నన్ను హీరోను చేసింది బెజవాడే

19 Apr, 2014 09:56 IST|Sakshi
నన్ను హీరోను చేసింది బెజవాడే

 నేను పుట్టింది బెజవాడలోనే ..నన్ను హీరోను చేసింది కూడా బెజవాడేనని ఆ ఐదుగురు సినీహీరో వెంకట్ అన్నారు.  నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్న ఎం అండ్ ఎం షోరూమ్ నిర్వాహకులు   హీరో వెంకట్,  హీరోయిన్ అస్మితలతో కలిసి  విలేకరుల సమావేశం నిర్వహించారు.  వెంకట్ మాట్లాడుతూ.. నేను బెజవాడలో పుట్టినప్పటికీ, చదువుకున్నదీ ముంబయిలో అని చెప్పారు.  ప్రతి వేసవి సెలవులకు   బెజవాడ వచ్చి, ఎక్కువగా సినిమాలు చూస్తుండేవాడినన్నారు.

గాంధీనగర్‌లో సినిమా థియేటర్‌లు ఉన్న రోడ్డు అంటే ఎంతో ఇష్టమని, ఇక్కడ సినిమాలు చూసే హీరో అయ్యానని చెప్పారు.  నేను క్యూలో నిల్చుని, బెంచి టికెట్ కొనుక్కుని సినిమా చూసిన  థియేటర్‌లలో నేను నటించిన సినిమాలు  సీతారాముల కల్యాణం, శివరామరాజు వంటి సినిమాలు  అత్యధిక రోజులు ప్రదర్శితమవడం ఆనందంగా ఉందన్నారు.  ‘ఆ ఐదుగురు’ సినిమా స్టోరీ కూడా చాలా బాగుంటుందని, ఒక సిన్సియర్ ఐపీఎస్ ఆఫీసర్ ముఖ్యమంత్రి అయితే సమాజంలో ఎలా మార్పు తీసుకురాగలడన్నది ప్రధాన ఇతివృత్తమని వివరించారు.

 రొమాంటిక్ సన్నివేశాలు, పాటలు తక్కువగా ఉంటాయన్నారు. సినిమా హీరోయిన్ అస్మిత మాట్లాడుతూ..ఈ సినిమా తన మూడో చిత్రమని చెప్పారు. తప్పకుండా ప్రేక్షకాదరణ పొందుతుందన్నారు.  నిర్మాత ప్రేమ్ పట్రా మాట్లాడుతూ.. ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందన్నారు.