీ సినిమా. మా నాన్నగారు స్థాపించిన ‘ఈవీవీ సినిమా’ సంస్థ పునఃప్రారంభం ఇలాంటి క్లీన్ ఎంటర్‌టైనర్‌తో కావడం చాలా ఆనందంగా
 
 ఉంది. కచ్చితంగా ఈ సంస్థ పేరు నిలబెట్టే సినిమా అవుతుంది.
 ఆర్యన్ రాజేశ్: నరేశ్ సినిమాకు వచ్చినవాళ్లు నవ్వుకోవాల్సిందే. అయితే ఇటీవల తను చేసిన సినిమాల్లో రొటీన్ కామెడీనే ఎక్కువ. స్కూఫ్‌లపైనే ఆధారపడినట్టు అనిపించేది. అందుకే ఎలాగైనా నరేశ్ నుంచి ఓ కొత్త రకమైన చిత్రం రావాలి, తను ప్రేక్షకుల్ని కొత్తగా నవ్వించాలి, అదెలా? అని ఆలోచిస్తున్నప్పుడు వచ్చిన కథే ‘బందిపోటు’. రాజేంద్రప్రసాద్ గారి సినిమాల్లో ఎలాగైతే సన్నివేశాల నుంచి కామెడీ పుడుతుందో ఆ రకమైన కథ కథనాలతో తెరకెక్కిన చిత్రమే ఇది. ఉన్నవాళ్లను దోచి... లేనివాళ్లకు పంచి పెట్టే రాబిన్‌హుడ్ తరహా పాత్రలో నరేశ్ కనిపిస్తాడు.
 
 అలాగని సినిమా సీరియస్‌గా ఉండదు. ఎత్తులు, పైఎత్తులతో చాలా సరదాగా సాగుతుంది. సంపూ పాత్ర కూడా చాలా బాగుంటుంది. ఇంటిల్లిపాదీ కలిసి చూసేలా చిత్రాన్ని తీశారు మోహనకృష్ణ ఇంద్రగంటి. నాన్నగారు స్థాపించిన సంస్థ నుంచి ఒక మంచి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నామన్న సంతృప్తి ఉంది. ఇక నుంచి ఈవీవీ సినిమా సంస్థలో వరుసగా సినిమాలు నిర్మించబోతున్నాం.