అందమైన ప్రేమకథ

8 Jun, 2015 03:01 IST|Sakshi
అందమైన ప్రేమకథ

 ‘ఎవడే సుబ్రమణ్యం’లో నాని స్నేహితుడి పాత్రను పోషించిన విజయ్ దేవరకొండ హీరోగా ఓ చిత్రం ఆరంభం కానుంది. గౌతమ్ మీనన్ దగ్గర దర్శకత్వ శాఖలో చేసిన రమణ మల్లం దర్శకత్వంలో కన్నెగంటి వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. చిత్రవిశేషాలను నిర్మాత తెలియజేస్తూ - ‘‘విజయ్, రేష్మీ మీనన్ పాల్గొనగా ఇటీవల ఫొటోషూట్ చేశాం. జంట చూడచక్కగా ఉంది. ‘ఎవడే సుబ్రమణ్యం’లో రిషి పాత్ర ద్వారా అందర్నీ ఆకట్టుకున్న విజయ్ ఈ చిత్రంతో హీరోగా మంచి పేరు తెచ్చుకుంటారు. ఓ అందమైన ప్రేమకథతో ఈ చిత్రం సాగుతుంది. ప్రేమ, వినోదం, యాక్షన్.. ఇలా అన్ని అంశాలూ ఉంటాయి’’ అన్నారు. ఈ చిత్రానికి కథ: సురేంద్రకృష్ణ, మాటలు: నిరూప్, సంగీతం: రథన్.