నేను గర్వంగా ఫీల్‌ అయ్యే చిత్రం బేవర్స్‌

1 Oct, 2018 02:26 IST|Sakshi
హర్షిత, రమేష్‌ చెప్పాల రాజేంద్రప్రసాద్, సుద్దాల, సంజోష్‌

‘‘తల్లిదండ్రులను అర్థం చేసుకోని పిల్లలే కాదు,  పిల్లల్ని అర్థం చేసుకోని తల్లిదండ్రులు కూడా బేవర్సే. సినిమా చూసిన తర్వాత టైటిల్‌ ఎందుకు పెట్టామో అర్థం అవుతుంది.  మంచి సామాజిక స్పృహ ఉన్న చిత్రం చేశా అనే తృప్తి మిగిలింది. మనకంటే మనం చేసిన పాత్రలే గుర్తుండాలి. పాత్రల వల్లే నటులు గుర్తుంటారు’’ అని నటకిరీటి రాజేంద్రప్రసాద్‌ అన్నారు. రమేష్‌ చెప్పాల దర్శకత్వంలో రాజేంద్రప్రసాద్‌ ముఖ్య పాత్రలో సంజోష్, హర్షిత జంటగా తెరకెక్కిన చిత్రం ‘బేవర్స్‌’. పొన్నాల చందు, ఎం.ఎస్‌. మూర్తి, అరవింద్‌ నిర్మించారు.

అక్టోబర్‌ 12న రిలీజ్‌ కానున్న ఈ చిత్రం ఆడియో రిలీజ్‌ హైదరాబాద్‌లో జరిగింది. రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ– ‘‘నేను గర్వంగా ఫీల్‌ అయ్యే పది సినిమాల్లో ‘బేవర్స్‌’ ఉంటుంది. నేను రుణపడే దర్శకుల్లో రమేశ్‌ కూడా ఉంటారు. సుద్ధాల అశోక్‌తేజ మంచి పాటలు రాశారు’’ అన్నారు.  ‘‘రాజేంద్రప్రసాద్‌గారితో కలసి నటిస్తాననుకోలేదు. ఆయనతో ప్రేమలో పడి పోయా. కుటుంబమంతా ఎంజాయ్‌ చేసే చిత్రమిది’’ అన్నారు సంజోష్‌. ‘‘ఎక్కడా రాజీపడకుండా నిర్మించాం. ‘మీ శ్రేయోభిలాషి’ చిత్రానికి రచయితగా పని చేసిన రమేష్‌ ఈ చిత్రంతో దర్శకుడిగా మారడం సంతోషంగా ఉంది.

ఆస్ట్రేలియా ప్రభుత్వం రాజేంద్రప్రసాద్‌గారిని జీవిత సాఫల్య పురస్కా రంతో సత్కరించడం హ్యాపీ’’ అన్నారు నిర్మాతలు. ‘‘మహానటుడు రాజేంద్రప్రసాద్‌తో యాక్ట్‌ చేయడం గర్వంగా ఉంది. కాశం నమశివాయగారి వల్లే చిత్రం పూర్తి చేశాం’’ అన్నారు రమేష్‌ చెప్పాల.  ‘‘బేవర్స్‌ చెడ్డ పదం కాదు. ఎందుకూ పనికి రాని వాడు అని అర్థం. స్క్రీన్‌ మీద రాజేంద్రప్రసాద్‌ ఉన్నారు, రమేశ్‌ హిట్‌ కొట్టబోతున్నాడు’’ అన్నారు నిర్మాత రాజ్‌ కందుకూరి. ‘‘రాజేంద్రప్రసాద్‌ అంటే నవ్వులే. ఆ నవ్వుల వెనక ఫిలాసఫర్‌ కనపడతారు నాకు. ప్రధాని పీవీ నరసింహా రావు కూడా ఆయన సినిమాలు చూసి సేద తీరేవారట. నాతో ప్రత్యేకంగా పాట రాయించుకున్నారు’’ అన్నారు సుద్ధాల అశోక్‌ తేజ.

మరిన్ని వార్తలు