పప్పన్నం వెడ్స్‌ కోడికూర

12 Jan, 2019 02:47 IST|Sakshi
ఆమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమ్‌ అవుతున్న ‘బ్యాంగ్‌ బాజా బారాత్‌’ వెబ్‌ సిరీస్‌ పోస్టర్‌

వెబ్‌ఫ్లిక్స్‌

మన దగ్గర పెళ్లి ఇద్దరు వ్యక్తులకు కాక రెండు కుటుంబాల మధ్య ఎలా ఉంటుందో.. ఆ రెండు కుటుంబాలు ఇద్దరు వ్యక్తులకు ఎంత అండగా ఉంటాయో.. సామరస్యాన్ని ఎలా పెంపొందిస్తాయో చూపించే సిరీస్‌. అయితే పెళ్లికి  కావల్సింది అట్టహాసం కాదు అండర్‌స్టాండింగ్‌ అని,  ఇద్దరు వ్యక్తులకైనా రెండు కుటుంబాలకైనా అని చెప్తుంది బ్యాంగ్‌ బాజా బారాత్‌.  

పాత చింతకాయ విషయం  ఒకటి అనుకుందాం.  పెళ్లిళ్లు రెండు కుటుంబాల మధ్య జరుగుతాయి.  కానీ ఈ కథ అక్కడ ఆగదు.  అసలు మొదలవడమే  ఇంకో రకంగా మొదలౌతుంది.మోడర్న్‌ బట్టలు వేసుకుంటే  లుక్కు మారొచ్చు. కానీ అవుట్‌లుక్‌ మారదుగా! అంటే..  కనబడటానికి మోడర్న్‌గా ఉన్నా.. కొత్తదనాన్ని ఆహ్వానించే పరిపక్వతా ఉండాలి. ఇది మనందరికీ పనికొచ్చే కథే. నిజానికి మన పిల్లలకంటే మనమే చాలా మోడర్న్‌ అని చెప్పే కథ.‘‘స్టార్‌ హోటల్‌లో షెఫ్‌ని. కాంటినెంటల్‌ ఫుడ్‌ వండుతా. ఇంటికెళ్లి పప్పు అన్నం తిని తృప్తి పడ్తా. చిన్నటౌన్‌లో పెరిగిన వాడిని షాహనా..! ప్రొగ్రెసివ్‌గా ఉండాలని ఆశ. కాని సంప్రదాయాన్నే రెస్పెక్ట్‌ చేస్తున్నా. సారీ షాహనా!’’ పవన్‌ మల్హోత్రా అపరాధ భావం. ‘‘తప్పు నాదే పవన్‌. నువ్వన్నట్టుగా పెళ్లికి కొన్నాళ్లు ఆగాల్సిందేమో. నేనే తొందరపడ్డా. నాకు మూడేళ్లున్నప్పుడు మా నాన్న మమ్మల్ని వదిలేశాడు. అప్పటి నుంచీ అమ్మే అన్నీ. ఆమెకు నేనే సర్వస్వం. బిజినెస్‌ టూర్స్‌ వెళ్తున్నాను అని అబద్ధాలు చెప్పీ చెప్పీ అదే అబద్ధంతో నాన్న పట్టుబట్టాడు.నాన్నను చూసే చస్తే అబద్ధాలు చెప్పకూడదని డిసైడ్‌ చేసుకున్నా. ఎన్ని ప్రాబ్లమ్స్‌ వచ్చినా నిజమే చెప్తూ వచ్చా. నిజం నీకు నచ్చలేదు. ఎనీవే.. ఇట్స్‌ ఓవర్‌’’ అంటూ పవన్‌ వైపు తిరిగిందిషాహనా. ‘‘నిజంగా ఇట్స్‌ ఓవరా..?’’ బేలగా అడిగాడు  మౌనంగా ఆమె. 

అదే సమయానికి హోటల్‌ స్వీట్‌లో..‘‘వాళ్లనుకున్నట్టుగా కోర్ట్‌ మ్యారేజ్‌ చేసుకుంటే ఈ గొడవ ఉండేదే కాదుకదా! హ్యాపీగా ఈపాటికి హానీమూన్‌కి కూడా బయలుదేరేవారు. ఈ సిట్యుయేషన్‌కి మీరే కారణం’’అన్న, కాబోయే వదిన పెళ్లిపీటల మీద నుంచి చెప్పకుండా ఎటో వెళ్లిపోయారనే బాధ, పెద్దవాళ్ల మీద కోపంతో పెళ్లికొడుకు చెల్లి బర్ఖా. ‘‘నువ్వూరుకోమ్మా.. పదిమంది ముందు నా కూతురు పరువు తీసిందని అని నేను ఫీలవుతుంటే’’ అసహనంగా రంజిత్‌ అరోరా.. పెళ్లికూతురు తండ్రి. ‘‘అబ్బో.. అక్కడికి మీరేదో ప్రెసిడెంట్‌.. ప్రైమ్‌మినిస్టర్‌ అయినట్టు.. పరువట పరువు’’బర్ఖా వెటకారాలాడుతుంటేసహించలేకపోయింది ఆమె తల్లి రోలీ శర్మ. ‘‘ఏయ్‌.. చిన్నాపెద్దా లేకుండా ఏం మాటలవి’’ అంటూ కూతురిని బెదిరించే ప్రయత్నం చేసింది. ‘‘అసలు దీనికంతటికీ కారణం నువ్వే’’ అంటూ భార్య సుష్మిత ఘోష్‌ మీద విరుచుకు పడ్డాడు రంజిత్‌ అరోరా. ‘‘ఫ్రీడమ్‌ అంటూ అడ్డూఅదుపు, ఓ పద్ధతి, పాడూ లేకుండా పిల్లను పెంచావ్‌’’ కంటిన్యూ అయ్యాడు. ‘‘సారీ వదిన గారు.. ’’ అంటూ అపాలజీ చెప్పబోయింది సుష్మిత. ‘‘మీరు ఊరుకోండి వదినగారు.. ’’ అని ఆమెను ఆపి రంజిత్‌ అరోరాను చూస్తూ ‘‘అసలు తప్పు మీది. కూతురి వయసున్న అమ్మాయిలను మగవాళ్లు పెళ్లి చేసుకోవచ్చు. విడాకులు తీసుకున్నాక ఆడవాళ్లు ఇంకో బంధంలోకి వెళితే పిల్లల బాధ్యత మరిచిపోయినట్టు. ఏం న్యాయం ఇది?’’ వేలెత్తుతుంది రోలీ. వీళ్లు ఈ వాదోపవాదాల్లో ఉంటుండగానే నెమ్మదిగా స్వీట్‌లోకి అడుగుపెడ్తారు పవన్, షాహనా!వాళ్లను చూడగానే పిన్‌ డ్రాప్‌ సైలెంట్‌ అయిపోతారు అక్కడున్న వాళ్లంతా. వెంటనే సుష్మితా లేచి కూతురిని తీసుకొని తమ స్వీట్‌లోకి వెళ్లిపోతుంది. పవన్‌ బెడ్‌రూమ్‌లోకి వెళ్లి సోఫా మీద వాలిపోయాడు. అతని తండ్రి మురళీ ప్రసాద్‌ శర్మ వచ్చి కొడుకు ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. తండ్రి రాకతో అలర్ట్‌ అయ్యి సరిగ్గా కూర్చున్నాడు పవన్‌. 

‘‘కాలేజ్‌లో ఉన్నప్పుడు నేనూ ఓ అమ్మాయిని ప్రేమించా. వాళ్లు బాగా ఉన్నవాళ్లు. ఆమె మేనమామా ఎమ్మెల్యే. ఒకరోజు రాత్రి విపరీతంగా వర్షం పడ్తోంది. ఆ అమ్మాయి మా హాస్టల్‌ దగ్గరకు వచ్చి లెటర్‌ పంపించింది. బయటకు రమ్మని. వచ్చా. వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం అంది. భయపడి నేను వెళ్లలేదు. చిన్నప్పుడు అందరికీ గాంధీ హీరో ఉంటాడు. తర్వాత తండ్రి హీరోగా మారుతాడు. మనకు పిల్లలు పుట్టివాళ్లు ఎదిగాక పిల్లలకు హీరోలుగా కనిపిస్తుంటారు. నేనెప్పుడూ అనుకునే వాడిని నా కొడుక్కి నేనెందుకు హీరో కాలేకపోయాను? బహుశా కట్టుబాట్లను కాదనలేని పిరికితనం వల్లేమో అని అనుకునే వాడిని. అనుకున్నవన్నీ సాధిస్తున్న నీ తెగువ, ధైర్యానికి ముచ్చటపడ్డాను. నాకు నువ్వు హీరోగా కనపడ్డం మొదలెట్టావ్‌. కాని ఈరోజు నువ్వు చేసిన పని హీరోయిజం కాదురా! షాహనా మంచి అమ్మాయి.ఆ పిల్ల పెంపకం అలాంటిది. నువ్వు ఆ అమ్మాయిని ఇష్టపడ్తున్నావంటే ఆ అమ్మాయి బలహీనతలనూ అంతే ఇష్టంగా రిసీవ్‌ చేసుకోవాలి. ఆమె అలవాట్లనూ అంతే ఇదిగా గౌరవించాలి. నా మాట విను.. షాహనాను పెళ్లి చేసుకో. ఆ అమ్మాయే నీకు సరిజోడు’’ చివరి మాట.. కొడుకు తల నిమురుతూ చెప్పాడు మురళీ ప్రసాద్‌. ‘‘నాన్నా..’’ అన్నాడు పవన్‌. అవునన్నట్టుగా కళ్లతోనే జవాబిచ్చాడు తండ్రి. 

సరిగ్గా ఇదే సమయానికి షాహనా వాళ్ల హోటల్‌ స్వీట్‌లో.. ‘‘సారంగ్‌ని ఇప్పటికీ ప్రేమిస్తున్నావా?’’ కూతురిని అడిగింది సుష్మిత. సమాధానం చెప్పలేదు షాహనా. ‘‘నాకంటూ అయిన వాళ్లు ఎవరూ లేరు.దాంతో కుటుంబం, ఆ రిలేషన్స్, ఈ వ్యవహారాలు అన్నీ పెద్దగా పట్టలేదు నాకు. నిన్నూ నా లోకంలోనే ఉంచా. సంప్రదాయం అంతా తప్పు కాదు. దేనికైనా మన విజ్ఞతను అప్లయ్‌ చేయాలి. ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. పవన్‌ చాలా మంచివాడు. వాళ్ల ఫ్యామిలీ కూడా. అంత సంప్రదాయ బద్ధమైన ఫ్యామిలీ కూడా మన విషయాలన్నీ తెలిసీ పెళ్లికి ఒప్పుకుంది. పవన్‌తో ఓ మంచి కుటుంబం దొరుకుతోంది నీకు.నిజం చెప్పనా షాహనా.. ఈ విషయంలో నువ్వంటే జెలస్‌ ఫీలవుతున్నాను తెలుసా’’ అంది సుష్మిత కూతురి భుజమ్మీద చేయివేస్తూ! ‘‘అయినా... ఎందుకో ఈ పెళ్లి వద్దనిపిస్తోంది అమ్మా.. ’’ షాహనా.
ఈలోపే పవన్‌ వచ్చాడు ఆ స్వీట్‌లోకి. ‘‘షాహనా.. ఐ లవ్‌ యూ.. విల్‌ యూ మ్యారీ మీ.. ప్లీజ్‌’’అంటూ అభ్యర్థించాడు పవన్‌. అచేతనంగా ఉంది షాహనా. తల్లి వంక చూసింది. ఒప్పుకో అన్నట్టుగాకళ్లల్లోభావం.పవన్‌ను చూసింది.. ‘‘విల్‌ యూ’’ అడిగాడు మళ్లీ. సరే అంది. ముద్దు పెట్టుకుని థ్యాంక్స్‌ చెప్పి వెళ్లిపోయాడు. అమ్మ కూతురిని వాటేసుకుంది. కూతురు గట్టిగా అమ్మను పొదివి పట్టుకుంది. తర్వాత గంటకు ఆ ఇద్దరికీ అదే హోటల్‌లో ఇంతకు ముందు వేసిన వేదిక మీదే పెళ్లి అయింది. రిజిష్ట్రార్‌ ఆధ్వర్యంలో సంతకాల పెళ్లి. 

అంతకుముందు ఈ ఇద్దరి పెళ్లే ఎందుకు ఆగిపోయింది?
ఇప్పటికే అర్థమై ఉంటుంది షాహనా, పవన్‌ల నేపథ్యమే కాదు పెంపకాలు కూడా పూర్తిగా విరుద్ధమని. నాన్‌వెజ్‌ అనే మాటను కూడా నోట పలకని శుద్ధ శాకాహార కుటుంబం పవన్‌ వాళ్లది. నాన్‌వెజ్‌ లేకపోతే ముద్ద దిగని ఫ్యామిలీ షాహనా వాళ్లది. మెట్రో సిటీలో పుట్టిపెరుగుతుంది షాహనా. ఓ మోస్తరు టౌన్‌ పవన్‌ది. షెఫ్‌గా మెట్రో సిటీకి వచ్చాక.. ఆ ఆధునికత, హంగులకు ముచ్చటపడ్తాడు. పెళ్లికి ముందే సెక్స్‌ను ప్రొగ్రెసివ్‌ అనుకుంటాడు. అలాంటి పార్టనరే దొరికినందుకు సంతోషపడ్తాడు. షాహనా విషయానికి వస్తే.. సంప్రదాయాలు, సంస్కృతి వ్యక్తి స్వేచ్ఛకు అడ్డంపడే ఆటంకాలు. కంపార్టబులిటీ లేకపోతే విడిపోవడం చాలా కామన్‌ థింగ్‌ ఆమెకు. ఈ ఇద్దరూ ఆర్భాటాలు లేని రిజిష్టర్‌ మ్యారేజ్‌ చేసుకోవాలనుకుంటారు. కాని పవన్‌ తల్లిదండ్రులు ఒప్పుకోరు. ‘‘నీకు నచ్చిన పిల్లను మేము ఓకే అన్నప్పుడు మాకు నచ్చినట్టే పెళ్లి’’ అని షరతు పెట్టి మరీ స్టార్‌ హోటల్లో పెళ్లికి ఏర్పాట్లు చేస్తారు. ఆ పెళ్లి ఏర్పాట్లప్పుడే షాహనా కుటుంబం గురించి పూర్తిగా తెలుస్తుంది పవన్‌ కుటుంబానికి. అదంతా వాళ్లకు కాస్త మింగుడు పడని వ్యవహారంగానే ఉన్నా కొడుకు కోసం కాంప్రమైజ్‌ అవుతుంటారు. పవన్‌కు షాహనాకు సంబంధించి కొత్త విషయం తెలుస్తుంది. ఆమెకు అంతకుముందే ఓ బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నట్టు. అతను పెళ్లికి రావడం ద్వారా. బ్రేకప్‌ అయిందని సమాధాన పడ్తాడు. కాని అతను పెళ్లిలో ఉండొద్దనే షరతు పెడ్తాడు. అక్కడే ఇద్దరికీ మాటామాటా పెరిగి.. నమ్మకం, నమ్మకపోవడం దాకా సాగి పెళ్లి పీటల మీదనుంచి వెళ్లిపోతారు.ఆవేశం, కోపం, పంతం, పట్టుదల అంతా తగ్గాక అలా మళ్లీ కలుస్తారు. ఇది బ్యాంగ్‌ బాజా బారాత్‌ కథ. ఆమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. పవన్‌గా అలీ ఫజల్, షాహనాగా అంగిరా ధార్, మురళీ ప్రసాద్‌గా గజ్‌రాజ్‌ రావు, రంజిత్‌ అరోరాగా రజిత్‌ కపూర్, సుష్మితాగా షెర్నాజ్‌ పటేల్, రోలీగా అయేషా రజా నటించి మెప్పించారు. 
– సరస్వతి రమ

మరిన్ని వార్తలు