ఎంతిచ్చినా అలాంటి పాత్రలో నటించను

22 Oct, 2017 06:14 IST|Sakshi

తమిళసినిమా: ఎంత డబ్బిచ్చినా ఆ పాత్రల్లో నటించనంటోంది నటి అనుష్క. ఈ స్వీటీ మంచి నటే ఆ విషయాన్ని ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సాంఘికం, చారిత్రకం ఎలాంటి పాత్రలైనా అవలీలగా నటించి వాటికి ప్రాణం పోయగల సత్తా ఉన్న నటి అనుష్క. అలాంటి అమ్మడి చేతిలో ప్రస్తుతం ఒక్క చిత్రం లేదన్నది అందర్నీ ఆశ్చర్యపరచే విషయం. ఇప్పటికి అనుష్క నటించిన చివరి చిత్రం బాహుబలి–2. ఆ చిత్రంలో దేవసేనగా అద్భుత అభినయాన్ని ప్రదర్శించి ప్రశంసలు అందుకుంది. అనుష్క నటించి చాలా కాలం నిర్మాణంలో ఉన్న భాగమతి చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదలకు ముస్తాబవుతోంది. తదుపరి చిత్రం ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది.

ఆ సుందరి పెళ్లికి రెడీ అవుతోందని, అందువల్ల కొత్త చిత్రాలను అంగీకరించడం లేదనే ప్రచారం ఒక పక్క జరుగుతోంది. తను మాత్రం అలాంటిదేమీ లేదంటోంది. దీని గురించి ఈ ముద్దుగుమ్మ ఏమంటుందో చూద్దాం. ప్రతిభకు అద్దం పట్టే మంచి పాత్రలు లభించడం చాలా ముఖ్యం. నాకంటే ప్రతిభావంతులు చాలా మంది ఉన్నా అదృష్టవశాత్తు నాకు నటనకు అవకాశం ఉన్న కథా పాత్రలు లభించాయి. అందువల్లే నాలోని ప్రతిభను చాటుకోగలిగాను. సినిమా కోసం ప్రాణాలను పణంగా పెట్టే దర్శకులు ఉన్నారు. అలాంటి వారి చిత్రాల్లో నటించే అవకాశం నాకు కలిగింది. అరుంధతి, రుద్రమదేవి, ఇంజి ఇడుప్పళగి లాంటి చిత్రాలు అలాంటివే. నా సినీ జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రం అరుంధతి.

ఇంజి ఇడుప్పళగి వ్యక్తిగతంగా సంతృప్తినిచ్చిన చిత్రం. ఇక బాహుబలిలో మరో కోణంలో కనిపించాను. ఈ చిత్రాలు నా చేయి దాటిపోతే చాలా బాధపడేదాన్ని. ఇక ఈ చిత్రాల్లో నన్ను కాకుండా వేరే నటిని కలలో కూడా ఊహించలేరు. ముఖ్యమైన విషయం ఏమిటంటే నటీనటులు ప్రతిభను ప్రదర్శించలేరు. వారి ప్రతిభ వెనుక దర్శకులు ఉంటారు. వారే కథా పాత్రలను చెక్కి చక్కగా వెండితెరపై ఆవిష్కరించి మాలాంటి వారికి పేరు తెచ్చిపెడుతున్నారు. నా వరకూ కథ, దర్శకుడే ముఖ్యం. ఎంత డబ్బు ఇచ్చినా సత్తా లేని చెత్త కథా పాత్రల్లో నటించను. అలాంటి మంచి పాత్రలు వస్తే వెంటనే అంగీకరిస్తాను.

మరిన్ని వార్తలు