భల్లాల దేవుడి రథం ఎలా పరుగులు తీసింది?

8 May, 2017 14:34 IST|Sakshi
భల్లాల దేవుడి రథం ఎలా పరుగులు తీసింది?

వెయ్యికోట్ల కలెక్షన్లు దాటిన మొట్టమొదటి భారతీయ సినిమాగా బాహుబలి-2 రికార్డులు బద్దలుకొట్టింది. చాలావరకు థియేటర్లలో ఇప్పటికీ ఏ రోజు టికెట్లు ఆరోజు దొరకడం కష్టంగానే ఉండటంతో రూ. 1500 కోట్లు కూడా దాటేయొచ్చని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. సినిమాలో చాలా విశేషాలే ఉన్నా.. అన్నింటికంటే ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేవాటిలో భల్లాల దేవుడు వాడిన కత్తుల రథం ఒకటి. ముందు భాగంలో కత్తులతో కూడిన ఆ రథం మీద భల్లాలదేవుడు మొదటి భాగంతో పాటు రెండో భాగంలో కూడా హల్‌చల్ చేస్తాడు. మొదటి భాగంలో ఆ రథం ఎలా నడిచిందో కూడా చూపించలేదు గానీ, రెండో భాగంలో మాత్రం దున్నపోతులు దాన్ని లాక్కెళ్తున్నట్లు గ్రాఫిక్స్‌లో చూపించారు.

అయితే అసలు ఆ రథం అంత శరవేగంగా ఎలా వెళ్లిందన్నది ఇప్పటికీ చాలామందికి తెలియని రహస్యమే. దానికి రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంజన్ ఉపయోగించారట. ఆ విషయాన్ని సినిమా ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. దాని శక్తితోనే కావల్సినంత వేగంగా రథం వెళ్లింది. ఈ రథాన్ని పూర్తిగా సాబు సిరిల్, ఆయన బృందమే తయారుచేసింది. అంతేకాదు.. రథం ముందు భాగంలో ఒక కారు స్టీరింగ్, దానికి ఒక డ్రైవర్ కూడా ఉన్నారట. ఆ డ్రైవరే రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంజన్‌తో కూడిన రథాన్ని నడిపిస్తుంటారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇంజన్లు సులభంగా ఎక్కడైనా బిగించే అవకాశం ఉండటం, దానికితోడు మంచి వేగంగా తీసుకెళ్లగలిగే శక్తి ఉండటంతో దాన్నే ఈ రథానికి ఉపయోగించుకున్నారు. 350 లేదా 500 సీసీ సింగిల్ సిలిండర్ మోటార్‌ను ఉపయోగించి ఉంటారని భావిస్తున్నారు.