ఓ ‘బందూక్’ ఆత్మ ఘోష

31 Oct, 2013 00:20 IST|Sakshi
ఓ ‘బందూక్’ ఆత్మ ఘోష
తెలంగాణ ఉద్యమ కథాంశంతో రూపొందనున్న చిత్రం ‘బందూక్’. లక్ష్మణ్ (బాబీ) స్వీయ దర్శకత్వంలో నిర్మించనున్న ఈ చిత్రం లోగోను తెలంగాణ జెఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఆవిష్కరించారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్.శంకర్, సి.ఎల్.రాజం, అల్లం నారాయణ, టీఎన్జీవో అధ్యక్షులు దేవిప్రసాద్, రసమయి బాలకృష్ణ, అద్దంకి దయాకర్, దేశ్‌పాండ్ శివాజి, తెలంగాణ ఫిలింఛాంబర్ అధ్యక్షులు విజేందర్‌రెడ్డి, మల్లేపల్లి లక్ష్మయ్య తదితర తెలంగాణ ప్రముఖులు దర్శక, నిర్మాత లక్ష్మణ్ ప్రయత్నాన్ని అభినందించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ -‘‘ఓ బందూక్ ఆత్మఘోష ఇది.
 
ఆత్మరక్షణ కోసం మనిషి తయారు చేసుకున్న బందూక్... నేడు చంపడం కోసమే ఉపయోగపడుతోంది. ప్రతి పోరాటంలో చంపడమే బందూక్ ఉనికిగా మారింది. తను లేని సమాజం లేదని బందూక్ అనుకుంటోంది. ఇలా బందూక్ ఆత్మఘోషను వివరిస్తూ ఈ సినిమా తీశాం. కేవలం తెలంగాణకు చెందిన నటీనటులు, సాంకేతిక నిపుణులతోనే ఈ సినిమా చేస్తాం’’ అని తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: క్రాంతిరెడ్డి సకినాల, రచనా సహకారం: కృష్ణచైతన్య జోషి, కార్యనిర్వాహక నిర్మాత: శ్రీధర్ మంచాల, సహ నిర్మాతలు: శ్రావణ్‌కుమార్, గణేష్‌బాబు, సమర్పణ: సంజయ్‌కుమార్.