'భాగ్ మిల్కా భాగ్' అంచనాలను దాటేసింది: మెహ్రా

23 Jul, 2013 02:40 IST|Sakshi
'భాగ్ మిల్కా భాగ్' అంచనాలను దాటేసింది: మెహ్రా

'భాగ్ మిల్కా భాగ్' చిత్రం తమ అంచనాలను దాటేసింది అని ఆ చిత్ర దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా అన్నారు. ఫ్లయింగ్ సిక్కు మిల్కా సింగ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బాలీవుడ్ చిత్రం 'భాగ్ మిల్కా భాగ్' ప్రపంచమంతటా విజయవంతంగా ప్రదర్శించబడుతున్న సంగతి తెలిసిందే. భాగ్ మిల్కా భాగ్ చిత్రం వసూలు చేస్తున్న కలెక్షన్లు తమ అంచనాలను మించాయన్నారు.

ఈ చిత్రం తొలివారం 55 కోట్ల రూపాయలను వసూలు చేసింది అని, రెండవ వారంలో కేవలం ముంబైలోనే 3.58 కోట్లు రాబట్టిందన్నారు. మిల్కా జీవిత కథలో ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉన్నాయని తాము మొదటి నుంచి నమ్ముతూ వస్తున్నామని.. అయితే ఇంతటి ఘన విజయాన్ని సాధిస్తుందని తాము అనుకోలేదన్నారు.

'భాగ్ మిల్కా భాగ్' చిత్ర విజయ ప్రభావం బాలీవుడ్ పై ఎక్కువగానే పడినట్టు కనిపిస్తోంది. బాక్సర్ మేరి కోమ్, క్రికెటర్ అజారుద్దీన్, హకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జీవిత కథతో చిత్రాలు నిర్మాణానికి సిద్ధమవుతున్నాయి.