సరైన సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టా!

12 Jun, 2016 23:10 IST|Sakshi
సరైన సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టా!

‘‘ ‘చిన్నోడు-పెద్దోడు’ సినిమాతో మా శ్రీదేవి మూవీస్ బ్యానర్‌ను స్థాపించాను. ఇప్పటికి 28 ఏళ్లు అయింది. ఆ తర్వాత నేను కొన్ని సినిమాలు చేసినా ‘ఆదిత్య-369’ సినిమా నిర్మాతగా ఇప్పటికీ గుర్తుపట్టడం నా అదృష్టం. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావా లనే ఉద్దేశంతో ఇన్నాళ్లూ నా బేనర్లో సినిమా తీయలేదు. సెకండ్ ఇన్నింగ్స్‌ను మంచి సినిమాతో ప్రారంభించాననే అనుకుంటున్నా’’ అని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ అన్నారు.

నాని, సురభి, నివేదా థామస్ ముఖ్యతారలుగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ఏడేళ్ల విరామం తర్వాత శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన చిత్రం ‘జెంటిల్‌మన్’. ఈ శుక్రవారం చిత్రం విడుదల కానున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ -‘‘ ‘జెంటిల్‌మన్’ కథను తమిళ రచయిత డేవిడ్ నాథన్ కొన్నేళ్ల క్రితం చెప్పారు. బాగా నచ్చింది. ఎప్పటినుంచో నా మైండ్‌లో ఈ కథ నలుగుతూనే ఉంది.

మోహనకృష్ణ ‘బందిపోటు’ సినిమా అంగీకరించక ముందే నేనాయనతో సినిమా చేయాలనుకున్నాను. కానీ, ఆ సినిమా మొదలైంది. సర్లే.. తర్వాత చేద్దా మనుకున్నా. ఆ చిత్రం ఆశించిన విజయం సాధించకపోవడంతో రిస్క్ అవుతుందని మోహన్ అన్నారు. కానీ ఫ్లాప్‌లు ఎవరికైనా సహజం. అందుకే పర్లేదని చెప్పగానే కొన్ని కథలు వినిపించారు. అప్పుడు చాన్నాళ్ల క్రితం విన్న కథ గురించి ఆయనకు చెప్పా.

నిజానికి మోహనకృష్ణకు సొంతగా కథలు రాసుకోవడం ఇష్టం. అందుకే అయిష్టంగానే వినడానికి అంగీకరించారు. కానీ కథ నచ్చి, సినిమాకు తగ్గట్టుగా తీర్చిదిద్దారు. నాని చేసిన నెగటివ్ షేడ్ పాత్ర కథకు కీలకం. రొమాంటిక్ థ్రిల్లర్‌గా సాగే ఈ సినిమాలోని ప్రతి సీన్ అందర్నీ  ఆకట్టుకుంటుంది. సినిమా నిర్మాణంలో చాలా మార్పులు వచ్చాయి. ఎంతో సాంకేతికత పెరిగింది. ప్రేక్షకుల అభిరుచిలో కూడా చాలా మార్పు వచ్చింది. వాళ్లు కొత్తదనం కోరుకుంటున్నారు. అందుకు తగ్గట్టే మంచి సినిమాలు తీయాలన్నది నా ఆలోచన’’ అని చెప్పారు.