బస్తీమే సవాల్!

7 Jul, 2015 23:28 IST|Sakshi
బస్తీమే సవాల్!

 ముప్ఫై ఏడేళ్ళ వాసు (వర్మ) మంతెన... ఎం.ఎన్.ఆర్. గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్‌‌స అధినేత పెద్ద కొడుకు. టెక్స్‌టైల్స్ సహా వివిధ వ్యాపారాలున్న వ్యక్తి. విద్య, వ్యాపార రంగాల్లో ఉన్నా, కళారంగంపై ఆసక్తి గల యువకుడు. ఏడేళ్లు తబలా నేర్చుకొన్న వాసు సినిమాలను విశ్లేషణాత్మకంగా చూసి, కేవలం ఆ అనుభవంతో దర్శక, నిర్మాత అయ్యారు. జయసుధ కుమారుడు శ్రేయాన్ (హీరో) సహా పలువురు కొత్తవాళ్ళతో ‘బస్తీ’ సినిమాను స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఆయన ‘సాక్షి’తో పంచుకున్న అనుభవాలు...
 
  విద్య, వ్యాపారం - ఇన్ని పెట్టుకొని, సినిమాల వెపైలా వచ్చారు?
 వ్యాపారం లాంటివన్నీ వ్యాపారవేత్తగా తృప్తినిచ్చాయి. క్రియేటివ్ డ్రీమ్స్ ను నిజం చేసుకోవడానికే సినిమా వైపు వచ్చా.

  అనుభవం లేనప్పుడు తొలిసారిగా దర్శకత్వం కష్టమవలేదా?
 ప్రతిషాట్ తెరపై ఎలా ఉండాలనుకుంటున్నానో ఆలోచన ఉంది. కెమేరామన్‌కు వివరించేవాణ్ణి. టెక్నికల్ భాష క్రమంగా తెలుసుకొన్నా.

  బిజినెస్ చూసుకోక, ఈ సినిమాలెందుకని అమ్మానాన్న అనలేదా?
 మన డబ్బులు మనం ఖర్చు చేసుకుంటే ఇబ్బందేముంటుంది? అయితే, ఇదొక జూదం కాబట్టి, అమ్మానాన్న జాగ్రత్తలు చెప్పారు.

  ఏకకాలంలో నిర్మాణం, దర్శకత్వం - రెండంటే కష్టం కాలేదా?
 షూటింగ్‌కు వెళ్ళడాని కన్నా ముందే ప్రొడక్షన్ అంతా పక్కాగా ప్లాన్ చేసుకున్నాం. కెమేరా దగ్గర నుంచి అన్నీ ప్యాకేజ్‌లు మాట్లాడేసు కున్నాం. షూటింగ్ మొదల య్యాక నిర్మాతగా నేను చేయాల్సిందేమీ లేదు. టైవ్‌ుకు తగ్గట్లు డబ్బులు అకౌంట్స్ వాళ్ళు రిలీజ్ చేసేవారు. రోజూ నా దృష్టంతా క్రియేటివ్ వ్యవహారాలు, డెరైక్షన్ మీదే.

  ఎంత ప్లాన్ చేసినా, అనుకోని కష్టాలు, అదనపు ఖర్చులుంటాయే?
 సాదరఖర్చులకి డబ్బుపెట్టాం. 95 శాతం అనుకున్నట్లే జరిగింది.

  హీరో, హీరోయిన్... అంతా కొత్తే. ఫస్ట్‌ఫిల్మ్‌కింత రిస్కెందుకు?
 నిజానికి, ఒక చిన్న సినిమా అనుకున్నా. జయసుధ గారబ్బాయిని అనుకోకుండా నిర్మాత లగడపాటి శ్రీధర్ ఆఫీస్‌లో చూశా. వాళ్ళమ్మ గారు కూడా ఈ సినిమాతో శ్రేయాన్ పరిచయానికి ఒప్పు కున్నాక - ప్రొడక్షన్ విలువలు, బడ్జెట్ పెంచా. పూర్తిస్థాయిలో కమర్షియల్ పంథాలో వెళ్ళాం. కాకపోతే, కెమేరా (వి.కె. గుణశేఖర్), ఎడిటింగ్ (గౌతంరాజు) విభాగాల్లో ఎక్స్‌పర్‌‌ట్సను పెట్టుకొని, నా ఆలోచన తెర మీదకు ట్రాన్‌‌సఫరయ్యేలా చూసుకున్నాం.

  చిన్న సినిమా అయినా, పబ్లిసిటీకి చాలా ఖర్చు చేశారే?
 నా ప్రధాన బలం - మార్కెటింగ్. సినిమా ఎంత మంచిదైనా, జనాన్ని థియేటర్ల దాకా రప్పించడానికి మార్కెటింగ్ అవసరం. అందుకే, మొత్తం బడ్జెట్‌లో 20 శాతం రేడియో, టీవీ, ప్రింట్, పోస్టర్ పబ్లిసిటీకి కేటాయించాం. ఒకేరోజు 9 సినిమాలు రిలీజైనా, ‘బస్తీ’కి మంచి ఓపెనింగ్‌‌స రావడానికి మా మార్కెటింగ్ హెల్పయింది.

  కానీ, ‘బస్తీ’ సినిమాకు ప్రశంసలతో పాటు విమర్శకుల విసుర్లు కూడా బాగానే తగిలాయే?
 ప్రేక్షకుల నుంచి రెస్పాన్‌‌స బాగుంది. కొత్తవాళ్ళతో తీసిన ఒక చిన్న సినిమాకు ఈ మాత్రం రావడం పెద్ద విషయమే. ఇక, క్రిటిక్స్ రెస్పాన్‌‌స ఒకరికొక రిది పూర్తి భిన్నంగా ఉంది. సంగీతం బాగుందని కొందరంటే, అస్సలు బాగా లేదని కొందరన్నారు. అవి ఆ వ్యక్తి తాలూకు అభిప్రాయాలే తప్ప, సర్వే చేసి సేకరించిన సమాచారం కాదు కాబట్టి వాటిని పట్టించుకోకూడదు.

  పట్టించుకోకుండా, నిరుత్సాహపడకుండా ఉండడం సాధ్యమా?
 నేను నిరుత్సాహపడలేదు. కాకపోతే, ఇవాళ రిలీజ్ సినిమా లైఫ్ 3 రోజుల నుంచి ఒక వారమే. కాబట్టి, పరస్పర భిన్నమైన అభిప్రాయాల వల్ల జనం కన్‌ఫ్యూజన్‌కు గురవుతారు. సినీ రంగానికి కొత్తరక్తం రావాలి. కొత్త దర్శక-నిర్మాతల్ని ప్రోత్సహించాలే తప్ప, నిరు త్సాహపరచకూడదు. వ్యక్తిగత విమర్శకు దిగకూడదు.

  కానీ ‘బస్తీ’కీ, గతంలోని అనేక సినిమాలకూ పోలికలున్నాయని...
 (మధ్యలోనే అందుకుంటూ...) అనేక అడ్డంకుల మధ్య ఒక అమ్మాయికీ, అబ్బాయికీ మధ్య జరిగే ప్రేమ అనేది సినిమాల్లో కామన్‌గా చూపే లవ్‌స్టోరీనే. కాకపోతే, నా సినిమా నేపథ్యం, దాన్ని తెరపై చూపిన తీరు భిన్నం. ఏ సినిమాలూ, సీన్లూ కాపీ కొట్టలేదు.

  ద్వంద్వార్థపు డైలాగులు, ఎడల్ట్ కామెడీ ఉన్నాయని కూడా టాక్.
 చూడండి. ‘బస్తీ’లో ఉన్నది కేవలం లైటర్ వీన్ కామెడీనే. సకుటుంబంగా చూడదగ్గ ప్యూర్, క్లీన్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించాలనే తీశాం. అయితే ఏ ఆర్టిస్టు, ఏ సందర్భంలో ఎలా పలికాడన్న దాన్నిబట్టి ఒకే డైలాగ్ రకరకాలుగా స్ఫురిస్తుంది. ఇప్పుడాలోచిస్తుంటే, ఆయా ఆర్టిస్ట్‌ల గత ఇమేజ్ వల్ల ఆ భావన కలిగిందనిపిస్తోంది.

  ఇంతకీ, శ్రేయాన్‌ను తెరపై చూశాక జయసుధ రియాక్షన్?
 ఆమెకు సినిమా నచ్చింది. ముందుగా మేము అనుకున్న కథలో శ్రేయాన్ కోసమంటూ మార్పులేమీ చేయలేదు. సింపుల్ కథను కమర్షియల్‌గా చెప్పాం. మా అందరికీ సినిమా నచ్చింది.

 ఇవాళ్టి రోజున సినిమా తీయడం కన్నా, రిలీజ్ కష్టమేమో?
 కచ్చితంగా. రిలీజ్‌కు పడ్డ కష్టమే ఎక్కువ. డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగాల్లో గందరగోళం ఉంది. అనుభవం లేకపోవడం వల్ల ఇబ్బంది పడ్డాం. సొంతంగా రిలీజ్ చేశాం. ఆడియో రిలీజైన రెండు వారాల్లో సినిమా రిలీజ్ చేసెయ్యాలనుకొని, తొందరపడ్డాం. మరొక నెల రోజులు ఆగి ఉంటే ఇంకా బాగుండేదేమో. అఫ్‌కోర్‌‌స... ఇదంతా మనం నేర్చుకొనే క్రమంలో భాగమే. వచ్చేసారి ఈ తప్పులు చేయను.

  తదుపరి సినిమాకు సిద్ధమవుతున్నారా?
 హీరో, ఇద్దరు హీరోయిన్లతో ఒక సింగర్ కథ సిద్ధం చేస్తున్నా. కొత్త ట్యాలెంట్ కోసం చూస్తున్నా.

 అయితే, సినీ రంగంలోనే కొనసాగదలిచారా?
 తప్పకుండా. సినిమా నాకొక ప్యాషన్. వ్యాపారాలు చేస్తూనే, ఏడాదికొక సినిమా తీస్తాను.
  - రెంటాల జయదేవ