సినిమా రివ్యూ: బ్యాంగ్ బ్యాంగ్

2 Oct, 2014 16:18 IST|Sakshi
సినిమా రివ్యూ: బ్యాంగ్ బ్యాంగ్
నటీనటులు: హృతిక్ రోషన్, కత్రినా కైఫ్, డాని డెన్ జోంగ్ పా
సినిమాటోగ్రఫి: వికాస్ శివరామన్, సునీల్ పటేల్
సంగీతం: విశాల్-శేఖర్
బ్యాగ్రౌండ్ స్కోర్: సలీం సులేమాన్
దర్శకుడు: సిద్ధార్థ్ ఆనంద్
 
బాలీవుడ్ తారలు హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ జంటగా రూపొందిన 'బ్యాంగ్ బ్యాంగ్' చిత్రం ఫస్ట్ లుక్, టీజర్స్  దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచింది. దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలకు చేరుకుందా అని తెలుసుకునే ముందు కథ ఎంటో తెలుసుకుందాం!
 
కథ: 
లండన్ లోని కోహినూర్ వజ్రాన్నిరాజ్ వీర్ (హృతిక్ రోషన్) దొంగిలిస్తాడు. కోహినూర్ వజ్రాన్ని దక్కించుకునేందుకు రాజ్ వీర్ వెనుక అంతర్జాతీయ మాఫియా డాన్ ఓమర్ జాఫర్ (డాని), హమీద్ గుల్ (జావెద్ జాఫ్రీ) ల గ్యాంగ్ వెంటాడుతుంది. అయితే మాఫియా గ్యాంగ్ కు చిక్కకుండా ఓమర్ జాఫర్ ను ఎలాగైనా కలుసుకోవాలని ప్రయత్నిస్తుంటాడు. ఓమర్ జాఫర్ ను ఎందుకు కలుసుకోవాలనుకుంటాడు? మాఫియా ఛేజింగ్ లో రాజ్ వీర్ తో హర్లీన్ (కత్రినా కైఫ్) ఎందుకు కలిసింది? రాజ్ వీర్ కోహినూర్ ఎందుకు దొంగిలించాడు? చివరికి కోహినూర్ వజ్రం కథ ఏంటి అనే ప్రశ్నలకు తెరమీద సిద్ధార్థ్ ఆనంద్ ఆవిష్కరించిన దృశ్య రూపమే 'బ్యాంగ్ బ్యాంగ్'.
 
ప్లస్ పాయింట్స్: 
హృతిక్, కత్రినాల కెమిస్ట్రీ
యాక్షన్ సీన్లు
ఫోటోగ్రఫి
మ్యూజిక్
కథనం
 
మైనస్ పాయింట్స్: 
కథ
విలనిజం
 
నటీనటుల ఫెర్ఫార్మెన్స్:
 
రాజ్ వీర్ గా హృతిక్ ఇండియన్ జేమ్స్ బాండ్ గా కనిపించాడు. 'సిక్స్ ప్యాక్' హృతిక్ యాక్షన్ సీన్లలో హాలీవుడ్ స్థాయి ఫెర్ఫార్మెన్స్ ను ప్రదర్శించాడు. యాక్షన్ సీన్లతోపాటు కత్రినాతో హాట్ హాట్ గా రొమాన్స్ చేశాడు. యాక్షన్ హీరోగా హృతిక్ తన సత్తాను మరోసారి సినీ ప్రేక్షకులకు రుచి చూపించాడు. 
 
ధూమ్-3 చిత్రంలో గ్లామర్ తో అదరగట్టేసిన కత్రినా  'బ్యాంగ్ బ్యాంగ్' లో ప్రదర్శించిన అందాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. హృతిక్ తో లిప్ లాక్, యాక్షన్, రొమాంటిక్ సీన్లలోనూ కత్రినా విజృంభించింది. పెద్గగా యాక్టింగ్ కు స్కోప్ లేకపోవడం, గ్లామర్ తోనే కత్రినా సంతృప్తి పరిచింది. 
 
డానీ, జావేద్ జాఫ్రీల విలనిజం గురించి పెద్దగా చెప్పుకునేంతగా ఏమి లేదు. 
 
సాంకేతిక విభాగాల పనితీరు: 
విశాల్-శేఖర్ సంగీతం, సలీం సులేమాన్ బ్యాగ్రౌండ్ స్కోర్ యాక్షన్ సీన్లకు జీవం పోశాయి. తూ మేరి, మెహర్ బాన్, బ్యాంగ్ బ్యాంగ్, ఉఫ్ పాటలు యువతకు జోష్ తోపాటు కిక్కెంచే విధంగా ఉన్నాయి. విశాల్-శేఖర్ అందించిన బాణీలకు వికాస్ శివరామన్, సునీల్ పటేల్ ల సినిమాటోగ్రఫి అదనపు ఆకర్షణగా నిలిచింది. యాక్షన్ సీన్లు, విదేశాల్లో అందమైన ప్రదేశాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు, ముఖ్యంగా జల విన్యాసాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని గురి చేస్తాయి. 
 
దర్శకత్వం: 
హాలీవుడ్ చిత్రం  'నైట్ అండ్ డే' చిత్ర ఆధారంగా సిద్దార్థ్ ఆనంద్ 'బ్యాంగ్ బ్యాంగ్' ను రూపొందించారు. యాక్షన్, రొమాన్స్ ప్రధాన అంశాలుగా రూపొందిన ఈ చిత్రంలోని కథపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం ప్రధాన లోపంగా మారింది. కేవలం స్క్రీన్ ప్లే ఆధారంగా ఓ ఛేజింగ్ లా సాగిన ఈ చిత్రం తొలి భాగంలో ట్రెడిషినల్ ఆడియన్స్ రోటిన్ గా అనిపించడమే కాకుండా, ప్రేక్షకులకు కొంత విసుగును తెప్పిస్తుంది. అయితే చిత్ర రెండవ భాగంలో ఓ ట్విస్ట్ తో బ్యాంగ్ బ్యాంగ్ అనిపించి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. చివర్లో కొంత సెంటిమెంట్ బ్యాంగ్ బ్యాంగ్ జోడించి ప్రేక్షకులతో ఓకే అనిపించుకోవడంలో సిద్దార్థ్ ఆనంద్ సఫలమయ్యారు. కేవలం యూత్ ను టార్గెట్ గా చేసుకుని నిర్మించిన ఈ చిత్ర విజయం కేవలం యాక్షన్, హృతిక్-కత్రినాల కెమిస్ట్రిపైనే ఆధారపడి ఉంటుంది. వంద కోట్ల క్లబ్ లో బ్యాంగ్ బ్యాంగ్ చేరడమనేది సాధారణ విషయమే.. అయితే యూత్, రెగ్యులర్ ఆడియెన్స్ ఆదరణ లభిస్తే 'బ్యాంగ్ బ్యాంగ్' భారీ కలెక్షన్లు కొల్లగొడుతుందనడానికి ఎలాంటి సందేహం అక్కర్లేదు
 
ముగింపు: 
కథ లేకుండా కేవలం హృతిక్ ఇమేజ్, కత్రినా గ్లామర్, యాక్షన్ సీన్లే ఈ చిత్రంలో కీలక అంశాలు. అంతకంటే అతిగా ఆశపడి థియేటర్ కెళ్లే ప్రేక్షకుడికి నిరాశే మిగులుతుంది. తెరపై హృతిక్ రోషన్ లో పరకాయ ప్రవేశం చేస్తే.. ప్రేక్షకుడికి బోలెడంత వినోదంతోపాటు ప్రేక్షకుడికి గిలిగింతలు కలగడం ఖాయం.