ఆయన బంగారు కొండ : సంపత్ నంది

19 Oct, 2015 00:11 IST|Sakshi
ఆయన బంగారు కొండ : సంపత్ నంది

 ‘‘ఈ వేడుకకు హీరో భీమ్స్. అతనిలో మంచి విషయం ఉంది. ఈ సినిమాతో భీమ్స్ స్టార్ మ్యూజిక్ డెరైక్టర్ అయిపోతాడు. మా నిర్మాతకు చాలా లాభాలు వస్తాయి. ఈ చిత్రంతో ఆయన పెద్ద నిర్మాత అయిపోతారు. నా లెక్క ప్రకారం ఈ చిత్రం నీకు హ్యాట్రిక్ అవుతుంది (సంపత్ నందిని ఉద్దేశించి)’’ అని రవితేజ అన్నారు.  శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై రవితేజ, తమన్నా, రాశీ ఖన్నా హీరో, హీరోయిన్లుగా సంపత్ నంది దర్శకత్వంలో కె.కె. రాధామోహన్ నిర్మించిన చిత్రం ‘బెంగాల్ టైగర్’. భీమ్స్ స్వరాలందించిన ఈ చిత్రం పాటల వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన హిందీ నటుడు బొమన్ ఇరానీ ఆడియో సీడీని ఆవిష్కరించి రవితేజకు ఇచ్చారు.

ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ - ‘‘రవితేజ ఎనర్జీ గురించి చెప్పాలంటే నా ఎనర్జీ చాలదు. ఆయన బంగారు కొండ. కరెక్టుగా ఆకలి వేసినప్పుడు నాకు అన్నం పెట్టిన వ్యక్తి. నాకు ఇంత మంచి అవకాశమిచ్చిన రవితేజగారికి కృతజ్ఞతలు. సింగిల్ సిట్టింగ్‌లో ఆయన ఈ కథను ఓకే చేశారు. రవితేజగారి అభిమానులను 1000 పర్సెంట్ శాటిస్ఫై చేసే చిత్రం. భీమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు. రేపటి నుంచి భీమ్స్ పేరు మారుమ్రోగిపోతుంది’’ అన్నారు. ‘‘ఈ రోజు మాట్లాడాలంటే కన్నీళ్లు ఆగడం లేదు. మాటలు రావడం లేదు. నేనీ రోజు మీ ముందు మాట్లాడుతున్నానంటే సంపత్‌గారే కారణం.

 ఆయన మాట మీద రవితేజగారు నాకీ ఛాన్స్ ఇచ్చారు. ఆయనకు నా కృతజ్ఞతలు’’ అని భీమ్స్ చెప్పారు. రాధామోహన్ మాట్లాడుతూ - ‘‘ఇంతకుముందు చిన్న సినిమాలు చేశాను. రవితేజగారు ఒప్పుకుంటారా లేదా అని డౌట్ ఉండేది. రెండు మూడు సిట్టింగ్స్‌తో నా మీద ఆయనకు నమ్మకం వచ్చింది. సంపత్‌లో టాలెంట్ ఉంది. అందుకే ‘ఏమైంది ఈవేళ’ సినిమాకి అవకాశమిచ్చాను. భీమ్స్‌కి మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అన్నారు. బొమన్ మాట్లాడుతూ - ‘‘సంపత్ చెప్పిన కథ విని, 15 నిముషాల్లో ఓకే చెప్పాను. రవితేజకు ఎనర్జీ ఎక్కణ్ణుంచి వస్తుంది అంటే.. ఆయన ఫ్యాన్స్ దగ్గర నుంచే వస్తుంది’’ అన్నారు. కెరీర్ ఆరంభించినప్పట్నుంచీ రవితేజతో సినిమా చేయాలనుకున్నాననీ, ఇప్పటికి కుదిరిందనీ తమన్నా చెప్పారు.  గౌతంరాజు, రామజోగయ్యశాస్త్రి, భాస్కరభట్ల, పృథ్వీరాజ్, సమీర్, రాశీ ఖన్నా, అక్ష, హంసా నందిని తదితరులు పాల్గొన్నారు.