భానుప్రియకు సమస్యలు తప్పవా?

28 Jan, 2019 21:58 IST|Sakshi

చెన్నై: నటి భానుప్రియ పనిమనిషి వ్యవహారంలో సమస్యలను ఎదుర్కోకతప్పదా? ఇప్పుడు కోలీవుడ్‌లో జరుగుతున్న చర్చ ఇదే. భానుప్రియ ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లా, సామర్లకోట ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల బాలికను ఇంటి పనిమనిషిగా పెట్టుకున్న విషయం వివాదాలకు దారి తీసిన విషయం తెలిసిందే. పనిమనిషిని వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆమె తల్లి సామర్లకోట పోలీస్‌స్టేషన్‌లో భానుప్రియపై ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా ఈ వ్యవహారంపై స్పందించిన భానుప్రియ పనిమనిషి తమ ఇంట్లో రూ.లక్షన్నర విలువ చేసే 30 కాసుల బంగారాన్ని దొంగిలించిందని, వాళ్ల అమ్మ వాటిని తిరిగి ఇస్తానని చెప్పి ఇప్పుడు తమపైనే ఆరోపణలు చేస్తోందని వివరణ ఇచ్చారు. ఈ చోరీ వ్యవహారం, వేధింపుల విషయం ఎలా ఉన్నా బాలికను పనిలో పెట్టుకోవడం నేరం అవుతుంది.

ఇది బాలకార్మిక చట్టం ప్రకారం అలాంటి వారిపై 2 ఏళ్ల జైలు శిక్ష, రూ.50 వేలజరిమానా పడే అవకాశం ఉంది. తాను ఏజెంట్‌ ద్వారా పనిపిల్లను నియమించుకున్నానని, అందువల్ల ఆ పిల్ల వయసు తెలియలేదని చెప్పారు. దీన్ని పోలీసులు, బాల కార్మిక చట్టం పరిధిలోకి తీసుకుంటుందా? ప్రస్తుతం పనిమనిషిని నటి భానుప్రియ ఇంటి నుంచి పోలీసులు విడిపించి బాలల సంరక్షణ విభాగానికి అప్పగించారు. అనంతరం ఆ బాలిక వాంగ్మూలం తీసుకుని తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉందని సమాచారం. నటి భానుప్రియ ఈ సమస్య నుంచి బయట పడతారా? లేక జరిమానాకు గురవుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది.  

మరిన్ని వార్తలు