'భాగ్ మిల్కా భాగ్' రివ్యూ!

13 Jul, 2013 00:57 IST|Sakshi
'భాగ్ మిల్కా భాగ్' రివ్యూ!
‘ఫ్లయింగ్ సిక్కు’గా ప్రపంచానికి సుపరిచితుడైన ఓ స్టార్ అథ్లెట్ మిల్కాసింగ్ జీవిత కథను అధారంగా చేసుకుని యువ దర్శకుడు, నటుడు ఫర్హాన్ అక్తర్, స్టార్ డెరైక్టర్ రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా కలయికలో ‘భాగ్ మిల్కా భాగ్’ చిత్రం రూపొందింది. ప్రమోషన్, ప్రచార కార్యక్రమాలతో విడుదలకు ముందే భారీ అంచనాలను పెంచుకున్న ‘భాగ్ మిల్కా భాగ్’జూన్ 12 తేదిన విడుదలైంది. ఎన్నో ప్రత్యేకతలను సంతరించుకున్న ఈ చిత్రంప్రేక్షకులఅంచనాలను చే రుకుందా అనే విషయాన్ని పరిశీలిద్దాం!
 
 దేశ విభజన సమయంలో పాకిస్థాన్‌లో కుటుంబాన్ని కోల్పోయిన మిల్కాసింగ్ అనే బాలుడు ప్రాణాలను రక్షించుకోవడానికి ఢిల్లీకి చేరుకుంటాడు. ఆతర్వాత సైన్యంలో జవాన్‌గా చేరిన మిల్కాసింగ్ ఓ సూపర్ స్టార్ అథ్లెట్‌గా ఎలా మారాడు. అతని జీవితంలో చోటుచేసుకున్న ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడు. అనేక ఒడిదుడుకుల మధ్య తాను అనుకున్నది లక్ష్యాన్ని సాధించాడా అనే ప్రశ్నలకు సమాధానమే ’భాగ్ మిల్కా భాగ్’.
 
 ఓ అథ్లెట్ జీవితంలో చోటు చేసుకున్న ఒడిదుడుకలకు తోడుగా డ్రామా, ఎమోషన్, హ్యూమర్, విషాదం అనే అంశాలతోపాటు సృజనాత్మకతను జోడించడంలో రచయిత ప్రసూన్ జోషి చక్కటి ప్రతిభను కనబర్చారు. ప్రసూన్ జోషి అందించిన స్క్రీన్‌ప్లే, మాటలు భాగ్ మిల్కా భాగ్ చి్రత్రానికి అదనపు బలంగా మారాయి.ఓ ఆటగాడి జీవిత కథకుప్రసూన్ జోషి అందించిన పక్కా స్క్రీన్‌ప్లేతో ‘భాగ్ మిల్కా భాగ్’ను దర్శకుడు రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా  గొప్ప చిత్రంగా తెరకెక్కించడంలో సఫలమయ్యారు. దర్శకుడి విజన్‌కు తగినట్టుగా, ప్రేక్షకుడి గురి తప్పకుండా బ్యాలెన్స్ చేయడంలో  పి భారతి ఎడిటింగ్ పనితీరు ప్రశంసనీయం. బినోద్ ప్రదాన్  కెమెరా, శంకర్, ఎహసాన్, లాయ్‌ల సంగీతం ప్రేక్షకుల ఊహాలకు అందనంత ఎత్తుకు ఈ చిత్రాన్ని తీసుకువెళ్లాయి. 
 
 ఇక చిత్రంలో మిల్కాసింగ్ పాత్ర పోషించిన ఫర్హాన్ అక్తర్ నటన మరో ఎత్తు. ఓ అథ్లెట్ పాత్రలో నటించడానికి, తన దేహాన్ని పూర్తిగా మార్చుకోవడానికి ఫర్హాన్ అక్తర్ పడిన కష్టం, తాపత్రయం, కృషి, పట్టుదల తెరపై చూడాల్సిందే. మిల్కాసింగ్ పాత్రలో ఫర్హాన్ అక్తర్ నటించాడు అనడం కన్నా.. పరకాయ ప్రవేశం చేశాడని అనడంలో సందేహం అక్కర్లేదు. ‘భాగ్ మిల్కా భాగ్’ను ఫర్హాన్ అక్తర్ ఒక్కడే ఒంటి చెత్తో నడిపించాడు. ఫర్హాన్ అక్తర్ అందించిన అత్యుత్తమ నటనను పూర్తి వినియోగించుకోవడమే కాకుండా... థియేటర్‌లో ప్రేక్షకులు సైతం ‘భాగ్ మిల్కా భాగ్’ అని అరిచేంత స్థాయిలో ఈ చిత్రాన్ని అందించడంలో దర్శకుడు రాకేశ్ ఓం ప్రకాశ్ మెహ్రా పూర్తిగా న్యాయం చేశాడు. ఫర్హాన్ అక్తర్‌తోపాటు ఈ చిత్రంలో నటించిన హీరోయిన్ సోనమ్ కపూర్, ఆస్ట్రేలియా నటి రెబాకా బ్రీడ్స్, దివ్యదత్తా, ప్రకాశ్ రాజ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. 

 

>