అతని వికృత చేష్టలు భరించలేకపోయాను: నటి

13 Jan, 2020 20:09 IST|Sakshi

కలకత్తా: బీటౌన్‌ నుంచి దక్షిణాది వరకు, అటు నుంచి తెలుగు చిత్ర పరిశ్రమలోనూ సంచలనం సృష్టించింది ‘మీ టూ’ ఉద్యమం. తాజాగా ఈ ఉద్యమ సెగ బెంగాలీ చిత్ర పరిశ్రమను కూడా తాకింది. ప్రముఖ బెంగాలీ బుల్లితెర నటీ రూపంజన మిత్రా తనను దర్శకుడు అరిందం సిల్‌ లైంగికంగా వేధించాడని ఓ ఇంటర్వ్యూలో బహిరంగంగా చెప్పడంతో సంచలనంగా మారింది.

రూపంజన మిత్రా ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ‘భూమికన్యా’ సీరియల్‌ నిర్మాత అరిందమ్‌ సిల్‌ ఆఫీసులో తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని పేర్కొంది. ‘ఈ సీరియల్‌ మొదటి ఎసిసోడ్‌ కోసం స్క్రిప్ట్‌ చదవాలంటూ అరిందమ్‌ సిల్‌ కలకత్తాలోని తన ఆఫీసుకు రమ్మని చెప్పాడు. నేను సాయంత్రం 5 గంటల ప్రాంతంలో ఆఫీసుకు వెళ్లాను. లోపలికి వెళ్ళి చూసేసరికి అక్కడ ఎవరూ లేరు. నేను, ఆయన మాత్రమే ఉన్నాము. నేను లోపలికి వెళ్లిన కాసేపటికీ ఆయన నా తల నుంచి వీపుకు వరకు చేతితో తడమడం మొదలు పెట్టాడు. ఎవరైనా వచ్చి నన్ను అక్కడి నుంచి బయటపడేస్తే బాగుండనకుంటూ దేవుడికి ప్రార్థించాను. అతని వికృత చేష్టలు భరించలేక స్క్రిప్ట్‌ గురించి చెప్పండి అన్నాను. ఆ తర్వాత స్క్రిప్ట్‌ను వివరించడం మొదలు పెట్టిన కొద్ది నిమిషాలకే ఆయన భార్య ఆఫీసులోకి వచ్చింది. ఇక నేను హమ్మయ్యా.. బతికిపొయాననుకొని నా ప్రార్థన విన్న దేవుడికి మనసులో థ్యాంక్స్‌ చెప్పుకున్నాను’ అని చెప్పుకొచ్చింది. అయితే ఈ ఘటన దుర్గ పూజకు కొన్ని రోజుల ముందే జరిగిందని ఆమె పేర్కొన్నారు.


కాగా నిర్మాత అరిందమ్‌ సిల్‌ అలాంటిదేం లేదని, రూపంజన నేను పాత​ స్నేహితులమంటూ తనపై వచ్చిన ఆరోపణలను కొట్టిపారేశాడు. ఇక దర్శకుడు, నటుడైన అరిందమ్‌ సిల్‌ ‘హర్‌ హర్‌ బ్యోమకేష్‌’, ‘ఈగోలర్‌ ఛోఖ్‌’, ‘దుర్గా సోహాయ్‌’ వంటి ప్రముక చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ‘సిందూర్‌ ఖేలా’, ‘సోతి’, ‘ఏక్‌ఆకాష్‌’ వంటి సీరియల్‌లో నటించిన రూపంజన మిత్రా బెంగాలీ బుల్లితెర నటులలో ఒకరుగా మారారు.

మరిన్ని వార్తలు