మా నాన్నకి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాను

23 May, 2019 01:46 IST|Sakshi
బెల్లంకొండ సాయిశ్రీనివాస్

‘‘జనరల్‌గా ఏదైనా కథ విన్న తర్వాత ఈ సినిమా చేస్తే ఆడియన్స్‌కి నచ్చుతుందా? కమర్షియల్‌ అంశాలు ఏం ఉన్నాయి? అని ఆలోచిస్తాను. కానీ ఫస్ట్‌ టైమ్‌ కథ నచ్చి రిజల్ట్‌ గురించి ఆలోచించకుండా ‘సీత’ సినిమాలో నటించాను. యాక్టర్‌గా మరింత ఇంప్రూవ్‌ అయ్యే ఏ అవకాశాన్నీ వదులుకోను’’ అని బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ అన్నారు. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్, కాజల్‌ అగర్వాల్‌ జంటగా నటించిన సినిమా ‘సీత’. మన్నారా చోప్రా మరో కథానాయిక. రామబ్రహ్మం సుంకర నిర్మించారు. అజయ్‌ సుంకర, అభిషేక్‌ అగర్వాల్‌ సహ–నిర్మాతలు. ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ చెప్పిన విశేషాలు.

► తేజగారు నాకు రెండు కథలు చెప్పారు. ‘సీత’ కథ నాకు నచ్చింది. మా నాన్నగారికి (బెల్లంకొండ సురేశ్‌) మరో కథ నచ్చింది. కానీ రియలిస్టిక్‌ అప్రోచ్‌గా ఉందని ‘సీత’ చిత్రాన్ని ఓకే చేశాం. నా కెరీర్‌కు మంచి హెల్ప్‌ అవుతుందనిపించింది. ఈ చిత్రంలో మానవ సంబంధ, బాంధవ్యాలకు విలువ ఇచ్చే రఘురాం పాత్రలో నేను నటించాను. నా పాత్రలో వేరియేషన్స్‌ ఉంటాయి. నా పాత్రకు ఓ ప్రాబ్లమ్‌ ఉంటుంది. అందుకే పోస్టర్‌లో నాకు రెండు వాచ్‌లు ఉంటాయి. జీవితంలో డబ్బే ముఖ్యమనే పాత్రలో కాజల్‌ నటించారు. సినిమాలోని మొదటి రెండు గంటలు చాలా ఎంటర్‌టైనింగ్‌గా సాగుతుంది. క్లైమాక్స్‌ ఎమోషనల్‌గా ఉంటుంది.

► ఏ సినిమా సెట్స్‌లో అయినా నేను పూర్తిగా డైరెక్టర్‌కు సరెండరైపోతాను. ఈ సినిమాకీ అంతే. తేజగారి ఇన్‌పుట్స్‌ నా కెరీర్‌కు బాగా ప్లస్‌ అవుతాయి.  ఆయనతో ఈ సినిమా జర్నీ నాకు మంచి ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చింది. ఈ సినిమా ఫస్ట్‌డే సెట్‌లో తేజగారు నాకు ఓ పేజీ డైలాగ్స్‌ ఇచ్చారు. నాలోని యాక్టర్‌ని పరీక్షిస్తున్నారేమో అనిపించింది. క్యారవ్యాన్‌లోకి వెళ్లి ఆ డైలాగ్స్‌ను బాగా ప్రాక్టీస్‌ చేసి వచ్చి కెమెరా ముందు చెప్పాను. తేజగారు షాక్‌ అయ్యారు. ‘నీలో నటుడు ఉన్నాడని తెలుసు కానీ ఇంత మంచి నటుడు ఉన్నాడని ఇప్పుడే తెలిసింది’ అన్నారు. చాలా హ్యాపీ ఫీలయ్యా. చాలా కష్టపడి కంబోడియాలోని అంగోర్‌ వాట్‌ టెంపుల్‌లో షూటింగ్‌ చేశాం. అక్కడ షూటింగ్‌ చేసుకున్న రెండో సినిమా మాదేనట.

► ఈ సినిమా కథ విన్నప్పుడే ఇందులో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తారని తెలిసింది. ఇంతకుముందు కాజల్, నేను కలిసి ‘కవచం’ సినిమా చేశాం. ‘సీత’ సినిమాలోని సీత క్యారెక్టర్‌కు కాజల్‌నే కరెక్ట్‌ అనిపించింది. ఇక ఈ సినిమాకు సరిగ్గా సరిపోతుందనే ‘సీత’ టైటిల్‌ను పెట్టాం. ‘మీరు హీరో అయ్యుండి లేడీ ఓరియంటెడ్‌ టైటిల్‌ పెట్టారేంటి?’ అని చాలామంది అడిగారు. నా క్యారెక్టర్‌ బాగున్నప్పుడు ఇవన్నీ ప్రాబ్లమ్‌ కాదనుకున్నాను. ‘అల్లుడు శీను’ సినిమా తర్వాత మళ్లీ ఈ సినిమాలో కామెడీ చేశాను.

► జనరల్‌గా పోలీస్‌ పాత్రను నా డ్రీమ్‌ రోల్‌గా భావిస్తుంటాను. ‘కవచం’ సినిమాలో పోలీస్‌ పాత్ర చేశాను. అంతగా సక్సెస్‌ కాలేదు. అందుకే ‘రాక్షసుడు’లో మళ్లీ పోలీస్‌ పాత్ర చేస్తున్నాను. పోగొట్టుకున్న చోటే వెతుక్కోమంటారు కదా. నా సినిమాల హిందీ వెర్షన్స్‌కు యూట్యూబ్‌లో మంచి వ్యూస్‌ వస్తున్నాయి. హిందీలో నాకు మంచి మార్కెట్‌ ఏర్పడుతోంది. బన్నీ, నా సినిమాలకే ఇలా ఎక్కువగా వ్యూస్‌ వస్తున్నాయి. కొత్త దర్శకులతో వర్క్‌ చేయడానికి ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నా. సరైన కథ దొరకాలి. ప్రస్తుతం ‘రాక్షసుడు’ సినిమా చేస్తున్నాను. జూలైలో విడుదల అనుకుంటున్నాం. అజయ్‌ భూపతితో చేయాల్సిన సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి.

► ఈ సినిమాతో మీకు యాక్టర్‌గా మంచి గౌరవం వస్తుందని యూనిట్‌ సభ్యులు అన్నారు. ఈ మాట ఆడియన్స్‌ కూడా అంటే చాలా సంతోషపడతాను. ‘సీత’ కథను నాన్నగారు ఓకే చేయలేదు అంటే.. ఆయన ఇంకా ఏదైనా ఎక్స్‌పెక్ట్‌ చేశారేమో. ఈ సినిమాను మా అమ్మగారికి, మా తమ్ముడికి చూపించాను. వారికి నచ్చింది. అమ్మ అయితే క్లైమాక్స్‌ సన్నివేశాలకు ఏడ్చారు. మా నాన్నగారికి మే 24న ఈ సినిమాతో గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాను.

మరిన్ని వార్తలు